LIVE: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు..

  • 16 మార్చి 2018
Image copyright AndhraPradeshCM/facebook

ఎన్డీయే నుంచి తెలుగు దేశం పార్టీ బయటకు వచ్చేసిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. దీనికి సంబంధించిన లైవ్ అప్ డేట్స్

టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ ప్రభావం షేర్ మార్కెట్ పై కనిపించింది. బీఎస్సీ సెన్సెక్స్ 402.88 పాయింట్లు నష్టపోయింది.

అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం.

ఇవ్వాళ ఉదయమే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాం. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం. తర్వాతే పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టాం.-చంద్రబాబు

రాష్ర్టానికి ప్రత్యేక ఎందుకు ఇవ్వరు?-చంద్రబాబు

నేను పదవులు అడగలేదు. రాష్ర్ట ప్రయోజనాల కోసం ఎన్డీయేతో కలిశాం. కానీ నాలుగు బడ్జెట్లలోనూ కేంద్రం ఏపీని పట్టించుకోలేదు.-చంద్రబాబు

నాడు పార్లమెంట్‌లో సవ్యంగా వ్యహరించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు.-చంద్రబాబు

2.04 ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుతో బీబీసీ తెలుగు ఫేస్‌బుక్ లైవ్‌ను పై వీడియోలో చూడొచ్చు.

1.30 ఎంపీ గల్లా జయదేవ్‌తో బీబీసీ తెలుగు ఫేస్‌బుక్ లైవ్‌ను కింది వీడియోలో చూడొచ్చు.

12.51 తాజా అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ కూడా మద్దతిస్తోంది - కేవీపీ

‘‘మేం మాత్రమే కాకుండా ఇతర పార్టీలను కూడా సమన్వయపరచి..ఈ తీర్మానికి మద్దతుగా నిలబడుతున్నాం. ఈ విషయంలో మేం ముందుంటాం. నాడు మన్మోహన్ ఇచ్చిన హామీలు అమలు చేసేలా కృషి చేస్తాం. విభజన హామీలు అన్నీ అమలయ్యేలా చూస్తాం. మోదీకి ఎదురుగాలి చాలా వేగంగా వీస్తోంది.’’ అని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు.

12.50 ‘‘అవిశ్వాస తీర్మానానికి 50 మంది సపోర్ట్ పెద్ద కష్ట కాదు. కానీ సభ సజావుగా ఉండాలి..’’ - వైకాపా ఎంపీ మేకపాటి

‘‘మద్దతు కోసం సభలో ఆందోళన చేస్తున్న తెరాస, అన్నాడీఎంకే నేతలతో మాట్లాడాం. మిగతా పార్టీలను సంప్రదిస్తున్నాం’’అని మేకపాటి అన్నారు.

12.45 సోమవారం మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ, వైకాపా చర్యలు

12.07.. లోక్ సభలో అవిశ్వాస తీర్మానాలపై ఇప్పుడు చర్చించలేం.. స్పీకర్. సభ సోమవారానికి వాయిదా

వైకాపా, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఒకేసారి పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. వాటిపై ఇప్పుడు చర్చించలేమని చెప్పారు. ప్రస్తుతం సభ గందరగోళంగా ఉన్నందున అవిశ్వాస తీర్మానంపై చర్చ కుదరదని పేర్కొంటూ.. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

రిజర్వేషన్ల అంశంపై తెరాస సభ్యులు నినాదాలు చేశారు. కావేరీ బోర్డు అంశంపై అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనచేశారు.

మొదట వారందరినీ తమతమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ కోరారు. వినకపోవడంతో గందరగోళం మధ్య అవిశ్వాస తీర్మానాలనపై ఇప్పుడు చర్చించలేమని పేర్కొన్నారు.

(ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి)

Image copyright Getty Images/tdp.ncbn.official/facebook

12.05 గందరగోళం మధ్య కొనసాగుతున్న లోక్ సభ

12.00 లోక్‌సభ మళ్లీ ప్రారంభం.. కొనసాగుతున్న ఎంపీల ఆందోళన

11.59 ప్రారంభం కానున్న లోక్ సభ.

11.33 టీడీపీ తాను కూర్చొన్న కొమ్మనే నరుక్కుంటోంది. బీజేపీని విలన్‌గా చూపాలనుకుంటోంది. విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి ఇవ్వాల్సిందల్లా ఇస్తున్నాం - బీజీపీ జాతీయ అధికార ప్రతినిధి నర్సింహారావు

11.32.. టీడీపీ ఏదో ఒకసాకుతో తాము చేయలేని పనులను కేంద్రంపైకి నెట్టేసి.. ప్రజల సానుభూతి పొందాలని ప్రణాళిక ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుందని బీజీపీ అధికార జాతీయ ప్రతినిధి నర్సింహారావు అన్నారు.

