వికటించిన తేనెటీగల థెరపీ.. మహిళ మృతి

తేనెటీగల థెరపీ

ఫొటో సోర్స్, Photoshot

స్పెయిన్‌లో తేనెటీగల థెరపీ వికటించి 55 ఏళ్ల మహిళ మృతి చెందారు. ఆమె గత రెండేళ్లుగా తేనెటీగల ఆక్యుపంక్చర్ థెరపీ తీసుకుంటున్నారు. థెరపీ పొందే క్రమంలో పలు అవయవాలు చచ్చుబడిపోయిన ఆమె.. ఇటీవలే మృతి చెందారు.

మాడ్రిడ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన అలర్జీ విభాగం వైద్యులు 'జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ అల్లెర్జాలజీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ'లో ఈ విషయాన్ని వెల్లడించారు.

తీవ్ర రియాక్షన్ కారణంగా గుండెపోటు, ఆ తర్వాత శాశ్వతంగా కోమాలోకి జారుకుని ఆమె మరణించారని డాక్టర్లు తెలిపారు. తేనెటీగల ఆక్యుపంక్చర్ థెరపీ సురక్షితం కాదని వారు హెచ్చరించారు.

తేనెటీగల ఆక్యుపంక్చర్ థెరపీలో ఇలా ఒక వ్యక్తి మరణించడం ఇదే మొదటిసారి.

మృతురాలు గత రెండేళ్లుగా ఒక ప్రైవేట్ క్లినిక్‌లో కండరాల సంకోచాలు, కండరాల ఒత్తిడికి ఈ చికిత్స తీసుకుంటున్నారు.

తేనెటీగల థెరపీ తీసుకుంటుండగా - మొదట తుమ్ములతో ప్రారంభమై, ఆ తర్వాత శ్వాస ఆడక, ఆమె స్పృహ కోల్పోయారు.

ఆమెకు గతంలో ఆస్తమా కానీ, గుండెజబ్బు కానీ, అలర్జీ రియాక్షన్లు కానీ ఉన్న చరిత్ర కూడా లేదు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

గ్వినెత్ పాల్‌ట్రో

తేనెటీగల థెరపీ అంటే ఏమిటి?

  • తేనెటీగల థెరపీలో తేనెటీగల నుంచి ఉత్పత్తి అయ్యే తేనె, రాయల్ జెల్లీ, కొన్నిసార్లు విషాన్ని కూడా వైద్య చికిత్సలో ఉపయోగిస్తారు.
  • థెరపీ గురించి కొన్ని లాభాలున్నాయని చెబుతున్నా, అవి చాలా స్వల్పం.
  • తేనెటీగ విషం థెరపీని ఆర్థరైటిస్, మల్టిపుల్ స్ల్కెరోసిస్ (ఎమ్‌ఎస్‌) లాంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.
  • తేనెటీగ కుడితే మంట పుడుతుంది. రోగనిరోధక శక్తి దానికి ప్రతిస్పందించి, ఆ మంటను తగ్గించే ప్రక్రియ చేపడుతుందన్నది దీని వెనుక ఉన్న సిద్ధాంతం.
  • కానీ మల్టిపుల్ స్ల్కెరోసిస్ ట్రస్ట్ మాత్రం ఎమ్‌ఎస్‌తో బాధపడుతున్న వాళ్లకు ఇప్పటివరకు సరైన చికిత్సా విధానం లేదని చెబుతోంది.
  • ఈ థెరపీని గతంలో హాలీవుడ్ నటి గ్వినెత్ పాల్‌ట్రో కూడా సమర్థించారు.
  • 2016లో న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్వినిత్ పాల్ట్రో తాను కూడా తేనెటీగల థెరపీ ప్రయత్నించినట్లు చెప్పారు.
  • తన హెల్త్ వెబ్‌సైట్ గూప్‌లో.. తన పాత గాయానికి తేనెటీగ విషం థెరపీని తీసుకుంటే అది నయమైందని ఆమె వెల్లడించారు. అయితే అది చాలా బాధాకరమైన చికిత్స అని గ్వినెత్ తెలిపారు
  • గెరార్డ్ బట్లర్.. గతేడాది స్టంట్ చేస్తుండగా కలిగిన నొప్పిని తగ్గించుకోవడానికి తేనెటీగల థెరపీ చేయించకున్నట్లు తెలిపారు. అయితే 23 తేనెటీగల విషం ఇంజెక్ట్ చేయించుకున్న తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

తేనెటీగల థెరపీలో ఇచ్చేముందు వాటి వల్ల కలిగే రిస్కుల గురించి రోగులకు పూర్తిగా వివరించాలి.

రియాక్షన్ వస్తే ఏం చేయాలో ప్రాక్టీషనర్లకు శిక్షణ ఇవ్వాలి.

ఒక సురక్షిత వాతావరణంలోనే చికిత్స అందివ్వాలి.

ఏవైనా రియాక్షన్ వచ్చినపుడు వెంటనే తగిన చికిత్స అందివ్వడానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉండాలి.

అయితే ఇలాంటి చికిత్సలు ప్రైవేట్ క్లినిక్‌లలో జరుగుతాయి కాబట్టి, అలాంటి చర్యలు తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు.

స్పెయిన్ మహిళ మృతి గురించి మెడికల్ జర్నల్‌లో నివేదికను ప్రచురించిన వైద్యుల్లో ఒకరైన రికార్డో మాద్రిగల్ బుర్గలేటా మాట్లాడుతూ.. ‘‘ఈ చికిత్స వల్ల లాభాల కన్నా నష్టమే ఎక్కువ. అందువల్ల ఇది సురక్షితం కాదని సూచిస్తున్నాం‘' అన్నారు.

బ్రిటన్ క్లినికల్ సర్వీసెస్ ఫర్ అలర్జీ విభాగానికి అధిపతి అయిన అమీనా వార్నర్ మాట్లాడుతూ.. ''తేనెటీగల విషం లాంటి అలర్జీ పుట్టించే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్ల చాలా రిస్కులున్నాయి. వాటివల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)