ఆమిర్ ఖాన్‌కు చైనాలో అంత ఫాలోయింగ్ ఎందుకు?

  • 14 మార్చి 2018
ఆమిర్ ఖాన్ Image copyright Getty Images

భారత్‌తో చైనాకు బలమైన సంబంధాలు లేవు. ఇక్కడి సినిమాలు కూడా అక్కడ పెద్దగా ఆడవు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు కూడా చైనాతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. కానీ ఆమిర్ ఖాన్ సినిమాలు మాత్రం వీటన్నింటికీ అతీతంగా చైనాలో అనూహ్య స్పందనను అందుకుంటున్నాయి.

ఆమిర్ సినిమాలు భారత్‌లోని పరిస్థితులను చైనీయులకు మరింత చేరువ చేస్తున్నాయి. ఆ దేశంలో ఆమిర్ నటించిన ‘దంగల్‌’ సినిమా కలెక్షన్లే చైనాలో అతడికి ఉన్న ఆదరణకు ఉదాహరణ. అక్కడ ‘దంగల్’ రూ.1300కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిందని సినిమా ట్రేడ్ విశ్లేషకులు చెబుతారు.

బుధవారంనాడు(మార్చి 14) తన పుట్టినరోజును జరుపుకుంటున్న ఆమిర్ ఖాన్, చైనాలో తన తాజా చిత్రం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సాధించిన విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు.

గతేడాది చైనాలో దంగల్ సాధించిన విజయానికి కొనసాగింపుగా ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ కూడా అభిమానుల ఆదరణను దక్కించుకుంది.

2013లో జాకీచాన్ భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో భారతీయ సినిమాల గురించి అడిగినప్పుడు ‘నాకు తెలిసింది త్రీ ఇడియట్స్, ఆమిర్ ఖాన్, బాలీవుడ్ డాన్స్ మాత్రమే’ అన్నారు.

అప్పుడే చైనా సినీ అభిమానులు ఆమిర్ ఖాన్‌ను బాగా ఇష్టపడతారనే విషయం ఎక్కువమందికి తెలిసింది. ఆ ఇష్టం ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌కు చైనా సినీ అభిమానులకూ మధ్య ఓ ప్రేమ కథలా మారింది.

బాలీవుడ్ సినిమాలకు చాలా దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. కానీ చైనాలో మాత్రం 1950ల్లో రాజ్ కపూర్ తరవాత ఆమిర్ ఖాన్ మినహా మరే ఇతర భారతీయ సినిమా స్టార్‌కూ ఆ స్థాయి ఆదరణ దక్కలేదు.

Image copyright facebook/aamirkhan

మోదీకన్నా ముందే

ఆమిర్ ఖాన్‌తో పాటు భారత ప్రధాని మోదీకి కూడా చైనాకు చెందిన సోషల్ మీడియా వెబ్‌సైట్ ‘వీబో’లో ఎకౌంట్ ఉంది. అందులో మోదీకి 1.83లక్షల మంది ఫాలోయిర్లు ఉంటే, ఆమిర్‌కు దాదాపు 12.5లక్షల మంది ఫాలోయిర్లు ఉన్నారు. అంటే ప్రధానికంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా ఆమిర్‌ను అనుసరిస్తున్నారు.

ఆమిర్ వీబోలో తరచూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటారు. చైనీయుల పండగలకు శుభాకాంక్షలు చెప్పడం, వీడియోలు పంచుకోవడం, ఫొటోలు షేర్ చేయడం ద్వారా వీబీలో అభిమానులతో టచ్‌లో ఉంటారు.

2000లో ‘లగాన్’ విడుదలైనప్పుడే చైనా ప్రేక్షకులకు ఆమిర్ ఖాన్ గురించి తొలిసారి తెలిసింది. కానీ చైనాలో ‘త్రీ ఇడియట్స్’ విడుదలయ్యాక అతడి పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ధూమ్3, పీకే, దంగల్ చిత్రాలతో క్రమంగా అక్కడి వారికి ఆమిర్ మరింత దగ్గరయ్యారు.

Image copyright Weibo

ఆమిరే ఎందుకు?

ఏ ఇతర హీరో చేయలేని విధంగా ఆమిర్ ఖాన్ ‘చైనా గోడ’ను దాటి అంతమంది అభిమానుల్ని ఎలా సంపాదించారన్నది ఆసక్తికరం. ఆమిర్ ఖాన్ సినిమాలు చైనా యువత ఆలోచనలకు దగ్గరగా ఉంటాయనీ, వాటిలో పాత్రలతో యువత తమను తాము పోల్చుకోవడం వల్లే ఆమిర్‌కు ఆదరణ పెరిగిందనీ చైనా మీడియా చెబుతోంది.

