ప్రెస్‌రివ్యూ : కేంద్రాన్ని పదవులిమ్మని అడగలేదు - చంద్రబాబు నాయుడు

  • 19 మార్చి 2018
Image copyright Getty Images

కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు అడగలేదు : చంద్రబాబు

విభజన హామీలపై న్యాయం చేయమని అడిగితే.. ఇబ్బందులు పెడతాం, ఎదురుదాడి చేస్తాం, అని కేంద్రం అనడం బాధాకరమని చంద్రబాబు నాయుడు అన్నారు.

విభజన చట్టంలో పెట్టిన 18 డిమాండ్లు, రాజ్యసభలో ఇచ్చిన హామీలపై సమీక్ష చేయండి, సమాధానం చెప్పండి, సహాయం చేయండని తాను అడిగితే.. అవేం చేయకుండా ఇబ్బందులు పెడతాం, ఎదరుదాడి చేస్తాం, రాష్ట్రంపై దాడి చేస్తాం అనడం బాధాకరమని చంద్రబాబు తెలిపారని ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ప్రగతిని ఆంధ్రప్రదేశ్‌ సాధించిందంటే ప్రజలు, ప్రభుత్వం పట్టుదల వల్లే సాధ్యమైందని ఆయన వెల్లడించారు.

ఇటీవల కొందరు ఎందుకింత భూమి అంటూ కొందరు వివాదం చేస్తున్నారని, ప్రపంచంలో ఎక్కడైనా ఓ నగరం నిర్మాణమైతే అది ఆకాశంలో కాదు.. నేలపైనే జరగాలని చంద్రబాబు అన్నారు. తాను ఇప్పటికే తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టానని, ఇదే సరిపోతుందనుకుంటే ఇంకేం కట్టాల్సిన పనిలేదన్నారు. తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్‌, కర్ణాటకకు బెంగళూర్‌, మహారాష్ట్రకు ముంబయి ఉన్నట్టే.. తెలుగు వారికి కూడా అలాంటి ఓ నగరం ఉండాలా వద్దా అనేది అంతా ఆలోచించాలని అన్నారు. అందుకే ఎంతమంది ఎన్ని మాట్లాడినా.. వెనక్కి తగ్గకుండా ఓ బ్రహ్మాండమైన నగర నిర్మాణం చేపట్టే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని వెల్లడించారు.

కేంద్రంలో మంత్రి పదవులు, గవర్నర్‌ పదవులను అడగలేదని, పైగా రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని తానే రెండుసార్లు ఒక ఎంపీని వారికి ఇచ్చానన్నారు.

Image copyright Getty Images

మేం పాండవులం.. వాళ్లు కౌరవులు : రాహుల్

బీజేపీ, ఆరెస్సెస్‌లు కౌరవులు.. కాంగ్రెస్ వాళ్లు పాండవులు అని రాహుల్ గాంధీ ప్లీనరీ సమావేశంలో విమర్శించినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

'శతాబ్దాల క్రితం కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులు బలవంతులు, అహంకారులు. పాండవులు ధర్మం కోసం పోరాడారు. కౌరవుల్లాగే ఆరెస్సెస్, బీజేపీలది అధికార దాహం. పాండవుల్లాగ కాంగ్రెస్‌ పార్టీది కూడా సత్యం కోసం చేస్తున్న ధర్మపోరాటం.

నిజాయితీగా ఉన్న వ్యాపారుల నోళ్లను మూయించి.. వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని అధికారులతో లూటీ చేయిస్తున్నారు. వీరు బ్యాంకుల నుంచి రూ.33వేల కోట్లు దోపిడీ చేస్తే.. బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.

భారత్‌లోని బడా వ్యాపారవేత్తలు, ప్రధాన మంత్రి పదవికి మధ్య లోపాయకారి ఒప్పందానికి మోదీ అనే పేరు ఓ గుర్తుగా మారిపోయింది. ఈ మోదీ.. మరో మోదీకి 30వేల కోట్ల ప్రజాధనాన్ని ఇస్తారు. ప్రతిగా ఆ మోదీ.. ఈ మోదీకి ఎన్నికల మార్కెటింగ్‌కు అవసరమైంది ఇస్తాడు.

బీజేపీ భయాందోళనలు సృష్టిస్తోంది. మీడియా కూడా భయపడిపోతోంది. తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది' అని రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించారని సాక్షి కథనం.

