ఫేస్‌బుక్: సమాచారం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

  • 21 మార్చి 2018
యూజర్ల సమాచారాన్ని థర్డ్ పార్టీలకు అందజేస్తున్న టెక్ సంస్థలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక యూజర్ల సమాచారాన్ని థర్డ్ పార్టీలకు అందజేస్తున్న టెక్ సంస్థలు

పరిశోధనా సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా సుమారు 5 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో సోషల్ నెట్‌వర్క్ సమాచారాన్ని ఎవరితో, ఎందుకు పంచుకుంటున్నారన్న చర్చ మరోసారి మొదలైంది.

సమాచారం ద్వారానే ఫేస్‌బుక్‌కు ప్రకటనలు వస్తున్నాయి. వాటి వల్లనే ఫేస్‌బుక్‌కు ఆదాయం లభిస్తోంది.

యూజర్ల ఇష్టాయిష్టాలు, వాళ్ల జీవన విధానాలు, వారు ఏ రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు తదితర వివరాల పట్టిక తయారు చేయగలిగే సామర్థ్యం ఫేస్‌బుక్‌కు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అందువల్ల ఇప్పుడు ఫేస్‌బుక్‌ ఇతరులతో ఎలాంటి సమాచారాన్ని పంచుకుంటోంది? యూజర్లు తమ సమాచారంపై తిరిగి ఎలా నియంత్రణ పొందవచ్చు? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేంబ్రిడ్జి అనలిటికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెగ్జాండర్ నిక్స్

'మీరు హాలీవుడ్ స్టార్ అయితే ఎలా ఉంటారో చూసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి'

ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంటాయి. మీ ఐక్యూను పరీక్షించే పేరుతో, మీ లోపలి వ్యక్తిత్వాన్ని చూపే పేరుతో మిమ్మల్ని అవి ఆకర్షిస్తాయి.

'మీ సమాచారం అంతా మా వద్ద భద్రం' అన్న పేరిట ఇలాంటి చాలా క్విజ్‌లు మీ సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నాయి.

ఇలాంటి గేమ్‌లు, క్విజ్‌లు నిజానికి యూజర్ల సమాచారం సేకరించే వలల్లాంటివి.

అలాంటి ఒక ఫేస్‌బుక్ క్విజ్ - 'దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్' - నుంచే కేంబ్రిడ్జి అనలిటికా లక్షలాది మంది ప్రజల సమాచారాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎలాంటి సమాచారం కేంబ్రిడ్జి అనలిటికా చేతిలో ఉందో ఇంకా స్పష్టత లేదు.

Image copyright Getty Images

సమాచారం భద్రంగా ఉండాలంటే యూజర్లు ఏం చేయాలి?

  • ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యాక యాప్ సెట్టింగ్ పేజీని సందర్శించండి
  • యాప్స్, వెబ్ సైట్స్, ప్లగిన్స్ కింద ఉన్న ఎడిట్ బటన్ క్లిక్ చేయండి
  • ప్లాట్‌ఫామ్‌ను డిజేబుల్ చేయండి

దీని వల్ల మీరు ఫేస్‌బుక్‌లో థర్డ్ పార్టీ సైట్లను ఉపయోగించలేరు. అయితే దాని వల్ల మీకు మరీ ఎక్కువ నష్టం కలుగుతుందనుకుంటే, మీ వ్యక్తిగత సమాచారంపై నియంత్రణ కోసం మరో దారి ఉంది.

ఫేస్‌బుక్‌లోని యాప్ సెట్టింగ్స్ పేజీలోనికి లాగిన్ కండి.

యాప్ మీ ఏ విభాగం నుంచి సమాచారాన్ని పొందకూడదు అనుకుంటారో ఆ విభాగాలన్నిటినీ అన్‌క్లిక్ చేయండి. ఉదా: బర్త్ డే, కుటుంబం, మీ మతపరమైన అభిప్రాయాలు, మీ టైమ్‌లైన్‌లోని పోస్టులు, కార్యకలాపాలు, మీ ఇష్టాయిష్టాలు మొదలైనవి.

Image copyright Getty Images

ఇంకా ఏమేం చేయొచ్చు?

‘యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా స్కూల్ ఆఫ్ లా’ లో లెక్చరర్‌గా పని చేస్తున్న పాల్ బెర్నాల్, ''ఒకవేళ మీరు ఏవైనా గేమ్స్, క్విజ్ ఆడాలనుకుంటే, ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ కాకండి. డైరెక్ట్‌గా ఆ సైట్‌కే వెళ్లండి'' అని సూచించారు.

''ఫేస్‌బుక్ లాగిన్‌ను ఉపయోగించడం చాలా సులభం కానీ, దాని వల్ల ఫేస్‌బుక్ ప్రొఫెల్స్ నుంచి చాలా సమాచారాన్ని సంగ్రహించడానికి అవకాశం కలుగుతుంది'' అన్నారు.