హాలీవుడ్ ఫిక్షన్‌ సినిమాలతో పోలిస్తే సామాజిక న్యాయం, లింగ సమానత్వం, లక్ష్యాల్ని చేరుకోవడం, కుటుంబ విలువల లాంటి అంశాల్ని స్పృశించే సినిమాలనే చైనీయులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆమిర్ సినిమాలు ఎక్కువగా ఆ కోవలోకి చెందినవే వస్తున్నందున్న అక్కడి వారు అతడికి త్వరగా దగ్గరయ్యారు.

‘త్రీ ఇడియట్స్’ సినిమాకు స్కూళ్లూ కాలేజీల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసి మరీ విద్యార్థులకు చూపించారు.

దంగల్ విడుదలతో చైనాలో ఆమిర్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా అక్కడ దాదాపు 9వేల స్క్రీన్లపై విడుదలై అనూహ్య విజయం సాధించింది.

తమ తల్లిదండ్రుల ఆకాంక్షలు, తమ ఆశయాలకు ఆ సినిమా దగ్గరగా ఉండటం వల్లే దంగల్ తమకు బాగా నచ్చిందని అక్కడి అభిమానులు గతంలో బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

Image copyright facebook

‘దంగల్‌’ను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా చూశారనీ, ఆమిర్ నటన తనకు బాగా నచ్చిందని భారత ప్రధాని మోదీతో చెప్పారనీ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌.జయశంకర్ గతేడాది అన్నారు.

చైనీయుల ఆదరణను ఆమిర్ కూడా ఆస్వాదిస్తున్నారు. ‘చైనా రావడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. అక్కడివారు నన్ను ‘మిచు’ అని పిలుస్తారు. ఆ పిలుపంటే నాకెంతో ఇష్టం. మళ్లీ మళ్లీ చైనా వెళ్లాలనుకుంటున్నా’ అని ఆమిర్ అంటారు.

అక్కడ తన సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా ఆమిర్ చాలా జాగ్రత్తగా ప్రణాళిక రచిస్తారు. ఈ ఏడాది జనవరిలో వారంపాటు చైనాలో ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రచారంలో పాల్గొన్నారు. గతేడాది అక్కడ ‘దంగల్’ ప్రీమియర్‌కు కూడా ఆయన హాజరయ్యారు.

ఆమిర్ టీవీ షో ‘సత్యమేవ జయతే’ను కూడా చైనాలో ఓ వెబ్‌సైట్ ప్రదర్శించింది.

Image copyright Spice pr

చైనా మీడియా కూడా ఆమిర్‌ను సీక్రెట్ సూపర్‌స్టార్‌గా అభివర్ణించింది. ‘ఆమిర్ ఖాన్- ఇండియాస్ సాఫ్ట్ పవర్ ఇన్ చైనా’ అని డిప్లొమాట్ మ్యాగజీన్ పేర్కొంది.

నిజానికి చైనాలో భారతీయ సినిమాలకు అంత ఆదరణ ఉండదు. ఏడాదికి నాలుగు భారతీయ సినిమాలకు మించి విడుదలకావు. 2018లోనే తొలిసారిగా రెండుకంటే ఎక్కువ సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ‘సీక్రెట్ సూపర్‌స్టార్’, ‘బజరంగీ భాయ్‌జాన్’ విడుదలై విజయం సాధించాయి. త్వరలో ‘హిందీ మీడియం’ కూడా విడుదలకానుంది.

చైనాలో ఆమిర్‌ఖాన్ సాధించిన విజయాల ప్రభావం మిగతా భారతీయ సినిమాలపై ఉంటుందో లేదో అప్పుడే చెప్పడం కష్టం. కానీ వ్యక్తిగతంగా ఆమిర్ మాత్రం చైనా మార్కెట్‌లో చాలా ముందుకొచ్చేశారు.

సినీరంగంలో కూడా ఆమిర్ చాలా దూరం ప్రయాణించారు. 80ల్లో విద్యార్థి దశలోనే నలభై నిమిషాలు నిడివిగల షార్ట్ ఫిల్మ్‌లో నటించిన దగ్గర నుంచి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంలో నటించేదాకా చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు.

స్విజర్లాండ్, లండన్ లాంటి దేశాల్లో షారుక్ ఖాన్‌ను ఆదరిస్తుంటే చైనీయులు మాత్రం ఆమిర్‌కే ఓటేశారు. అక్కడి అభిమానుల కోసం ఆయన కొంచెం మాండరిన్ కూడా నేర్చుకుంటానని మాటిచ్చారు. అభిమానుల్ని అలరించడానికి సినీ స్టార్లు ఏదైనా చేయక తప్పదు కదా..!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)