మైక్ పాంపేయో: అమెరికా కొత్త విదేశాంగ మంత్రి

  • 13 మార్చి 2018
మైక్ పాంపియో Image copyright Getty Images

అమెరికా కొత్త విదేశాంగంత్రిగా.. సీఐఏ డైరెక్టర్‌ మైక్ పాంపేయోను నియమించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఏడాది కిందట పాంపేయోను సీఐఏ డైరెక్టర్‌గా ట్రంప్ నామినేట్ చేశారు. అంతకుముందు ఆయన రిపబ్లికన్ పార్టీ నుంచి కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు.

మితవాదిగా పేరుపడ్డ 53 ఏళ్ల పాంపేయో గతంలో కన్సాస్ నుంచి టీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు.

రెక్స్ టిలర్సన్‌ను మంగళవారం అకస్మాత్తుగా విదేశాంగ మంత్రి పదవి నుంచి తొలగించిన ట్రంప్.. ఆ పదవిలో మైక్ పాంపేయోను నియమిస్తున్నట్లు తెలిపారు.

‘‘ఆయన తన విధులకు న్యాయం చేస్తారు’’ అని ట్రంప్ మంగళవారం ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్‌ను తాను కలుస్తానని ట్రంప్ ప్రకటించటానికి కొన్ని గంటల ముందు.. అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో దక్షిణ కొరియా ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో ట్రంప్‌తో పాటు పాంపేయో కూడా పాల్గొన్నారు.

Image copyright Getty Images

పాంపేయోనే ఎందుకు?

సీఐఏ నిఘా కార్యకలాపాలను నాజీలతో పోల్చిన దేశాధ్యక్షుడు ట్రంప్‌తో ఆ సంస్థ సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో.. పాంపేయో సీఐఏ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి సున్నితంగా మారిన పరిస్థితులను చక్కదిద్దటానికి కృషి చేశారు.

గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయటానికి రష్యా ప్రయత్నించిందని సీఐఏ గుర్తించిన అంశాలను ఆయన గతంలో కొట్టివేశారు.

అయితే.. ఒత్తిడి తీవ్రమైనపుడు ఈ అంశంపై అధ్యక్షుడితో విభేదించటానికి పాంపేయో సంసిద్ధత ప్రదర్శించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ జోక్యం ఆరోపణలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించారని, పుతిన్ మాటలను తాను నమ్ముతున్నానని ట్రంప్ పేర్కొన్నపుడు.. రష్యా జోక్యం మీద అమెరికా అంచనాలను తాను సమర్థిస్తున్నట్లు పాంపేయో స్థిరంగా ప్రకటించారు.

రష్యా విషయంలో అధ్యక్షుడి కన్నా పాంపేయోనే ఎక్కువ దుడుకుగా ఉంటారనే భావన అమెరికా వర్గాల్లో ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రమాదకరమైన నాయకుడని పాంపేయో గతంలో హెచ్చరించారు కూడా.

కన్సాస్‌ రాష్ట్రంలోని విచిటా నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున మూడు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన పాంపేయో.. ఇరాన్‌తో గత ఒబామా ప్రభుత్వం చేసుకున్న అణు ఒప్పందాన్ని కాంగ్రెస్‌లో తీవ్రంగా తప్పుపట్టారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక గ్వాటనామో బే జైలు మూసివేతను పాంపియో వ్యతిరేకిస్తున్నారు

పాంపేయోకు ఇస్లామోఫోబియా?

గ్వాటనామో బేలో అమెరికా జైలు మూసివేతను ఆయన గతంలో వ్యతిరేకించారు. ఎన్ఎస్ఏ చేపట్టిన భారీ సమాచార సేకరణ కార్యక్రమాన్ని సమర్థించారు.

సీఐఏ హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని 2014లో సెనేట్ ఒక నివేదికను బయటపెట్టినపుడు.. సీఐఏ అధికారులు, సిబ్బంది దేశభక్తులంటూ పాంపియో సమర్థించారు. సీఐఏ ఎత్తుగడలు ‘‘చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలోనే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

హార్వర్డ్ లా స్కూల్ నుంచి గ్రాడ్యయేషన్ పూర్తిచేసిన పాంపేయో అక్కడ ‘లా రివ్యూ’ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. రిపబ్లికన్ పార్టీ భారీ దాతలైన చార్లెస్, డేవిడ్ కోచ్‌ల మద్దతుతో పాంపియో 2010లో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికవటానికి ముందు ఆయన వైమానిక విడిభాగాల సంస్థను, చమురు సరఫరా కంపెనీని స్థాపించారు.

2013లో బోస్టన్ మారథాన్ బాంబు దాడుల తర్వాత పాంపేయో చేసిన వ్యాఖ్యలు ఆయనకు ‘ఇస్లామోఫోబియా’ (ఇస్లాం మతస్తులంటే భయం) ఉందన్న విమర్శలు వచ్చాయి. ఇస్లామిక్ విశ్వాస పెద్దలు కొందరు ఉగ్రవాద దాడులను లోపాయకారీగా ప్రతోత్సహిస్తున్నారనే అర్థంలో పాంపేయో పార్లమెంటులో వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మైక్ పాంపేయోను సీఐఏ డైరెక్టర్‌గా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ (కుడివైపు) ప్రమాణం చేయించారు

భారత సంతతి వ్యక్తిపై పోటీ

2010లో పాంపేయో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నపుడు.. ఆయన ప్రత్యర్థిగా డెమొక్రటిక్ అభ్యర్థి, భారత సంసతతికి చెందిన రాజ్ గోయెల్‌ పోటీచేశారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో పాంపేయో ప్రచార బృందంలోని సభ్యుడొకరు.. రాజ్ గోయెల్‌ను ‘టర్బన్ టాపర్’ (తలపాగా ధరించేవ్యక్తి.. ముస్లిం, హిందూ, బౌద్ధుడు వగైరా ఎవరైనా కావచ్చు) అని వ్యాఖ్యానిస్తున్న ఒక వ్యాసాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

దీనిపై వివాదం రేగటంతో పాంపేయో క్షమాపణ చెప్పారు. అయితే.. ‘‘అమెరికన్‌కు ఓటు వేయండి’’ అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆయన ప్రచార బృందం ప్రకటనలు గుప్పించింది.

లిబియాలోని అమెరికా రాయబార కార్యాలయంపై 2012లో జరిగిన దాడిపై దర్యాప్తు కోసం 2014లో ఏర్పాటైన ప్రతినిధుల సభ బెంఘాజీ కమిటీలో మైక్ పాంపేయో ఉన్నారు.

మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ మీద రాజకీయ కక్ష సాధింపు కోసమే ఆ కమిటీని ఏర్పాటు చేశారని డెమొక్రటిక్ సభ్యులు విమర్శించారు.

అనంతరం.. ఆ దాడి స్వభావం మీద హిల్లరీ క్లింటన్ అమెరికన్లను తప్పుదోవ పట్టించారని, బరాక్ ఒబామా మళ్లీ ఎన్నికవటానికి వీలుగానే ఆమె అలా చేశారని ఆరోపిస్తూ పాంపేయో ఒక నివేదిక విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)