కఠ్మాండూ విమాన ప్రమాదం: మృతులు 49 మంది

  • 12 మార్చి 2018
కూలిన విమానం నుంచి ఎగసిపడుతున్న మంటలు Image copyright BISHNU SAPKOTA

నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో 71 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన దుర్ఘటనలో 49 మంది చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. మరో 22 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

బంగ్లాదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థ యూఎస్-బంగ్లాకి చెందిన బీఎస్211 విమానం సోమవారం మధ్యాహ్నం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే మీద ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి మంటలు చెలరేగాయి.

‘‘ఢాకా నుంచి మామూలుగానే టేకాఫ్ తీసుకున్న విమానం కఠ్మాండూ సమీపంచే సరికి అసాధారణంగా ప్రవర్తించటం మొదలైంది. అకస్మాత్తుగా విపరీతంగా కంపించింది. ఆ వెంటనే పెద్ద శబ్దం వినిపించింది’’ అని ప్రమాదం నుంచి గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రావెల్ ఏజెంట్ బసంతా బొహోరా వివరించారు.

Image copyright SAROJ BASNET
చిత్రం శీర్షిక కూలిన విమానం లోనుంచి ప్రయాణికులను రక్షించేందుకు సమాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు

‘‘నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. కిటికీ పగులకొట్టి బయటపడగలిగాను. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. ఎవరో నన్ను సీనామంగళ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నా మిత్రులు నన్ను నార్విక్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. నా తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. కానీ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాను’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను ఆర్పివేసి విమానం నుంచి గాయపడ్డవారిని, చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీశారు.

కఠ్మాండూ విమానాశ్రయం నుంచి అన్ని విమానాల రాకపోకలనూ రద్దు చేసినట్లు కఠ్మాండూ పోస్ట్ పేర్కొంది.

Image copyright EPA
చిత్రం శీర్షిక ఈ విమాన ప్రమాదానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు

ప్రమాదంలో మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై తక్షణమే దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు.

ప్రమాదం ఎలా జరిగింది?

ప్రమాదానికి గురైన విమానం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి కఠ్మాండూకు వచ్చింది. ఎస్2-ఏజీయూ - బొంబార్డియర్ డాష్ 8 క్యూ400 టర్బోప్రాప్ విమానం 17 ఏళ్ల నుంచి వినియోగంలో ఉంది.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు కఠ్మాండూ విమానాశ్రయంలో ఈ విమానం దిగినట్లు ఫ్లైట్‌రాడార్24 వెబ్‌సైట్ సమాచారం చెప్తోంది.

‘‘విమానం రన్‌వే దక్షిణం వైపు నుంచి ల్యాండ్ అవటానికి అనుమతించటం జరిగింది. కానీ అది ఉత్తరం వైపు నుంచి ల్యాండ్ అయింది. ఇందుకు కారణమేమిటనేది తెలియదు’’ అని నేపాల్ పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ సంజీవ్ గౌతమ్ పేర్కొన్నట్లు కఠ్మాండూ పోస్ట్ తెలిపింది.

అయితే.. కఠ్మాండూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇమ్రాన్ ఆసిఫ్ ఆరోపించారు.

‘‘మా పైలట్ ఏ పొరపాటూ చేయలేదు. (ఏటీసీ) టవర్ నుంచి తప్పుడు నిర్దేశాలు ఇచ్చారు’’ అని ఆయన ఢాకాలో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. విమానం నేలను తాకేముందు ఎయిర్‌పోర్ట్ ఫెన్స్‌ను ఢీకొందని కఠ్మాండూ విమానాశ్రయం జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ చెట్టి రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

‘‘ల్యాండ్ కావటానికి ముందు అంతా బాగానే ఉందని ఫ్లైట్ కంట్రోలర్లతో పైలట్ చెప్పారు. విమానం సక్రమంగా రావటం లేదని వారు చెప్పినపుడు ఆ పైలట్ స్పందించలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రయాణికుల్లో ఏ దేశం వారు ఎంతమంది?

నేపాల్‌లో కూలిన విమానంలో 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.

ప్రయాణికుల జాబితా ప్రకారం వివరాలివీ... నేపాల్ జాతీయులు 33 మంది, బంగ్లాదేశీయులు 32 మంది, మాల్దీవులు, చైనాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు.

1992లో బ్యాంకాక్ నుంచి వచ్చిన థాయ్ ఎయిర్‌వేస్ విమానం కఠ్మాండూలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 113 మందీ చనిపోయారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)