#AadhaarFacts: తల్లీబిడ్డలను కలిపిన ఆధార్

  • 28 మార్చి 2018
సౌరభ్
చిత్రం శీర్షిక సౌరభ్

హరియాణాలోని పానిపట్‌కు చెందిన వినోద్, గీత దంపతుల ఐదేళ్ల కుమారుడు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. కొన్నేళ్ల తర్వాత ఆధార్ పుణ్యమా అని ఆ బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు చేరాడు.

"2015లో ఆ రోజు ఆదివారం. ఆరుబయట ఆడుకుంటున్న మా కుమారుడు సౌరభ్ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా ఫలితం లేదు. రైల్వే స్టేషన్‌లోనూ చూశాం. కానీ ఆచూకీ తెలియలేదు. సాయంత్రం 6 అయ్యింది. మా భర్త ఇంటికి వచ్చారు'' అని చెమర్చిన కళ్లతో నాటి ఘటనను వివరించారు గీత.

పండ్లు అమ్ముకుని బతికే వినోద్.. సౌరభ్ కోసం దిల్లీ, హరియాణా తదితర ప్రాంతాల్లోనూ తీవ్రంగా గాలించారు. కానీ బాలుడి జాడ మాత్రం దొరకలేదు. గురుద్వారాల్లో, ఆలయాల్లో, చాందినీ చౌక్ వద్ద.. ఇలా ఆయన వెతకని ప్రాంతమంటూ లేదు.

చివరికి ఆధార్ పుణ్యమా అంటూ సౌరభ్ ఆచూకీ తెలిసింది.

ఎలా..?

ఓ రోజు వినోద్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చిన్నారుల సంక్షేమం కోసం పని చేసే సలాం బాలక్ ట్రస్ట్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అది.

'స్కూలులో చేర్పించేందుకు సౌరభ్‌కి ఆధార్ కార్డు ఇప్పించేందుకు ప్రయత్నించాం. అందుకోసం ఆ బాలుడు వేలిముద్రలు నమోదు చేసేందుకు వెళ్తే, అతనికి అప్పటికే పానిపట్‌లో ఆధార్ కార్డు ఉన్నట్టు రికార్డుల్లో తెలిసింది. ఆ కార్డుకు ఓ మొబైల్ నంబరు కూడా అనుసంధానించి ఉంది. ఆ నంబర్‌కి ఫోన్ చేస్తే బాలుడి తండ్రి మాట్లాడారు' అని సలాం బాలక్ ట్రస్ట్‌కి చెందిన నిర్మలాదేవి వివరించారు.

"మేము వినోద్‌కి ఫోన్ చేసినప్పుడు వారి కుమారుడు సౌరభ్ కొన్నేళ్ల కిందట ఇంటి నుంచి తప్పిపోయినట్లు తెలిసింది. అలా ఆధార్ కార్డు సాయంతో తల్లిదండ్రుల వద్దకు మేము చేర్చిన మొదటి పిల్లాడు సౌరభ్" అని ఆమె తెలిపారు.

Image copyright Getty Images

ఆధార్ సాయంతో

సలాం బాలక్ అనే సంస్థ గత ఏడేళ్లలో ఏడుగురు చిన్నారులను ఆధార్ సాయంతో వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది.

ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి చిన్నారుల వేలిముద్రల ద్వారా వారికి ఆధార్ కార్డు ఉందా? అని రిశీలిస్తారు.

ఆధార్ కార్డు డేటాతో చిన్నారుల కుటుంబ వివరాలను తెలుసుకుంటారు.

దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చైల్డ్ హోంలో ఉంటున్న వారంతా పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన తప్పిపోయిన పిల్లలే.

ఒక్క 2017లో తమ కార్యకర్తలు, స్థానిక అధికారుల సాయంతో 678 మంది తప్పిపోయిన చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని సలాం బాలక్ సంస్థ దిల్లీ కన్వీనర్ సంజయ్‌దూబే తెలిపారు.

చిత్రం శీర్షిక కుటుంబ సభ్యులతో సౌరభ్

ఆధార్ ఎలా ఉపయోగపడింది?

"నిర్మలా దేవి చెప్పిన ఏడు కేసుల్లో ఆధార్ సాయపడింది. ప్రత్యేకించి తమ ఊరు, పేరు కూడా చెప్పలేని పసి పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ఆధార్ ఉపయోగపడుతోంది" అని ఆయన వివరించారు.

ప్రస్తుతం ఆధార్ కార్డును పలు రకాల సేవలకు అనుసంధానం చేశారు.

ఉజ్వల పథకం కింద దేశంలో ఐదు కోట్ల మంది నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది. ఈ పథకం లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరి.

అయితే, ఈ పథకం కింద తీసుకున్న కనెక్షన్‌కి గ్యాస్ సిలిండర్లు ఆలస్యంగా వస్తున్నాయని, దాంతో ఆ కనెక్షన్‌ను వదిలేసి సాధారణ కనెక్షన్ తీసుకున్నామని దిల్లీలోని జేజే కాలనీకి చెందిన సబీనా బేగం తెలిపారు.

మరోవైపు ఆధార్ వివరాలు సరిపోలకపోవడంతో రేషన్ దుకాణాల్లో చాలా మందికి సరకులు ఇవ్వడంలేదని ప్రేమా దేవి తెలిపారు.


ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)