స్మార్ట్‌ఫోన్‌తో ఆడుకునే మీ పిల్లలు పెన్సిల్‌ను సరిగ్గా పట్టుకోగలరా?

  • 19 మార్చి 2018
పెన్సిల్‌, మోటార్ స్కిల్స్ Image copyright iStock

చిన్నారుల అలవాట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు పిల్లలు బొమ్మలతో ఆడుకునేవాళ్లు, ఇవాళ్టి పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్లతో ఆడుకుంటున్నారు.

బిజీగా ఉండే తల్లిదండ్రులకు పిల్లలు అలాంటి పరికరాలతో ఆడుకోవడం కొంత వెసులుబాటు ఇవ్వొచ్చు.

కానీ దాని వల్ల పిల్లలు రాయడానికి అవసరమైన చలన నైపుణ్యాలను కోల్పోతున్నారని నిపుణులు అంటున్నారు.

ఈ అంశంపై పీడియాట్రిక్ థెరపిస్ట్ సాలీ పెయిన్ ఇటీవల గార్డియన్ వార్తాపత్రికకు వివరించారు. ''స్కూలుకు వచ్చే పిల్లలకు పెన్సిల్ ఇస్తే వాళ్లు దాన్ని పట్టుకోలేకపోతున్నారు. వాళ్లలో ప్రాథమిక చలన నైపుణ్యాలు లేవు'' అని అన్నారు.

''పెన్సిల్‌ను పట్టుకుని కదల్చాలంటే వేళ్ల కండరాలపై గట్టి నియంత్రణ ఉండాలి. అలాంటి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలంటే పిల్లలు చాలా కృషి చేయాలి'' అని సాలీ తెలిపారు.

టాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిపోవడమే పిల్లలు పెన్సిల్‌ను పట్టుకోలేకపోవడానికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.

Image copyright NOAH SEELAM

షాపింగ్ లిస్టూ టైపింగే..

కొన్నేళ్ల క్రితం ఒక ఏడాది పాప ఈ-మ్యాగజైన్‌ను వేగంగా తిరగేసే వీడియో వైరల్ అయింది. దాన్ని బట్టి పిల్లలు క్రమంగా ఈ డిజిటల్ ప్రపంచానికి ఎలా అలవాటై పోతున్నారో తెలుస్తోంది.

ఒక పరిశోధన ప్రకారం బ్రిటన్‌లో సగానికి పైగా ఇళ్లలో టాబ్లెట్లు, 76 శాతం స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

చేతిరాత ప్రాధాన్యత గురించి ప్రచారం చేస్తున్న డాక్టర్ జేన్ మెడ్‌వెల్, ఇళ్లలో పెరిగిపోతున్న గ్యాడ్జెట్ల వల్ల చాలా మంది పిల్లలకు పెన్సిల్‌ను ఉపయోగించే అవకాశం రావడం లేదన్నారు.

అలాగే పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటున్న అలవాట్లు కూడా మారుతున్నాయి.

Image copyright Getty Images

''గతంలో తల్లిదండ్రులు షాపింగ్ లిస్ట్‌ను పేపర్‌పై రాసేవారు. ఇప్పుడు వాటిని కూడా ఫోన్‌పై టెక్ట్స్ చేస్తున్నారు. అందువల్ల పిల్లల రాసే అలవాట్లు కూడా మారుతున్నాయి'' అని మెడ్‌వెల్ చెప్పారు.

అయితే టాబ్లెట్ల వల్లే పిల్లల చలన నైపుణ్యాలు తగ్గిపోతున్నాయనే వాదనతో మాత్రం ఆమె ఏకీభవించడం లేదు.

''టాబ్లెట్లతో కేవలం స్వైపింగ్ చేయడం మాత్రమే వస్తుంది. దాని వల్లే పెన్సిళ్లను పట్టుకోలేకపోతున్నారు అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు'' అని ఆమె అంటున్నారు.

Image copyright Getty Images

రాసే పిల్లలే బాగా గుర్తు పడుతున్నారు

చేతిరాత ప్రాధాన్యత గురించి మాత్రం చెప్పుకోదగిన ఆధారాలు ఉన్నాయి. 2005లో ఎయిక్స్-మార్సెల్లీ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైన్స్ లేబరేటరీ మూడు నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న పిల్లలను రెండు బృందాలుగా విభజించింది. ఒక బృందం చేతిలో రాస్తే, మరో బృందం కంప్యూటర్‌ను ఉపయోగించేది.

