ట్రాఫిక్ జాం: వాళ్లు రోజూ హెలికాప్టర్‌లో ఆఫీసుకెళ్తారు

  • 29 మార్చి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవాళ్లు రోజూ హెలికాప్టర్‌లో ఆఫీసుకెళ్తారు

హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలామంది ఉద్యోగులు రోజూ ఉదయం ఆఫీసుకు వెళ్లేప్పుడు ట్రాఫిక్ జాంలలో చిక్కుకొని ఇబ్బంది పడటం సర్వ సాధారణం. అలాంటప్పుడు ‘హాయిగా గాల్లో ఎగురుతూ వెళ్లిపోతే ఎంత బావుంటుందో’ అనే ఆలోచన రావడం సహజం.

భారత్‌లో పరిస్థితి ఎలా ఉన్నా, బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో కొందరు ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం అదే పని చేస్తున్నారు.

అన్ని ప్రధాన నగరాల్లానే సావో పాలో ప్రజలకూ ట్రాఫిక్ కష్టాలు ఎక్కువే. 5 కి.మీ. దూరం కూడా లేని కార్యాలయాలకు వెళ్లేందుకు కొందరికి గంటపైనే పడుతుంది.

ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలను బయటపడేసేందుకు అక్కడి సంస్థలు కొత్త మార్గాన్ని కనిపెట్టాయి. ఏకంగా హెలికాప్టర్ల ద్వారా ప్రజలను నగరంలోని తమ గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి.

ఫోన్ ద్వారా సాధారణ క్యాబ్‌లను బుక్ చేసినట్లే ఈ హెలీ క్యాబ్‌లనూ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడు సావో పాలోలో ఈ వ్యాపారం పుంజుకుంటోంది.

ప్రస్తుతం అక్కడ 200 హెలిప్యాడ్లు, 400 హెలికాప్టర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. రోజూ దాదాపు 1300 హెలికాప్టర్ ట్రిప్పులు నగరంలో నడుస్తున్నాయి. ఒక ట్రిప్పుకి దాదాపు వంద డాలర్లు ఖర్చవుతాయి. ట్యాక్సీ ధరతో పోలిస్తే ఇది రెట్టింపు.

బ్రెజిల్‌లో ఆర్థిక మాంద్యం వల్ల వినియోగానికి దూరమైన హెలికాప్టర్లు ఇలా మళ్లీ వాడుకలోకి వస్తున్నాయి. కాకపోతే ప్రస్తుతం కొందరు మాత్రమే వీటిని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉన్నారు.

కానీ వీటికి డిమాండ్ బావుండటంతో, ధరలు తగ్గించి ఎక్కువ మందికి వీటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను హెలీ క్యాబ్ సంస్థలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)