జిన్‌పింగ్: నాడు పార్టీలో ప్రవేశం లేని వ్యక్తి.. నేడు జీవితకాల అధ్యక్షుడిగా ఎలా మారారు?

  • 12 మార్చి 2018
షీ జిన్‌పింగ్

ఒక గుహలో ఉంటూ, పొలాల్లో కష్టపడుతూ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకులు చాలా అరుదు.

ఐదు దశాబ్దాల క్రితం సాంస్కృతిక విప్లవ పవనాలు బీజింగ్‌ను అల్లకల్లోలం చేస్తున్నపుడు 15 ఏళ్ల షీ జిన్‌పింగ్.. చైనాలోని పర్వతాల మధ్య అత్యంత కఠినమైన గ్రామీణ జీవితాన్ని గడుపుతున్నారు.

ప్రస్తుతం జిన్‌పింగ్ జీవితకాల దేశాధ్యక్షుడిగా కొనసాగేందుకు రాజ్యాంగాన్నే సవరించారు. ఈ సందర్భంలో జిన్‌పింగ్ గత జీవితాన్ని ఇప్పుడు కథలుకథలుగా చెబుతున్నారు. ఆయన పెరిగిన గ్రామం ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ విధేయులకు యాత్రాస్థలంగా మారింది.

Image copyright Getty Images

హోర్డింగులపై జిన్‌పింగ్ ఆలోచనా విధానం

1968 లో మావో వేలాది మంది యువకులను నగరాల నుంచి గ్రామాలకు వెళ్లి వాళ్ల కష్టాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆదేశించారు.

ఆ సందర్భంగా తాను ఒక గుహలో గడిపిన జీవితమే తనకు పాఠాలు నేర్పిందని జిన్‌పింగ్ అంటారు. ''నేనెన్నడూ భూమి పుత్రుణ్నే'' అంటారాయన.

15 ఏళ్ల వయసులో ఆయన చాలా గందరగోళంగా, ఎలాంటి దిశ లేకుండా ఉండేవారు. 22 ఏళ్ల వయసులో గ్రామీణ ప్రాంతాన్ని వదిలే సమయంలో జీవిత లక్ష్యంపై ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడింది.

గతంలో ప్రతి ఒక్కరూ మావో రెడ్ బుక్‌ను శ్రద్ధగా చదివేవాళ్లు. ఇప్పుడు జిన్‌పింగ్ ఆలోచనా విధానం పెద్ద పెద్ద ఎర్రని హోర్డింగులపై కనిపిస్తుంది. ఆయన పేరుతో ఒక మ్యూజియం కూడా నెలకొల్పారు.

జిన్‌పింగ్ బాల్యం

2009లో వికీలీక్స్ విడుదల చేసిన రహస్య పత్రాలలో జిన్‌పింగ్ సన్నిహితుడు ఒకరు వెల్లడించిన వివరాల మేరకు జీవితంలోని మొదటి పదేళ్లు ఆయన తదుపరి జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి.

మావో కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ ఒక గుహలో జీవితాన్ని గడపడం ప్రారంభించే సమయానికి, యువ జిన్‌పింగ్ రెండు రకాల జీవితాలను చూసి ఉన్నారు.

చిన్నప్పుడు ఆయన తండ్రి విప్లవంలో హీరో. అందువల్ల జిన్‌పింగ్‌ను అందరూ ఎంతో గౌరవంగా చూసేవారు.

''తండ్రి కారణంగా ఆయనకు లభించిన గౌరవం, బీజింగ్‌లో కమ్యూనిస్టు విప్లవకారుల కుటుంబాలు ప్రత్యేకంగా నివసించే ప్రాంతంలో పెరగడం.. ఇవన్నీ ఆయన తదుపరి జీవితాన్ని ప్రభావితం చేశాయి'' అని ఆయన స్నేహితుడు తెలిపారు.

అయితే 1960లలో మావో చేపట్టిన పార్టీ ప్రక్షాళనతో జిన్‌పింగ్ ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. ఆయన తండ్రి జైలు పాలు కాగా, కుటుంబం అవమానాల పాలైంది. ఒక సోదరి ఆత్మహత్య చేసుకున్నారు.

13 ఏళ్లు వచ్చేసరికి స్కూళ్లలో అల్లర్ల కారణంగా జిన్‌పింగ్ స్కూల్ జీవితం ముగిసింది.