Image copyright Getty Images

2019, 2024లో అధికారం మాదే! : అమిత్ షా

2019లోనే కాదు.. 2024లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా అన్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

2014లో కంటే 2019లో బీజేపీకి ఎక్కువ లోక్‌సభ స్థానాలు వస్తాయని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. లోక్‌సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ.. ఎన్‌డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని, సంఖ్యాబలం తగ్గుతుందన్న భయం లేదని స్పష్టం చేశారు.

'అవిశ్వాసంపై చర్చకు సిద్ధం. కానీ ప్రతిపక్షాలు సభను జరగనివ్వడం లేదు. ఓటమి తప్పదని వాటికీ తెలుసు' అని వ్యాఖ్యానించారు.

ఇరవై రాష్ట్రాల్లో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉందని, కొద్ది నెలల్లో జరిగే కర్ణాటక ఎన్నికల్లో కూడా గెలిచి మరో రాష్ట్రాన్ని దక్కించుకుంటామని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను.. 'మోదీ వర్సెస్‌ మిగతా పార్టీలు'గా అంతా పరిగణిస్తున్న విషయమై అడుగగా..

''మమ్మల్ని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలూ చేతులు కలపడం బీజేపీ బలాన్ని సూచిస్తోంది. గతంలో 'ఇందిరాగాంధీ వర్సెస్‌ మిగతా పార్టీలు'గా భావించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది'' అని షా బదులిచ్చారు.

'మేం కాంగ్రెస్ నుంచి 11 రాష్ట్రాలను కైవసం చేసుకున్నాం. కానీ మేం కొన్ని ఉప ఎన్నికల్లో ఓడగానే కాంగ్రెస్‌ ఆనందిస్తోంది' అని ఎద్దేవాచేశారు.

రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పదోన్నతి లభించినా.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒనగూరేదేమీ లేదని చెప్పారు. పుట్టుకతోనే ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడన్న సంగతి ప్రజలందరికీ తెలుసు' అని అమిత్ షా విమర్శించారని ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.

Image copyright Getty Images

ఎన్నికల్లో టికెట్లు కావాలంటే హైదరాబాద్‌లో ఉండొద్దు..! : కేసీఆర్

ఎన్నికల్లో టికెట్లు కావాలంటే హైదరాబాద్‌లో కాదు.. జనంలో ఉండాలని కేసీఆర్ అన్నట్టు నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది. ఆ కథనంలో..

టికెట్లు సంపాయించుకోవాలి అంటే హైదరాబాద్‌లో కాకుండా.. ప్రజల్లో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల్లో మమేకమై ఉన్నవారికి గెలుపు సాధ్యమని, టికెట్ల కేటాయింపు విషయంలో ఎటువంటి సమస్యలుండవని తెలిపారు.

పంచాంగపఠనం సందర్భంగా.. రాశులను బట్టి టికెట్ల విషయంలో అంచనాలు చెప్పడంపై ఆయన స్పందించారు. ప్రజల్లో ఉంటే టికెట్లకు ఢోకా ఉండదు. ఆటోమెటిక్‌గా వస్తాయి అని కేసీఆర్ అన్నారు.

మనమిచ్చేది 50వేల కోట్లు.. కేంద్రం మనకిచ్చేది 24వేల కోట్లా!

‘మనం కేంద్రానికి 50 వేల కోట్లిస్తం.. అక్కడి నుంచి మనకు 24 వేల కోట్లే వస్తయి. అయినప్పటికీ మనం సముపార్జించుకున్న ఆదాయంతో మనల్ని మనం పోషించుకుంటూ దేశాన్ని కూడా అభ్యుదయంగా ముందుకు తీసుకుపోయేదానిలో పాత్ర పోషిస్తున్నం. ఇది మనకు గర్వకారణం. దేశంలో ఏడెనిమిది స్వయంసమృద్ధి రాష్ర్టాల్లో మనం ఒకళ్లం. ఇతరులకు సహాయపడే స్థితిలో ఉన్నం' అని ఆయన చెప్పినట్లు నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పదహారేళ్ల కిందటే చంద్రుడిపై స్థలం కొన్నానంటున్న హైదరాబాద్ వ్యాపారి.. అసలు చందమామపై స్థలం కొనొచ్చా

ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు

కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'

'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం

నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం

లోకేశ్ ట్వీట్: ‘జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం’

కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్

బోరిస్ జాన్సన్: బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి