39 మంది భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు చంపేశారు: సుష్మా స్వరాజ్

  • బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

ఐసిస్ కిడ్నాప్ చేసిన తమ కుటుంబ సభ్యుల ఫొటోలను చూపిస్తున్న పంజాబీ మహిళలు. తమవాళ్లను విడిపించాలని కోరుతూ 2014 డిసెంబర్ 13వ తేదీన వీరు అమృత్‌సర్‌లో ముఖ్యమంత్రిని కలిసినప్పటి దృశ్యం ఇది

మోసుల్‌లో ఐసిస్ అపహరించిన 39 మంది భారతీయులు మృతి చెందారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటించారు.

39 మంది భారతీయుల మృతదేహాలు లభించాయని, వాటిని బాగ్ధాద్ తీసుకెళ్లి, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి.. చనిపోయిన వాళ్లు భారతీయులేనని నిర్ధరించినట్లు సుష్మ తెలిపారు.

స్వయంప్రకటిత ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ ఐసిస్ 2014 జూన్ నెలలో వీరిని మోసుల్ నగరంలో అపహరించింది. వీరంతా కూలీలే. వీరిలో ఎక్కువ మంది పంజాబీలు. యుద్ధంతో అట్టుడుకుతున్న మోసుల్ నగరాన్ని వీడేందుకు వాళ్లు సిద్ధమైన తరుణంలో ‘తీవ్రవాదులు వారిని అపహరించారు’ అని ఆమె చెప్పారు.

ఈ అంశంపై పలుమార్లు పార్లమెంటులో చర్చ జరిగింది. బాధిత కుటుంబాలు కేంద్ర మంత్రులను కలసి తమ వాళ్లను విడిపించాలని విజ్ఞప్తులు చేశారు.

గతేడాది జూలైలో రాజ్యసభలో ఈ అంశంపై చర్చ జరగ్గా.. ‘‘ఐసిస్ అపహరించిన భారతీయ కార్మికుల మరణానికి సంబంధించిన సమగ్ర ఆధారాలు లభించకుండా వారు మృతి చెందినట్లు ప్రకటించను’’ అని సుష్మా స్వరాజ్ తెలిపారు.

దీనిపై ఇప్పుడు సమగ్ర సమాచారం లభించిందని.. ‘‘భారతీయులను చంపేశారు’’ అని సుష్మా స్వరాజ్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. ఈ సందర్భంగా భారతీయ కార్మికుల మరణానికి దారితీసిన పరిస్థితులను ఆమె వివరించారు. ఆ సంఘటనల క్రమం.. ఆమె మాటల్లోనే..

‘‘వీళ్లు ఉండాల్సింది ఇక్కడ కాదు’’

2014లో ఐసిస్ మోసుల్‌ను ఆక్రమించింది. అంతర్యుద్ధం మొదలు కావటంతో కార్మికులంతా తమతమ స్వస్థలాలకు తరలిపోతున్నారు.

భారతీయ కార్మికుల యజమాని కూడా వారిని స్వస్థలాలకు వెళ్లిపోవాలని సూచించారు. అక్కడున్న ఇరాకీలు వెళ్లిపోగా.. 40 మంది భారతీయులు, కొందరు బంగ్లాదేశీయులు మాత్రం అక్కడే ఉన్నారు. దీంతో వారికి భోజనం పెట్టాలని స్థానిక వంటవాళ్లను యజమాని కోరారు.

భారతీయులు, బంగ్లాదేశీయులు భోజనం చేస్తున్న ప్రదేశం వద్దకు ఐసిస్ తీవ్రవాదులు వచ్చారు. భోజనం చేస్తున్న వారిని చూసి.. వీళ్లెవ్వరు? అని వంట మనిషిని అడగ్గా.. తాము ఇరాకీలమని, మిగతావాళ్లు భారతీయులు, బంగ్లాదేశీయులని వంటవాళ్లు తెలిపారు.

దీంతో.. ‘‘వీళ్లు ఉండాల్సింది ఇక్కడ కాదు. జౌళి కర్మాగారం (ఐసిస్ స్థావరం)లో వీళ్లు ఉండాలి. అక్కడికి తరలించండి’’ అని తీవ్రవాదులు ఆదేశించారు.

ఐసిస్ స్థావరంలో బంగ్లాదేశీయులు, భారతీయులను వేర్వేరుగా పెట్టారు.

బంగ్లాదేశీయులను వదిలిపెట్టాలని ఒకరోజు తీవ్రవాదులు నిర్ణయించుకున్నారు. వాళ్లను ఎర్బిల్ (విమానాశ్రయం)లో వదిలిపెట్టే బాధ్యతను వంటవాళ్లు తీసుకున్నారు.

యజమాని అనుమతితో.. భారతీయ కార్మికుల్లో ఒకరైన హర్జీత్ మసీకి.. అలీ అన్న ముస్లిం పేరు పెట్టి, బంగ్లాదేశీయులతో పాటు ఎర్బిల్ విమానాశ్రయం వద్ద వదిలిపెట్టినట్లు వంటవాళ్లు చెప్పారని సుష్మా స్వరాజ్ వివరించారు.