నిర్బంధాల మధ్య రెండో దశ

తనను రక్షించడానికి తల్లిదండ్రులు లేదా స్నేహితులు లేనిసమయంలో.. సాంస్కృతిక విప్లవం పేరిట రెడ్ గార్డ్స్ వీధుల్లోనే పంచాయితీలు చేస్తుంటే, టీనేజ్ జిన్‌పింగ్ నిర్బంధాల మధ్య తన జీవితంలో రెండో దశను ప్రారంభించారు.

ఆ తర్వాత కాలంలో ఆయన రెడ్‌గార్డ్స్ తనను చంపుతామని బెదిరించారని కూడా గుర్తు చేసుకున్నారు.

అదే సమయంలో ఆయన ఎదుటివాళ్లకు లొంగకుండానే వాళ్ల దృక్పథం నుంచి చూడడం అలవాటు చేసుకున్నారు.

1960లలో గ్రామీణ జీవితం అత్యంత దుర్భరంగా ఉండేది. గ్రామాలలో విద్యుత్ సరఫరా కానీ, రవాణా వ్యవస్థ కానీ ఉండేది కాదు.

టీనేజీలో జిన్‌పింగ్ ఎరువుల తట్టలు మోసేవారు. రోడ్లు, డ్యామ్‌ల నిర్మాణంలో కూలి పనిచేశారు. ఆ సమయంలో ఆయన మరో ముగ్గురితో కలిసి ఒక ఇటుకలపై నిద్రించేవారు. నల్లులు వాళ్లకు నిద్ర లేకుండా చేసేవి.

తిండి దొరక్క వాళ్లు కందమూలాలు, మాడిపోయిన బన్నులు తినాల్సి వచ్చేది. రాత్రిళ్లు జిన్‌పింగ్ పొగచూరిన కిరోసిన్ బుడ్డీ వెలుగులో చదువుకొనేవారు.

18 ఏళ్లు వచ్చేసరికి జిన్‌పింగ్ కమ్యూనిస్టు యూత్ లీగ్‌లో చేరారు. కుటుంబం ఎదుర్కొన్న అవమానాల కారణంగా పలుమార్లు పార్టీలోకి ప్రవేశాన్ని నిరాకరించినా, 21 ఏళ్లు వచ్చేసరికి కష్టపడి పార్టీలో ప్రవేశించగలిగారు.

తన తోటివాళ్లలా కాకుండా జిన్‌పింగ్ చాలా పట్టుదలతో, ఒక లక్ష్యంతో పని చేశారని 2009 వికీలీక్స్‌లో విడుదలైన రహస్య పత్రాలలో ఆయన స్నేహితుడు పేర్కొన్నారు.

జిన్‌పింగ్‌కు 25 ఏళ్లు వచ్చేసరికి ఆయన తండ్రికి రాజకీయంగా పునరావాసం లభించింది. ఆయనను హాంగ్ కాంగ్‌కు దగ్గర్లో ఉన్న గాంగ్‌డాంగ్ ప్రావిన్స్ నిర్వహణకు పంపింది పార్టీ.

తండ్రి నీడలో జిన్‌పింగ్‌ వేగంగా ఎదిగారు. పార్టీలో అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఒక వ్యూహం రచించారు.

మొదట పీఎల్‌ఏ (సైన్యం) ఆఫీసర్ కావడం, తర్వాత వివిధ ప్రొవిన్షియల్స్‌ నాయకుడిగా పని చేయడం, ఆ తర్వాత క్రమంగా పెద్ద హోదాను పొందడం.. మొదటి రోజు నుంచి ఆయన ఆలోచనల్లో ఇది ఉందని స్నేహితుడు పేర్కొన్నారు.

గుహలో ఒంటరితనం, మొదటి పెళ్లి విఫలం కావడం వల్ల జిన్‌పింగ్‌ రిజర్వుడుగా ఉంటారని వెల్లడించారు. అయితే అది ఒక రకంగా ఆయన రాజకీయ జీవితంలో విజయానికి దోహదపడింది.

మావో కాలంలో తన తండ్రి ఎదుర్కొన్న శిక్షను చూసిన జిన్‌పింగ్‌ ఎవరితోను ఎక్కువగా శతృత్వం పెంచుకోలేదు. సీనియర్ పార్టీ నాయకుడిగా కూడా ఆయన ఎన్నడూ అధికార దర్పం ప్రదర్శించేవారు. నిరంతరం కష్టపడి పని చేసేవారు. ఆడంబరాలకు దూరంగానే ఉంటూ, తన సహచరులందరితో కలిసి వ్యాన్లలోనే ప్రయాణించేవారు.

ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెద్దగా లేదని స్నేహితులు చెబుతారు.

2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ నేతగా పగ్గాలు చేపట్టినపుడు ఆయనపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు.

జిన్‌పింగ్‌ తాను అధికారంలోకి రాగానే అవినీతికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రచారం ప్రారంభించారు.

2015లో సీనియర్ పార్టీ లీడర్ జౌ యాంగ్‌కాంగ్‌ను అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. అలాగే బో జిలాయ్ అరెస్ట్ కూడా పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. వాళ్లిద్దరూ కలిసి పార్టీ యూనిట్లను బలహీనపర్చారనే ఆరోపణలు వచ్చాయి.

మావో మరణాంతరం పార్టీ ప్రముఖులను ఏం చేయలేమన్న భావనను జిన్‌పింగ్‌ తుత్తునియలు చేశారు.

Image copyright Getty Images

కానీ ప్రస్తుతం 64 ఏళ్ల జిన్‌పింగ్‌ కేవలం సమాజంలోని ఉన్నత వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆయన అధికారంలోకి రావడానికి కొన్నేళ్ల ముందు ఆయన బంధువుల్లోని కొందరు భారీగా సంపదను కూడబెట్టారు.

చైనాలో హఠాత్తుగా మాయమైపోవడాలు కొత్త కావు. 2017 జనవరిలో అనేక గొప్ప కుటుంబాలతో సంబంధాలున్న 45 ఏళ్ల బిలియనీర్ హాంకాంగ్‌లోని తన అపార్ట్‌మెంట్ నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు.

కొంతమంది గుర్తు తెలియని సాయుధులు ఆయనను తీసుకుకెళ్లిపోయారు.

ప్రస్తుతం ఆయన మెయిన్‌ల్యాండ్ చైనాలో బందీగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

మరోవైపు మన్‌హటన్‌లో ఉన్న మరో చైనా బిలియనీర్ గువో వెన్‌గుయ్ - జిన్‌పింగ్‌కు సన్నిహితుడైన అవినీతి విభాగం చీఫ్ వాంగ్ కిషాన్ కూడా పెద్ద అవినీతిపరుడని క్రమం తప్పకుండా యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

వెన్‌గుయ్ వీడియోలు చైనాలో రాజకీయాలు, వ్యాపారాలకు మధ్య ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తున్నాయి.

Image copyright CHINA DAILY

నిజంగానే అవినీతిని నిర్మూలిస్తున్నారా?

దేశంలో అన్ని అవినీతి విచారణలూ రహస్యంగానే జరుగుతున్నాయి. అవినీతిని అంతం చేస్తామని చెబుతున్నా, ఏ కోర్టుల్లో కానీ వాటిపై బహిరంగ విచారణలు జరగడం లేదు. విచారణలన్నీ కేవలం జిన్‌పింగ్ కనుసన్నల్లో జరుగుతున్నాయన్న ఆరోపణ ఉంది.

అయితే సోషల్ మీడియాలో జిన్‌పింగ్‌పై వస్తున్న విమర్శలను మాత్రం ప్రభుత్వం కట్టడి చేయలేకుంది.

చైనాలో 75 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ యూజర్లున్నారు. సైబర్ సూపర్ పవర్ కావాలని భావిస్తున్న చైనా, రాజకీయ కట్టుబాట్లు అతిక్రమిస్తే మాత్రం ఒప్పుకోదు.

జిన్‌పింగ్ ఎదుట ప్రస్తుతం రెండు సమస్యలున్నాయి. ఒకటి పార్టీలోని తన ప్రత్యర్థులు, రెండోది ఇంటర్నెట్ నియంత్రణ ఎలా? అన్నది.

సంస్కరణల కాలంలో అనేక మంది.. దేశంలో ఆధునిక వ్యవస్థ కోసం వికేంద్రీకృత నిర్ణయాలు ఉంటాయని, ఇంటర్నెట్ స్వేచ్ఛ కూడా వాటిలో ఒక భాగం అవుతుందని భావించారు. అయితే జరిగింది వేరు.

