23 మంది రష్యా దౌత్యాధికారులను బహిష్కరించనున్న బ్రిటన్

  • 15 మార్చి 2018
థెరెసా మే Image copyright Getty Images

తమ దేశంలోని 23 మంది రష్యా దౌత్యాధికారులను బహిష్కరించాలని బ్రిటన్ నిర్ణయించింది. మాజీ గూఢచారిపై విషపూరిత రసాయన ఆయుధాలను ప్రయోగించడంపై వివరణ ఇచ్చేందుకు రష్యా నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రధాని థెరెసా మే వెల్లడించారు.

బహిష్కరణకు గురయ్యే దౌత్యాధికారులు వారం రోజుల్లో బ్రిటన్‌ను విడిచి వెళ్లాలని ఆమె తెలిపారు.. వారిని రష్యాకు చెందిన 'అప్రకటిత నిఘా అధికారులు'గా గుర్తించినట్లు చెప్పారు.

అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి బ్రిటన్ ఈ విషయంపై సమాచారమిస్తూ.. యుద్ధాల్లో నిషేధించిన అత్యంత భయంకరమైన ఆయుధాన్ని రష్యా ఒక ప్రశాంతమైన బ్రిటిష్ నగరంలో ఉపయోగించిందని తెలిపింది.

మరోవైపు రష్యా విదేశాంగ మంత్రికి గతంలో పంపిన ఓ ఆహ్వానాన్ని బ్రిటన్ ఉపసంహరించుకోవడంతో పాటు రష్యాలో జరగబోయే ఫిపా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు బ్రిటిష్ రాజకుటుంబీకులు హాజరు కాబోరని కూడా థెరెసా మే ప్రకటించారు.

Image copyright EPA/ Yulia Skripal/Facebook
చిత్రం శీర్షిక రష్యా మాజీ గూఢచారి సిర్గీ స్క్రిపాల్‌, ఆయన కుమార్తె

ఐరాస భద్రతామండలిలోనూ బ్రిటన్ రష్యాపై పలు ఆరోపణలు చేసింది. ఐరాసలో బ్రిటన్ ఉప రాయబారి జొనాథన్ అలెన్ మాట్లాడుతూ.. రసాయన ఆయుధాల నిషేధ ఒప్పందం ప్రకారం తనపై ఉన్న బాధ్యతలను రష్యా విస్మరించిందని ఆరోపించారు.

రష్యా బెదిరింపులకు బ్రిటన్ లొంగబోదని.. భద్రతామండలి సభ్య దేశాల్లో అత్యధికులు పాటించే విలువలకు తాము కట్టుబడి ఉంటామని చెబుతూ, అంతా తమకు మద్దతుగా ఉండాలని జొనాథన్ కోరారు.

దీనికి ప్రతిగా ఐరాసలోని రష్యా రాయబారి వేసిలీ నెబెంజ్యా తమ వాదన వినిపిస్తూ సాలిస్‌బరీ‌లో రసాయన ఆయుధాలను తాము ప్రయోగించినట్లు బ్రిటన్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆ ఘటనలో తమ ప్రమేయమేమీ లేదని.. బ్రిటన్ తన ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

కాగా సాలిస్‌బరీ ఘటనలో వాడిన రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలను శోధించాలంటూ బ్రిటన్ ప్రభుత్వం స్వతంత్ర సంస్థ అయిన 'ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్'ను కోరినట్లు ఐరాసలో బ్రిటన్ ఉప రాయబారి జొనాథన్ అలెన్ తెలిపారు.

మరోవైపు ఈ వ్యవహారంలో అమెరికా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ.. బ్రిటన్‌కు అండగా ఉంటామని చెబుతూ తమ రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధముందని గుర్తు చేశారు.

30 ఏళ్ల తరువాత మళ్లీ..

కాగా ఇంత భారీసంఖ్యలో దౌత్యాధికులను బహిష్కరించడం 1985 తరువాత ఇదే తొలిసారి. ఆ ఏడాది 31 మంది దౌత్యాధికారులను దేశం విడిచి వెళ్లమని బ్రిటన్ ఆదేశించింది.

తాజాగా మార్చి 4న రష్యా మాజీ గూఢచారి సిర్గీ స్క్రిపాల్‌, ఆయన కుమార్తెపై బ్రిటన్‌లోని సాలిస్‌బరీ పట్టణంలో దాడికి గురయ్యారు. వారిపై రష్యా తన నెర్వ్ ఏజెంట్ ద్వారా విషపూరిత రసాయన ఆయుధాలను ప్రయోగించిందని.. అది తమ దేశ ప్రజలకూ హాని చేసే ప్రమాదముందని బ్రిటన్ ఆరోపిస్తోంది.

మా ఇతర కథనాలు:

బీబీసీ క్విజ్ : స్టీఫెన్ హాకింగ్ గురించి మీ పరిజ్ఞానాన్ని ఇక్కడ పరీక్షించుకోండి

స్టీఫెన్ హాకింగ్: తప్పక తెలుసుకోవాల్సిన 11 విషయాలు

నెలకు రూ.30 వేలు అద్దెకట్టి బోనుల్లో బతుకుతున్నారు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)