బిజెపి, కాంగ్రెస్‌లు మీ ఫేస్‌బుక్ డేటా వాడుకుంటున్నాయా!

  • 21 మార్చి 2018
ఫేస్‌బుక్ Image copyright Getty Images

డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడిని చేసిన 2016 ఎన్నికలను, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని తీర్పు ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణను.. ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ అనే సంస్థ ఫేస్‌బుక్ సమాచారాన్ని వినియోగించుకుని ‘ప్రభావితం చేసింద’న్న బలమైన ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఈ సంస్థలో భాగంగా ఉన్న భారతీయ సంస్థ ఎస్‌సీఎల్ ఇండియా కూడా 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ‘మిషన్ 272 ప్లస్’కు సాయం చేశామని చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా తమ క్లైంట్ల జాబితాలో ఉన్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనలిటికా.. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు 5 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వాడుకుందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది.

Image copyright Getty Images

రాజకీయ నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీయటానికి ‘హనీ ట్రాప్స్’ (యువతులను ఎరవేసి వలపన్నటం), లంచాలు ఇవ్వజూపటం వంటి వాటిని ఉపయోగిస్తామని ఆ సంస్థ అధికారులు సూచిస్తున్న వీడియో దృశ్యాలను చానెల్ 4 రికార్డు చేసింది.

ఆ సంస్థ మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని ఆరోపణలను కొట్టివేసింది.

భారత్‌లో ఎస్‌సీఎల్ ఇండియా సంస్థలో కేంబ్రిడ్జి ఎనలిటికా అంతర్భాగం. దాని వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం అది లండన్‌లోని ఎస్‌సీఎల్ గ్రూపు, ఓవ్లెనో బిజినెస్ ఇంటలిజెన్స్ (ఓబీఐ) ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్.

భారత్‌లోని పది రాష్ట్రాల్లో 300 మంది శాశ్వత ఉద్యోగులతో పాటు 1,400 మందికి పైగా కన్సల్టింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని ఆ సంస్థ వెబ్‌సైట్‌ (www.ovleno.in)లో పేర్కొన్నారు.

ప్రముఖ రాజకీయ నేత కేసీ త్యాగి తనయుడు అమ్రిష్ త్యాగి ఈ సంస్థకు అధినేతగా ఉన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తాను ఎంత కీలక పాత్ర పోషించానన్న విషయాన్ని త్యాగి గతంలో బహిరంగంగానే చెప్పారు.

Image copyright ovleno.in screen

ఈ సంస్థ అందించే సేవల్లో "రాజకీయ ప్రచారాల నిర్వహణ" ఒకటి. సోషల్ మీడియా వ్యూహం, ఎన్నికల ప్రచార కార్యక్రమాల నిర్వహణ, మొబైల్ మీడియా నిర్వహణ అందులో భాగం.

సోషల్ మీడియా వ్యూహం కింద.. "బ్లాగర్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ మార్కెటింగ్", "ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్", ‘‘సోషల్ మీడియా అకౌంట్ల రోజువారీ నిర్వహణ’’ సేవలు అందిస్తామని పేర్కొంటోంది.

భారతదేశంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు - భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు తమ ఖాతాదారుల్లో ఉన్నారని జాబితాలో చేర్చి చూపుతోంది.

"బీజేపీ కోసం నాలుగు ఎన్నికల ప్రచారాలను విజయవంతంగా నిర్వహించాం" అని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు హిమాన్షు శర్మ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో (www.linkedin.com/in/himanshu-sharma-7b07a111) పేర్కొన్నారు. ఆ నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 2014 సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నట్లు చెప్పారు.

బీజేపీ 272 పైగా స్థానాల్లో గెలుపుపొందే లక్ష్యాన్ని సాధించేందుకు కాల్ సెంటర్ నిర్వహణ, తమ దేశవ్యాప్త ఉచిత నంబర్ "078200 78200"కి మిస్డ్ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా నేతలకు మద్దతు తెలిపిన వారి జాబితాను తయారు చేయడం, ఆ వివరాలన్నింటినీ గోప్యంగా భద్రపరచడం, కేంద్ర ఎన్నికల్లో నియోజక వర్గాల వారీగా బీజేపీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా సమాచార నిధిని రూపొందించడం, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీ ఎన్నికలప్పుడూ సేవలు అందించినట్టు హిమాన్షు శర్మ తన ప్రొఫైల్‌లో వివరించారు.

Image copyright ovleno.in screen

అయితే.. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఆ కంపెనీతో తమకు సంబంధాలు లేవని అంటున్నాయి.

"ఎస్‌సీఎల్ గ్రూపు, అమ్రిష్ త్యాగిల గురించి మా పార్టీ ఎప్పుడూ వినలేదు. కాబట్టి వారితో కలిసి తాము పనిచేశామనే ప్రసక్తే లేదు’’ అని బీజేపీ సోషల్ మీడియా విభాగం పర్యవేక్షకుడు అమిత్ మాలవీయ బీబీసీతో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అలాంటి సమాధానమే వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా డేటా విశ్లేషణ బృందం ఉందని.. ఎస్‌సీఎల్ లేదా దాని అనుబంధ సంస్థలు వేటినీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఉపయోగించుకోలేదని ఆ పార్టీ సోషల్ మీడియా వ్యూహకర్త దివ్య స్పందన బీబీసీతో పేర్కొన్నారు.

ఈ అంశంపై ఎస్‌సీఎల్ గ్రూప్ స్పందనను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, అటువైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన లభించలేదు.

Image copyright Getty Images

ఎన్నికలు జరిగిన ప్రతిసారీ సోషల్ మీడియా ప్రచారానికి చేసిన ఖర్చుల వివరాలను కూడా పార్టీలు అఫిడవిట్‌లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉందని, కానీ అలా ఎంతమంది చేస్తున్నారన్న విషయంలో స్పష్టత లేదని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్యక్షుడు జగదీప్ చోకర్ బీబీజీకి చెప్పారు. ఎన్నికలు, రాజకీయ సంస్కరణల రంగంలో స్వచ్ఛంద సంస్థ ఏడీఆర్ పనిచేస్తోంది.

పైగా ఎస్‌సీఎల్ ఇండియా.. అమెరికాలో చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తరహా ప్రచారాన్ని భారత్‌లోనూ చేస్తున్నప్పటికీ.. దానిని ఎంతవరకు చట్టవ్యతిరేక చర్యగా పరిగణిస్తారనే విషయంలో స్పష్టత లేదు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 కింద ఉన్న ప్రస్తుత నిబంధనల ప్రకారం.. సున్నితమైన వ్యక్తిగత సమాచారం నష్టపోయినప్పుడు బాధితుడు సెక్షన్ 43ఏ కింద పరిహారం పొందే అవకాశం ఉందని, ఒప్పందాన్ని ఉల్లంఘించి సమాచారాన్ని లీక్ చేసినందుకు సెక్షన్ 72ఏ కింద శిక్ష పడుతుందని దిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో టెక్నాలజీ పాలసీ పరిశోధకురాలు స్మృతి పర్షీరా వివరించారు.

పాస్‌వర్డ్‌లు, ఆర్థిక పరమైన విషయాలు, ఆరోగ్య పరిస్థితులు, బయోమెట్రిక్ సమాచారం వంటి వాటిని సున్నితమైన వివరాలుగా చట్టం పరిగణిస్తోందని ఆమె తెలిపారు.

ప్రస్తుతం వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించిన విషయాలపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పింజ్రా తోడ్: ‘దేశ వ్యతిరేక కార్యకలాపాల’ ఆరోపణలతో యువతుల అరెస్ట్ - బెయిల్ - వెంటనే మళ్లీ అరెస్ట్

లాక్‌డౌన్ ‌సమయంలో టెక్ ఇండస్ట్రీ విజేతలు ఎవరు? పరాజితులు ఎవరు?

''ఆస్తుల విక్రయం ప్రతిపాదనను పున:పరిశీలించండి.. అప్పటివరకూ అమ్మకాలు ఆపేయండి'' - టీటీడీకి ఏపీ ప్రభుత్వం ఆదేశం

వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’

''ఇక్కడ భూమి బాగానే కంపిస్తోంది...'': భూకంపంలోనూ ఇంటర్వ్యూ ఆపని న్యూజిలాండ్ ప్రధాని

భారత్ - పాక్ సరిహద్దులో స్థానికులు పట్టుకున్న ఈ పావురం పొరుగు దేశపు గూఢచారా?

హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ సీనియర్: 3 ఒలింపిక్స్‌‌లలో 3 స్వర్ణ పతకాలు అందించిన ఆటగాడు

కరోనావైరస్ సెకండ్ వేవ్: ఆసియా దేశాల నుంచి ప్రపంచ దేశాలు ఏం నేర్చుకోవాలి

వీడియో: కరోనావైరస్‌పై పోరాటానికి సహకరిస్తున్న నాలుగు కాళ్ల హీరో