‘‘అవన్నీ కట్టుకథలు’’

‘‘ఎర్బిల్ చేరుకోగానే హర్జీత్ మసీ నాకు ఫోన్ చేశాడు. పంజాబీలో మాట్లాడాడు. అప్పుడు నేను ఒక్కటే అడిగాను.. నువ్వు ఇక్కడి వరకూ ఎలా వచ్చావు? అని. ‘నాకేం తెలీదు. నన్ను ఇక్కడి నుంచి తప్పించండి’ అన్నాడు. పలుమార్లు అడగ్గా.. కట్టుకథలు చాలా చెప్పాడు. అవన్నీ నేను నమ్మలేదు’’ అని సుష్మా తెలిపారు.

అదేరోజు రాత్రి ఉగ్రవాదులు వచ్చి భారతీయుల్ని చూశారు. 40 మంది ఉండాల్సింది ఒకరు తప్పించుకున్నారని గుర్తించి.. మిగతా వారిని బదుష్ తరలించాలని నిర్ణయించారు.

ఆ తర్వాత ఏం జరిగిందనేది తనకు తెలియదని కార్మికుల యజమాని చెప్పారు.

బర్దూష్ జైలులో వీళ్లను పెట్టారా? చంపేశారా అన్నది అప్పుడు తెలియలేదని సుష్మా తెలిపారు.

మోసుల్‌ నగరం ఐసిస్ నుంచి విముక్తి చెందిన తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ అక్కడికి వెళ్లారు.

ఒక ఇరాకీ అధికారి, భారతీయ రాయబారి, వీకే సింగ్‌లు బదుష్ వెళ్లి భారతీయ కార్మికుల కోసం ఆరా తీశారు.

కుప్ప కింద మృతదేహాలు

అక్కడ ఒక వ్యక్తి చెప్పిందేమంటే.. సమీపంలోని ఒక కుప్పపై చాలామందిని హతమార్చారు. అక్కడ ఏమైనా ఆధారాలు దొరకొచ్చునని.

పర్వత ప్రాంతాల కింద ఉండే వస్తువుల సమాచారాన్ని తెలిపే రాడార్ (డీప్ పెనెట్రేషన్ రాడార్) సహాయంతో ఆ కుప్ప కింద 39 మృతదేహాలు ఉన్నాయని గుర్తించారు.

శిథిలాలను తొలగించి, మృతదేహాలను వెలికితీశారు. వాటితో పాటు కొన్ని గుర్తింపు కార్డులు కూడా లభించాయి. ఈ మృతదేహాలను బాగ్ధాద్ తీసుకెళ్లారు.

ఈ మృతదేహాలన్నింటికీ డీఎన్ఏ పరీక్షలు జరపాలని.. ఇరాక్‌లో సామూహికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న మార్టిస్ ఫౌండేషన్ సహాయం కోరారు.

కార్మికుల తల్లిదండ్రులు లేదా బంధువుల డీఎన్ఏ నమూనాలను అందజేస్తే మృతదేహాలను గుర్తిస్తామని మార్టిస్ ఫౌండేషన్ తెలిపింది.

దీంతో 39 మంది కార్మికుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలను.. వారివారి స్వరాష్ట్రాలైన పంజాబ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల సహాయంతో సేకరించారు.

కుప్పలో లభించిన మృతదేహాల డీఎన్ఏలను.. భారత్ నుంచి తీసుకెళ్లిన డీఎన్ఏ నమూనాలతో సరిపోల్చగా.. మొదట సందీప్ అనే యువకుడి డీఎన్ఏ సరిపోలింది. తర్వాత రోజుకు 5 నుంచి 10 మృతదేహాలను గుర్తించారు.

మృతుల్లో 38 మంది డీఎన్ఏలు సరిపోలాయని మార్టిస్ ఫౌండేషన్ తెలిపింది. ఈ ప్రక్రియ ఎలా జరిగిందనేది బాగ్ధాద్‌లోని మార్టిస్ ఫౌండేషన్ విలేకరుల సమావేశంలో తెలియజేస్తుందని సుష్మా స్వరాజ్ వెల్లడించారు.

‘‘పూర్తి ఆధారాలు లేకుండా కార్మికులు చనిపోయారని ప్రకటించకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఒక వ్యక్తి బతికి ఉంటే.. అతన్ని చనిపోయాడని ప్రకటించటం పాపం. నేను ఆ పాపం చేయదల్చుకోలేదు. ఇప్పుడు అన్ని ఆధారాలూ లభించాయి కాబట్టి ప్రకటిస్తున్నాను. మేం ప్రకటనకే పరిమితం కావటం లేదు. మృతదేహాలను సర్టిఫికెట్ల ఆధారంగా ఆయా మృతదేహాలను భారత్‌కు తీసుకొస్తాం. అమృత్‌సర్, పట్నా, కోల్‌కతాల్లో వారివారి బంధువులకు అప్పగిస్తాం’ అని సుష్మా స్వరాజ్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)