ఈ పరిశోధనలో చేతితో రాసే పిల్లలు, కంప్యూటర్‌పై రాసే పిల్లల కన్నా బాగా అక్షరాలను గుర్తించగలుగుతున్నారని తేలింది.

రాయడం వల్ల పిల్లలకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి.

''ఒక అక్షరాన్ని దిద్దేటప్పుడు దానిలో అనేక క్లిష్టమైన కదలికలు ఇమిడి ఉంటాయి. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. పిల్లలు ఇలా ప్రాక్టీస్ చేసే క్రమంలో అక్షరాలను నేర్చుకుంటారు'' అని డాక్టర్ మెడ్‌వెల్ తెలిపారు.

Image copyright Getty Images

చేతిరాతకన్నా, కీబోర్డు నైపుణ్యాలే మిన్న

నేషనల్ హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ అయిన డాక్టర్ మెలీసా ప్రూంటీ, ''స్పెల్లింగ్, భాష అభివృద్ధి విషయంలో గ్యాడ్జెట్లతో నేర్చుకోవడం, చేతిరాతతో నేర్చుకోవడంలో అనేక తేడాలున్నాయి. అంతే కాకుండా నర్సరీలో, స్కూల్లో పిల్లలు ఎంత మేరకు చేతితో రాస్తున్నారు అన్నది కూడా కీలకం'' అని తెలిపారు.

గతంలో ఆమె వద్దకు డెవలప్‌మెంటల్ కోఆర్డినేషన్ డిజార్డర్ అంటే డిస్‌ప్రాక్సియా అనే వ్యాధి కారణంగా రాయడానికి ఇబ్బంది పడే పిల్లలు వచ్చేవాళ్లు, ఇప్పుడు అలాంటి సమస్యలు లేని వాళ్లు కూడా ఆమె వద్దకు వస్తున్నారు.

ఇది చాలా ఆసక్తికరం అని ఆమె అన్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం వాళ్ల చేతిరాతపై ప్రభావం చూపుతోందా లేక చలన నైపుణ్యాలపై ప్రభావం చూపుతోందా అన్నది పరిశోధనల్లో తేలాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

2015లో కలిపిరాత తరగతులు తప్పనిసరి అన్న నియమాన్ని రద్దు చేసిన మొదటి దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. దీనికి కారణం నేటి డిజిటల్ యుగంలో చేతిరాతకన్నా, కీబోర్డు నైపుణ్యాలే మరింత ఉపయుక్తమని భావించడం.

దీనికి భిన్నంగా 2017లో అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం విద్యార్థులంతా తప్పకుండా కలిపిరాత నేర్చుకోవాలని చట్టం చేసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉపాధిని దృష్టిలో పెట్టుకుని కొన్ని దేశాలు కీబోర్డు నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి

తగ్గిపోతున్న రాత

2014లో నిర్వహించిన ఒక పరిశోధనలో ప్రతి ముగ్గురు పెద్దవాళ్లలో ఒకరు ఏడాదిలో ఆరు నెలల పాటు చేతితో ఏమీ రాయడం లేదని తేలింది. కానీ చదువులో మాత్రం ఇప్పటికీ చేతిరాత అనేది ఇంకా ఒక ముఖ్యమైన నైపుణ్యంగానే కొనసాగుతోంది.

''చేతిరాత అనేది స్పెల్లింగ్, విరామచిహ్నాలు, కొత్త ఆలోచనలు.. వీటన్నిటిపై ప్రభావం చూపుతుంది'' అని డాక్టర్ ప్రూంటీ అన్నారు.

అయితే మన తాత ముత్తాతల్లా గొలుసుకట్టు రాయడంలో ప్రావీణ్యత అవసరమా అన్న ప్రశ్నకు డాక్టర్ మెడ్‌వెల్ స్పందిస్తూ.. ''పిల్లలు సరైన అక్షరాన్ని రాయడం నేర్చుకోవాలి. అంతే కానీ బలవంతంగా కలిపి రాత రాయించడం వల్ల దాని వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

విషపూరిత కప్పలు... వాటిని నేర్పుగా తినే ఎలుకలు

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...

పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి