7 రోజుల్లో చైనా స్పేస్ స్టేషన్ భూమిపై కూలనుందా?

  • 27 మార్చి 2018
స్సేస్ స్టేషన్ Image copyright China Manned Space Agency
చిత్రం శీర్షిక 8.5 టన్నుల బరువున్న ఈ స్టేషన్‌ 2011లో కక్ష్యలోకి ప్రవేశించింది.

వారం రోజుల్లో చైనా అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్-1 భూమిపై కూలిపోయే అవకాశముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో టియాంగాంగ్-1 ఒకటి.

2022లో అంతరిక్షంలోకి చైనా పంపించబోయే మానవ సహిత స్పేస్ స్టేషన్‌కి నమూనా(ప్రొటోటైప్)గా దీన్ని రూపొందించింది.

8.5 టన్నుల బరువున్న ఈ స్టేషన్‌ 2011లో కక్ష్యలోకి ప్రవేశించింది. ఐదేళ్లపాటు నిర్విరామంగా పనిచేసింది.

ఆ తర్వాత కూలిపోతుందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, ఎప్పుడు కూలుతుందనే అంశంపై ఇన్నాళ్లూ ఓ అంచనాకు రాలేకపోయారు.

ఇప్పుడు ఆ సమయం దగ్గర పడిందని మార్చి 30 - ఏప్రిల్ 2 మధ్యలో అది కూలిపోయే అవకాశం ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనా వేసింది.

అయితే, అది ప్రస్తుతం తమ నియంత్రణలో లేనందున ఎప్పుడు? ఎక్కడ పడిపోతుంది? అన్న విషయాన్ని కచ్చితంగా చెప్పడం కష్టమని శాస్త్రవేత్తలు తెలిపారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక అంతరిక్షంలోకి 2011లో టియాంగాంగ్-1ని చైనా పంపింది.

ఎక్కడ పడుతుంది?

టియాంగాంగ్-1 నుంచి సంబంధాలు తెగిపోయాయని, ఇక దాన్ని నియంత్రించే అవకాశం లేదని 2016లో చైనా ప్రకటించింది. అది ఎప్పుడు కింద పడుతుందో చెప్పలేమని తెలిపింది.

ఈ వారాంతంలోనే భూమిపై పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూరోపియన్ స్పేస్ ఎజెన్సీ శాస్త్రవేత్తలు తెలిపారు.

"తన ఆపరేషన్ పూర్తి చేసుకున్న తర్వాత క్రమంగా భూమిని సమీపిస్తూ వస్తోంది. ఇక భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత దాని వేగం మరింత పెరుగుతుంది" అని ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ స్పేస్ ఇంజినీరింగ్ రీసెర్చ్ డిప్యూటీ డైరెక్టర్ ఎలియాస్ అబౌంటానియోస్ బీబీసికి వివరించారు.

భూమికి 100 కిలోమీటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత అది బాగా వేడెక్కిపోతుందని అన్నారు. అలా విపరీతంగా వేడెక్కి చాలా వరకు స్పేస్ స్టేషన్లు గాలిలోనే కాలి బూడిదైపోతాయని ఆయన తెలిపారు.

టియాంగాంగ్-1 శకలాలు మాత్రం భూమి మీద పడిపోయే అవకాశం ఉంది.


ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)