గ్రౌండ్‌రిపోర్ట్: శ్రీలంక ఘర్షణల్లో ఆదుకున్న ఇరుగుపొరుగు

  • 17 మార్చి 2018
దాడుల్లో ధ్వంసమైన తన దుకాణం ముందు థయాప్‌
చిత్రం శీర్షిక దాడుల్లో ధ్వంసమైన తన దుకాణం ముందు థయాప్‌

శ్రీలంకలో ముస్లింలు, సింహళీల మధ్య ఇటీవల మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ హింసపై అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మతాన్ని మరిచి మానవత్వంతో ఆపదలో ఉన్న ఇరుగుపొరుగువారిని రక్షించిన వారి కథనాలు వెలుగు చూశాయి.

ఇంతకీ ఎవరా ఇరుగుపొరుగు?

''రాత్రి రెండున్నర మూడు గంటల ప్రాంతంలో అనుకుంటా. వాళ్లు ముస్లిం ఇళ్ల పై దాడులకు దిగారు. వారి దాడికి నా ఇల్లు కూడా ధ్వంసమైంది''అని మార్చి 5న జరిగిన ఘటనను మహ్మద్ థయాప్ బీబీసీతో గుర్తు చేసుకున్నారు.

కండీ జిల్లా దిగానా పరిధిలోని పల్లెకల్లాలో థయాప్ దుకాణం ఉంది. కట్టెలు, రాళ్లను వెంట తెచ్చుకున్న ఒక గుంపు ఆయన దుకాణాన్ని ధ్వంసం చేసింది.

ఆ దుకాణం మీద వచ్చే ఆదాయంతోనే ఆ యజమాని, ఆయన కుటుంబంలో మరో పది మంది బతుకుతున్నారు.

చిత్రం శీర్షిక దాడుల్లో ధ్వంసమైన థయాప్‌ దుకాణం

''36 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. స్థానికంగా ఉన్న సింహళ ప్రజల సహాయం లేకుండా ఇలాంటి హింసాత్మక దాడులు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే నా దుకాణం పక్కనే సింహళీయుడి షాపు ఉంది. దానిపై ఎవరూ దాడి చేయలేదు. ఆయన దుకాణం పక్కనే మరో ముస్లిం వ్యక్తి దుకాణం ఉంది. అది దాడికి గురైంది'' అని ఆయన చెప్పారు.

‘‘ముస్లింల దుకాణాలు, నివాసాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇంట్లో ఉండటానికి కూడా చాలా భయపడ్డాం. ఇప్పుడు కూడా బయటకు రావాలంటే భయంగానే ఉంది. ఆ రోజు మా పక్కింట్లో ఉండే నిమల్ సమరసింగం మమ్మల్ని వారింటికి తీసుకెళ్లారు. మేం 11 మంది ఉన్నా కూడా ఆయన తనింటికి తీసుకెళ్లడానికి సంశయించలేదు.’’ అని థయాప్ తెలిపారు.

చిత్రం శీర్షిక థయాప్‌తో నిమల్ సమరసింగం

రాత్రి 7 గంటల తర్వాత థయాప్ ఇంటిపై రాళ్ల దాడి మొదలైంది. ఆ రాత్రంతా ఆయన కుటుంబం పక్కింట్లోనే తల దాచుకుంది.

''ఆ గుంపు మమ్మల్ని చంపేసేదని అనడం లేదు. కానీ, మేం భయంతో వణికి పోతున్నప్పుడు పక్కింటి వాళ్లు మమ్మల్ని రక్షించారు’’ అని థయాప్ చెప్పారు.

టీవీ మెకానిక్‌గా పనిచేసే నిమల్ ఈ ఘటనపై మాట్లాడుతూ, '' సింహళీ ప్రజలతో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండవు. దాడులకు దిగినవాళ్లు స్థానికులు అని నేను అనుకోవడం లేదు. దీన్నో పెద్ద విషయంగా తీసుకోవడం మాకు ఇష్టం లేదు. ఇరుగుపొరుగును ఎవరున్నారనేది ముఖ్యం కాదు. అవసరమైన స్థితిలో వారికి సాయం చేయకపోతే పక్కనే ఉండి ప్రయోజనం ఏంటీ’’ అని నిమల్ ప్రశ్నించారు.

చిత్రం శీర్షిక హిందుసారా విహార మఠ్‌కు చెందిన కరిదికాల సంతవిమల థెరార్

సరైన సమయంలో స్పందించిన బౌద్ధ భిక్షువులు

బౌద్ధం ఎప్పుడూ శాంతినే ప్రబోధిస్తుంది. ఇలాంటి హింస సరికాదని హిందుసారా విహార మఠ్‌కు చెందిన కరిదికాల సంతవిమల థెరార్ పేర్కొన్నారు. ఆయన ఆశ్రమం హింస చోటు చేసుకున్న దిగానాలోనే ఉంది.

ఆయుధాలతో వచ్చిన అల్లరి మూక థెరార్ ఉన్న ప్రాంతంలోని ముస్లింలపై దాడులకు తెగబడుతున్న సమయంలో ఆయన సమయస్ఫూర్తితో స్పందించారు. తన చుట్టుపక్కల ఉన్న చాలా మంది ముస్లింలకు మఠంలో ఆశ్రయమిచ్చి రక్షించారు.

''మేం ఉండే హిజార పట్టణంలో 5 వేల ముస్లిం కుటుంబాలు ఉంటాయి. దాడుల విషయం తెలియగానే వెంటనే నేను మఠానికి చేరుకున్నా. అక్కడి సింహళీయులను సమావేశపరిచి ఉద్రిక్తతలకు అడ్డుకట్టవేశా. నా మాట విని స్థానిక సింహళీలు ముస్లిం కుటుంబాలను రక్షించాయి. వారికి నాలుగు రోజుల పాటు ఆశ్రయమిచ్చాయి.’’ అని నాటి పరిస్థితిని థెరార్ బీబీసీకి వివరించారు.

Image copyright EPA

అతనిలాగా చాలా మంది బౌద్ధులు తమ ఇరుగుపొరుగున ఉన్న ముస్లిం కుటుంబాలకు రక్షణగా నిలిచారు. కండీ జిల్లాలోని దాదాపు 150 దుకాణాలు, నివాసాలు, మతప్రదేశాలు దాడుల్లో ధ్వంసమయ్యాయి.

ఈ దాడులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు 150 మందిని అరెస్టు చేసింది. అయితే, వారి వివరాలు తెలియ రాలేదు. టెల్దెనియా ప్రాంతంలో ఫిబ్రవరి 20న రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి కారణంగా భావిస్తున్న డ్రైవర్‌ను నలుగురు ముస్లింలు చితకబాదారు.

అయితే, బాధితుడు సింహళీయుడు. చికిత్స పొందుతూ అతను ఆసుపత్రిలో చనిపోయారు. ఈ ఘటన దిగానా ప్రాంతంలో మత ఘర్షణలకు దారితీసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)