11.30 ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ.. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన వెంటనే దిల్లీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.

ఇప్పటికే టీడీపీ నిర్ణయానికి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ మద్ధతు పలకగా.. ఇతర పక్షాలు కూడా ఈ అంశంపై ఏకతాటిపైకి వస్తున్నాయి.

టీడీపీ అవిశ్వాస తీర్మానం కోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో 20 పార్టీలతో సంప్రదింపులు జరుపుతోందంటూ వార్తలు వస్తున్నాయి.

11.18 ఎన్డీయే నుంచి బయటకు వస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు

పార్లమెంట్‌లో ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం 12.00 గంటల వరకు.. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.

11.15 రాజ్యసభ కూడా వాయిదా

11.12 క్వశ్చన్ అవర్ ప్రారంభం.. లోక్‌సభలో ఎంపీల ఆందోళన.. లోక్ సభ వాయిదా

ఎన్డీయేకి తలాక్ తలాక్ అంటూ టీడీపీ ఎంపీలు లోక్‌సభలో నినాదాలు చేశారు.

11.10 కొనసాగుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

11.03 పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి.

10.55 కేంద్ర ప్రభుత్వంపై వైకాపా, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలకు మద్ధతు ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపినట్లు కూడా వార్తలు వచ్చాయి.

10.30 కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఈ రోజు టీడీపీ తప్పకుండా అవిశ్వాస తీర్మానం పెడుతుందని తెలిపారు.

ప్రాంతీయ పార్టీలు.. జాతీయ పార్టీలతో 50 మంది మద్ధతు తీసుకోవడం పెద్ద కష్టం కాదన్నారు.

10.00 ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. ‘‘ ఇవ్వాళ ఉదయం సీఎం టెలికాన్ఫరెన్స్ పెట్టారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు సహా పలు పార్టీలకు లేఖలు పంపాం.’’ అని వివరించారు.

వైసీపీ నేత జగన్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని విత్ డ్రా చేసుకుంటారన్న భయంతో.. తాము ఈ అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన ఇచ్చాం అని వివరించారు.

ఈ రోజు తమ అవిశ్వాస తీర్మానం అమల్లోకి రాకుంటే.. 54 మంది ఎంపీలతో ముందుగానే సంతకాలు సేకరించి.. మిగతా పార్టీల మధ్దుతో సోమవారం అవిశ్వాసం పెడతామని తెలిపారు.

ఈ రోజు వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అమల్లోకి వస్తే.. తామూ మద్ధతిస్తామని వివరించారు.

కాగా దీనిపై చంద్రబాబు అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

Image copyright Thota narasimham
చిత్రం శీర్షిక టీడీపీ అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన

వారం కిందట ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ టీడీపీ కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించారు.

దీనికి సంబందించి మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేసే అవకాశముంది.

అంతకు ముందు..

ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ బంధం తెంచేసుకుందని.. భాజపాతో పొత్తుకి స్వస్తి పలికిందని ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తన పార్టీ మంత్రుల్ని వెనక్కి తీసుకున్న తెదేపా తాజాగా ఈ కీలక నిర్ణయాలు తీసుకుందని ఆ కథనంలో పేర్కొంది.

‘ఈనాడు’ కథనం ప్రకారం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో వైకాపా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శాసనసభలోను, ఎంపీలు, పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లోను మాట్లాడారు. శుక్రవారం ప్రత్యేకంగా జరిగే తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించాక ఎన్డీఏతో తెగదెంపుల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Image copyright Getty Images/tdp.ncbn.official/facebook

రాజకీయ పార్టీలు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే అసెంబ్లీలో విపక్షాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. కొన్ని పార్టీలు, వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం లాలూచీ పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో తాను పోరాడుతుంటే... మద్దతివ్వాల్సిందిపోయి, లాలూచీ రాజకీయాలతో ఈ కుట్రలేంటని ధ్వజమెత్తారు.

''కొందరు కావాలని, లేనిపోనివి చేసి అవిశ్వాస తీర్మానాలు పెడతామంటున్నారు. ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా తెదేపా సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం ఎవరు పోరాడినా సహకరిస్తాం. మీరు లాలూచీ పడే ఆ కార్యక్రమం చేస్తున్నా... దాన్ని ఎండగడుతూనే, మద్దతిస్తాం. రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడితే మాత్రం చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇది నా నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో, ప్రజల మాటగా చెబుతున్నాను'' అని పేర్కొన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)