బాల్ ట్యాంపరింగ్: పాకిస్తాన్ ఆటగాళ్లపైనే ఆరోపణలెక్కువ!
- రవిశంకర్ లింగుట్ల
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వార్తలతో ట్యాంపరింగ్ అంశం క్రికెట్ ప్రపంచంలో మరోసారి చర్చనీయాంశమైంది.
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ నెల 24న (శనివారం) ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశామని జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ అంగీకరించారు. స్మిత్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఒక టెస్టు మ్యాచ్ నిషేధంతోపాటు మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించింది. స్మిత్ నిర్దేశం మేరకు ట్యాంపరింగ్ చేసిన బాన్‌క్రాఫ్ట్‌కు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పెట్టింది.
తాజా ఘటన నేపథ్యంలో- బాల్ ట్యాంపరింగ్, దీనిని నిషేధించే నిబంధనలు, ట్యాంపరింగ్ ఎందుకు చేస్తున్నారు, అంతర్జాతీయ క్రికెట్లో గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన పలు ఘటనలు, దేశవాళీ క్రికెట్లో ట్యాంపరింగ్ అంశాలను ఈ కథనంలో చూద్దాం!
ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా క్రికెటర్లు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవెన్ స్మిత్
బంతి రూపును ఎందుకు మారుస్తారు?
ఆడే కొద్దీ బంతి పాతబడుతుంది. పాతబడే కొద్దీ బంతి ప్రయాణించే తీరు, వేగంలో సహజంగానే మార్పులు వస్తాయి. బంతి పాతబడే కొద్దీ స్వింగ్ చేయడం కష్టమవుతుంటుంది. అయినప్పటికీ, పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టడానికి బౌలర్లు ప్రయత్నిస్తుంటారు.
బంతిని రివర్స్ స్వింగ్‌కు అనువుగా మార్చుకొనేందుకు కొందరు ఆటగాళ్లు అనుచిత మార్గాన్ని ఎంచుకొంటుంటారు. బంతి ఆకారాన్ని కావాలనే దెబ్బతీస్తుంటారు. గోళ్లతోనో, ఏదైనా వస్తువుతోనో, పదార్థంతోనో లేదా ప్యాంటు జిప్ లాంటి వాటికి రుద్దడం ద్వారానో బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నిస్తుంటారు. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం.
బంతి ఎలా ఉందనేది అంపైర్లు తరచూ పరిశీలిస్తుంటారు. బంతి ఆకారాన్ని మార్చేందుకు ఎవరైనా యత్నిస్తున్నట్లు అనుమానం వచ్చినా తక్షణం బంతిని పరీక్షిస్తారు. ఆటగాళ్లు చేసిన తప్పు తీవ్రతను బట్టి, ఇంగ్లండ్‌లోని 'మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ)' రూపొందించిన నిబంధనల ప్రకారం ఐసీసీ చర్యలు చేపడుతుంది. క్రికెటర్లు బంతి ఆకారాన్ని దెబ్బతీసేందుకు యత్నించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ట్యాంపరింగ్ ఆరోపణలు ఎక్కువగా పాకిస్తాన్ ఆటగాళ్లపై వచ్చాయి.
ఫొటో సోర్స్, Getty Images
షోయబ్ అఖ్తర్: 'బాల్ ట్యాంపరింగ్‌ను పాకిస్తాన్ మొదలు పెట్టి ఉండొచ్చు. కానీ నిజానికి ఈ పని ప్రపంచంలోని ప్రతీ జట్టు చేస్తోంది.'
తాను, తమ జట్టులోని సమకాలీన పేస్ బౌలర్లు అందరూ ట్యాంపరింగ్ చేసినట్లు/చేస్తున్నట్లు 2011లో వెలువడ్డ తన ఆత్మకథ 'కాంట్రవర్సియల్లీ యువర్స్'లో పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ అఖ్తర్ వెల్లడించారు. తాను స్లో ట్రాక్‌లపై ట్యాంపరింగ్ ఎక్కువగా చేశానని తెలిపారు.
బాల్ ట్యాంపరింగ్‌ను పాకిస్తాన్ మొదలు పెట్టి ఉండొచ్చని, కానీ నిజానికి ఈ పని ప్రపంచంలోని ప్రతీ జట్టు చేస్తోందని అఖ్తర్ వ్యాఖ్యానించారు.
రివర్స్ స్వింగ్‌కు ట్యాంపరింగ్‌పైనే ఆధారపడుతున్నారు: సి.వెంకటేశ్
బాన్‌క్రాఫ్ట్ ఉదంతంపై హైదరాబాద్‌కు చెందిన క్రీడా విశ్లేషకుడు సి.వెంకటేశ్ బీబీసీతో మాట్లాడుతూ- రివర్స్ స్వింగ్ తెరపైకి వచ్చినప్పటి నుంచే బాల్ ట్యాంపరింగ్ ఉందన్నారు. రివర్స్ స్వింగ్‌కు ప్రధానంగా బంతి ఆకారాన్ని మార్చడంపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. సీనియర్ ఆటగాళ్లయితే ఈ పని చాలా తెలివిగా చేస్తుంటారని చెప్పారు.
