నేపాల్: కఠ్మాండూలో కూలిన విమానం.. 8 మంది మృతి

  • 12 మార్చి 2018
కూలిన విమానం లోనుంచి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది Image copyright SAROJ BASNET
చిత్రం శీర్షిక కూలిన విమానం లోనుంచి ప్రయాణికులను రక్షించేందుకు సమాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు

నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం కూలిపోయింది.

బంగ్లాదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థ యూఎస్-బంగ్లాకి చెందిన విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే మీద ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి మంటలు చెలరేగాయి.

ప్రమాద సమయంలో ఆ విమానంలో 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సహా మొత్తం 71 మంది ఉన్నట్లు అధికారులు బీబీసీకి తెలిపారు.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.

అయితే.. మృతుల సంఖ్య 27 అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది. వివిధ మీడియా సంస్థల కథనాల ప్రకారం 17 మంది నుంచి 30 మంది వరకూ క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

Image copyright TWITTER/@BISHNUSAPKOTA

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను ఆర్పివేసి విమానం నుంచి గాయపడ్డవారిని, చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీశారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో, ఫొటోల్లో విమానాశ్రయం రన్ వే వద్ద భారీగా పొగలు ఎగిసిపడుతున్నాయి.

ప్రమాదానికి గురైన విమానం ఎస్2-ఏజీయూ - బొంబార్డియర్ డాష్ 8 క్యూ400 విమానం అని స్థానిక మీడియా చెప్తోంది. కానీ ఈ విషయం అధికారికంగా ధృవీకరణ కాలేదు.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు కఠ్మాండూ విమానాశ్రయంలో ఈ విమానం దిగినట్లు ఫ్లైట్‌రాడార్24 వెబ్‌సైట్ సమాచారం చెప్తోంది.

కఠ్మాండూ విమానాశ్రయం నుంచి అన్ని విమానాల రాకపోకలనూ రద్దు చేసినట్లు కఠ్మాండూ పోస్ట్ పేర్కొంది.

.... ఈ వార్త అప్‌డేట్ అవుతోంది....

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)