Image copyright Reuters,Alamy,EPA,Shutterstock,Wikimedia Common

సైబర్ స్పేస్‌పై పట్టుకోసం జిన్‌పింగ్ హయాంలో ఇంటర్నెట్‌పై అనేక రకాల నిర్బంధాలు, చట్టాలు రూపొందించారు. వాటిని అతిక్రమించే వాళ్లకు జైలు శిక్ష తప్పదు.

చైనాలో ప్రైవసీ ప్రొటెక్షన్ లేదు. అందువల్ల ప్రతి మొబైల్ ఫోన్ ఒక సెన్సార్‌షిప్ పరికరమే.

ఇవాళ మొబైల్ ఫోన్ డాటా, ఫేషియల్ రెకగ్నిషన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంతర్గత భద్రతా వ్యవస్థను జిన్‌పింగ్ తన అదుపులో పెట్టుకున్నారు.

1989లో తియానాన్మెన్ స్క్వేర్‌లో జరిగిన సంఘటనలు ఎన్నడూ పునరావృతం కాకూడదని జిన్‌పింగ్ కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే సైబర్ స్పేస్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు.

Image copyright Reuters,Alamy,EPA,Shutterstock,Wikimedia Common

వాణిజ్యంలో చైనా దురాశ

2014లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ జిన్‌పింగ్‌ను కలవడానికి ముందు, చైనా విధానం దురాశ, భయాల మీద ఆధారపడినదని వ్యాఖ్యానించారు.

నయానో, భయానో చైనా అంతర్జాతీయ వాణిజ్యంపై తన పట్టు ఉండాలనుకుంటోంది. దానికి తోడు ప్రపంచంలోని బడా సంస్థలన్నీ వాణిజ్య అవసరాల కోసం చైనాతో భాగస్వామ్యం కోసం తహతహలాడుతున్నాయి.

మార్క్సిజం, మార్కెట్లను కలిపి మాట్లాడడంలో జిన్‌పింగ్ నిపుణులు.

అయితే సోషల్ మీడియా వల్ల ప్రమాదాలు ఊహిస్తున్న జిన్‌పింగ్, ఫేస్‌బుక్‌ను మాత్రం దేశంలోకి అనుమతించడం లేదు.

సోవియట్ బ్లాక్‌లో కమ్యూనిజం కూలిపోవడం కూడా జిన్‌పింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. మాస్కో తన విప్లవ చరిత్రను వదులుకున్నపుడే దాని ప్రాధాన్యతను కోల్పోయిందనేది జిన్‌పింగ్ భావన.

Image copyright Getty Images

స్వేచ్ఛాస్వాతంత్ర్యాలపై జిన్‌పింగ్‌కు తనవైన భావాలున్నాయి. చైనా పాశ్చాత్య విలువలను అనుసరిస్తే ఒక దేశంగా స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కోల్పోతామనేది ఆయన అభిప్రాయం.

వ్యక్తిస్వేచ్ఛను జిన్‌పింగ్ భరించలేరు. క్రిస్టియన్లు, ముస్లింలు, బ్లాగర్లు, రిపోర్టర్లు, ఫెమినిస్టులు, లాయర్లు.. ఇలా అనేక మంది విమర్శకులు జైలు పాలయ్యారు. కొన్ని భావాలపై 'దేశ భద్రతకు ప్రమాదం' అని ముద్ర వేయడం జిన్‌పింగ్ రాజకీయాల్లో ఒక భాగం.

ప్రస్తుతం చైనా సంస్కృతి, చైనా జాతి, సోషలిస్టు పంథాపై జిన్‌పింగ్ అభిప్రాయాలు రోడ్ల పక్కన, టీవీలలో, ఆన్‌లైన్‌లో, మొబైల్ యాప్స్‌లో, స్లోగన్స్ రూపంలో కనిపిస్తాయి.

ఒకసారి ఆయన 'కత్తిని రాయి మీద సానపెడతారు. అలాగే మనిషి కష్టాలతో రాటుదేలతాడు' అన్నారు.

ఏదేమైనా.. మావో తర్వాత ఒక దేశం ఇంత ఎక్కువగా ఒక వ్యక్తి మీద ఆధారపడడం మాత్రం బహుశా ఇప్పుడే కావచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)