బాల్ ట్యాంపరింగ్‌కు దాదాపు అన్ని జట్లూ యత్నిస్తుంటాయని వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. విజయాల విషయంలో గొప్ప రికార్డులు ఉన్న ఆస్ట్రేలియా లాంటి జట్లు ఇలా చేయడం విస్మయం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
క్రికెట్ అంతకంతకూ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిపోతోందని, బాల్ ట్యాంపరింగ్‌కు పురిగొల్పుతున్న అంశాల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. బాల్ ట్యాంపరింగ్‌పై నిషేధం తొలగించాలనే వాదనా ఉందని ప్రస్తావించారు.
ట్యాంపరింగ్: గత రెండు దశాబ్దాల్లో జరిగిన కొన్ని ఘటనలు
వకార్ యూనిస్(2000): శ్రీలంకలోని కొలంబోలో దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్ వకార్ యూనిస్ చేతివేళ్లతో బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నించారు. దీంతో ఆయనపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. మ్యాచ్ ఫీజులో కోత కూడా పెట్టారు.
సచిన్ తెందుల్కర్(2001): దక్షిణాఫ్రికాతో అదే దేశంలోని పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్ సచిన్ తెందుల్కర్ బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఫొటో సోర్స్, Getty Images
సచిన్ తెందుల్కర్
సచిన్‌పై రెఫరీ మైక్ డెన్నెస్ ఒక టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పెట్టారు.
బంతికి అతుక్కున్న గడ్డిని సచిన్ తొలగిస్తున్నట్లు వీడియోలో కనిపించింది.
రెఫరీ నిర్ణయంపై భారత్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి.
సచిన్‌పై అసంబద్ధంగా చర్య తీసుకొన్నారంటూ, ఐసీసీకి భారత్ అప్పీలు చేసింది.
రెఫరీ నిర్ణయాన్ని ఐసీసీ సమీక్షించింది. సచిన్ చేసిన పని అంపైర్ అనుమతి లేకుండా బంతిని శుభ్రం చేయడం కిందకు వస్తుందని, ట్యాంపరింగ్ కిందకు రాదని స్పష్టం చేస్తూ, ఆయనపై చర్యను ఉపసంహరించుకుంది.
షోయబ్ అఖ్తర్(2003): శ్రీలంకలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచులో పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అఖ్తర్ బంతి సీమ్‌ను దెబ్బతీసేందుకు యత్నించినట్లు తేలడంతో ఆయనపై రెఫరీ గుండప్ప విశ్వనాథ్ రెండు మ్యాచుల నిషేధం విధించారు.
అఖ్తర్‌కు మ్యాచు ఫీజులో 75 శాతం కోత పెట్టారు. మరో సందర్భంలోనూ అఖ్తర్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి.
ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ ద్రవిడ్
రాహుల్ ద్రవిడ్(2004): జింబాబ్వేతో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత ఆటగాడు రాహుల్ ద్రవిడ్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ద్రవిడ్ 'లాజెంజ్' అనే బిళ్లను నమిలి, బంతికి ఒక వైపున దానిని పూసి, తొలగించారని రెఫరీ తేల్చారు.
ఈ ఆరోపణలపై ద్రవిడ్‌కు మ్యాచ్ ఫీజులో కోత విధించారు.
షాహిద్ అఫ్రీదీ (2010): ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రీదీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్లు తేలింది. ఓ రెండు సందర్భాల్లో అఫ్రీదీ బంతిని కొరుకుతున్నట్లు టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.
ఆయనపై రెండు ట్వంటీ20 మ్యాచుల నిషేధం విధించారు.
ఫొటో సోర్స్, Getty Images
షాహిద్ అఫ్రీదీ
డుప్లెసిస్(2013, 2016): దక్షిణాఫ్రికా ఆటగాడు (ప్రస్తుత కెప్టెన్) డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్ కారణంగా రెండుసార్లు మ్యాచ్ ఫీజును పూర్తిగా లేదా పాక్షికంగా కోల్పోయారు.
2013లో దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఒక టెస్టులో తన ట్రౌజర్ పాకెట్‌కు ఉన్న జిప్కు బంతిని రుద్దుతూ ఆయన కెమెరా కంటికి చిక్కారు.
2016లో ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో డుప్లెసిస్ ఏదో స్వీట్ తింటూ, లాలాజలాన్ని బంతిపై పూస్తూ దాని ఆకారాన్ని మార్చేందుకు యత్నించారు.
'దేశవాళీ క్రికెట్లో ఎక్కువ'
అంతర్జాతీయ మ్యాచులతో పోలిస్తే రంజీ, త్రీడే లీగ్, టూడే లీగ్ లాంటి దేశవాళీ మ్యాచుల్లో బాల్ ట్యాంపరింగ్ జరిగేందుకు ఆస్కారం ఎక్కువని పేరు వెల్లడించడానికి ఇష్టపడని హైదరాబాద్‌కు చెందిన ఒక కోచ్ బీబీసీతో చెప్పారు.
అంతర్జాతీయ మ్యాచులతో పోలిస్తే ఈ మ్యాచుల్లో కెమెరాల వాడకం అందులోనూ అత్యాధునిక కెమెరాల వాడకం చాలా తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు.
గతంలో ఇతర ఫీల్డర్లతో పోలిస్తే బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్లు బాల్ ట్యాంపరింగ్ ఎక్కువగా చేసేవారని, ఎందుకంటే వారిపై అంపైర్లు, కెమెరాల దృష్టి తక్కువగా ఉండేదని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)