LIVE: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు

  • 16 మార్చి 2018
చంద్రబాబు నాయుడు Image copyright AndhraPradeshCM/facebook

ఎన్డీయే నుంచి తెలుగు దేశం పార్టీ బయటకు వచ్చేసిందని ఆ పార్టీ నేతలు తెలిపారు.

ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

శుక్రవారం ఉదయం చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇందులో ఎన్డీయే నుంచి బయటకు రావడంతో పాటు.. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు.

ఈ విషయాన్ని ఏపీ మంత్రి జవహర్ విలేకర్లతో మాట్లాడుతూ వెల్లడించారు.

కాగా దీనిపై చంద్రబాబు త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

మరోవైపు టీడీపీ.. మోదీ సర్కారుపై అవిశ్వాసతీర్మానాన్ని ప్రతిపాదించింది.

ఎన్డీఏకు దడ పుట్టిస్తున్న ప్రాంతీయ పార్టీలు

Image copyright Thota narasimham
చిత్రం శీర్షిక టీడీపీ అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన

అంతకు ముందు..

ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ బంధం తెంచేసుకుందని.. భాజపాతో పొత్తుకి స్వస్తి పలికిందని ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తన పార్టీ మంత్రుల్ని వెనక్కి తీసుకున్న తెదేపా తాజాగా ఈ కీలక నిర్ణయాలు తీసుకుందని ఆ కథనంలో పేర్కొంది.

‘ఈనాడు’ కథనం ప్రకారం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో వైకాపా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శాసనసభలోను, ఎంపీలు, పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లోను మాట్లాడారు. శుక్రవారం ప్రత్యేకంగా జరిగే తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించాక ఎన్డీఏతో తెగదెంపుల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Image copyright Getty Images/tdp.ncbn.official/facebook

రాజకీయ పార్టీలు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే అసెంబ్లీలో విపక్షాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. కొన్ని పార్టీలు, వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం లాలూచీ పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో తాను పోరాడుతుంటే... మద్దతివ్వాల్సిందిపోయి, లాలూచీ రాజకీయాలతో ఈ కుట్రలేంటని ధ్వజమెత్తారు.

''కొందరు కావాలని, లేనిపోనివి చేసి అవిశ్వాస తీర్మానాలు పెడతామంటున్నారు. ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా తెదేపా సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం ఎవరు పోరాడినా సహకరిస్తాం. మీరు లాలూచీ పడే ఆ కార్యక్రమం చేస్తున్నా... దాన్ని ఎండగడుతూనే, మద్దతిస్తాం. రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడితే మాత్రం చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇది నా నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో, ప్రజల మాటగా చెబుతున్నాను'' అని పేర్కొన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)