మీ సమాచారం మొత్తం ఎవరి చేతిలో పడకూడదు అంటే ఒకే ఒక్క మార్గముంది.

''ఫేస్‌బుక్ నుంచి బయటకు వచ్చేయండి'' అని సూచించారు డాక్టర్ బెర్నాల్.

ఎక్కువ మంది ఫేస్‌బుక్ నుంచి బయటకు రావడం ప్రారంభిస్తేనే అది యూజర్ల సమాచారాన్ని పరిరక్షిస్తుందని అన్నారు.

ఈ సలహా ఇస్తోంది ఆయన ఒక్కరే కాదు. కేంబ్రిడ్జి అనలిటికా వివాదం నేపథ్యంలో ఇప్పుడు ట్విటర్‌లో #DeleteFacebook అన్న హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

అయితే ఫేస్‌బుక్ జీవన విధానం అయిపోతున్న ఈ రోజుల్లో ఎంతమంది దాని నుంచి బయటకు వస్తారన్నది అనుమానమే.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మ్యాక్స్ స్క్రెమ్స్ 2011 నుంచి ఫేస్‌బుక్‌పై పోరాటం చేస్తున్నారు

మీకు సంబంధించిన ఏయే సమచారాన్ని సంగ్రహించారో తెలుసా?

ప్రస్తుత సమాచార రక్షణ నిబంధనల కింద, యూజర్లు ఆయా సంస్థలు తమకు సంబంధించిన ఏ సమాచారాన్ని సంగ్రహించాయో తెలుసుకోవడానికి వాటిని విజ్ఞాపన పంపవచ్చు.

2011లో ఆస్ట్రియన్ ప్రైవసీ అడ్వొకేట్ మ్యాక్స్ స్క్రెమ్స్ ఫేస్‌బుక్‌కు అలాంటి విజ్ఞాపన చేసినపుడు ఆయనకు 1,200 ఫైళ్లు ఉన్న సీడీని అందజేసింది ఫేస్‌బుక్‌.

వాటిలో తాను ఆ సైట్‌ను యాక్సెస్‌ చేయడానికి ఉపయోగించిన అన్ని కంప్యూటర్ల ఐపీ అడ్రస్‌లు, తన మెసేజ్‌లు, ఛాటింగ్ వివరాలు, ఆయన లొకేషన్, ఆయన డిలీట్ చేసిన మెసేజ్‌లు, స్టేటస్ అప్‌డేట్‌లు, వాల్‌పోస్టులు అన్నీ కనిపించాయి.

సమాచార రక్షణ కోసం త్వరలో యూరప్‌లో సమాచార పరిరక్షణ నిబంధనలు తీసుకురాబోతున్నారు. దీని వల్ల ముందు, ముందు యూజర్లు అడిగిన వెంటనే సోషల్ మీడియా సైట్లు వారు అడిగిన వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.

అలాగే యూజర్లు అడిగిన సమాచారాన్ని స్పష్టంగా, చదవదగిన రూపంలో ఇవ్వకుంటే వాటికి భారీ జరిమానా విధించే ప్రతిపాదన కూడా దానిలో ఉంది.

Image copyright Reuters

సమాచారాన్ని ఎంత కాలం భద్రపరుస్తారు?

యూరప్‌లోని సమాచార రక్షణ చట్టాలు సమాచారాన్ని కేవలం 'అవసరమైనంత కాలం' మాత్రమే భద్రపరచాలని చెబుతున్నాయి. అయితే 'అవసరమైనంత కాలం' అన్నదానికి సరైన నిర్వచనం లేదు.

యూజర్లు తమ అకౌంట్లను డిలీట్ చేసినప్పుడు వాళ్ల పాత పోస్టులన్నీ మాయం కావాలి. ఫేస్‌బుక్ విషయానికి వస్తే, ఒక వ్యక్తి తాను చేసిన పోస్టింగ్‌ను డిలీట్ చేయనంత కాలం అది ఆన్‌లైన్‌లో నిరంతరం అలాగే ఉంటుంది.

కానీ ఫేస్‌బుక్ యూజర్లను కేవలం బ్రేక్ తీసుకోమని ప్రోత్సహిస్తుంది. అంటే కేవలం కొద్ది కాలం డీ-యాక్టివేట్ చేసుకుని తిరిగి రమ్మంటుంది.

ఏదేమైనా, ఆర్థిక ప్రయోజనాల కోసం కేంబ్రిడ్జ్ అనలిటికా లాంటి సంస్థలు రాజకీయ పరిణామాలను శాసించడం ఆందోళన కలిగించే పరిణామం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా