జీసస్: నిజంగా నల్లగా ఉండేవాడా?

  • 29 మార్చి 2018
సిసిరో మోరేస్ రూపొందించిన జీసస్ చిత్రం Image copyright Cícero Moraes/BBC Brasil

శతాబ్దాల తరబడి యూరప్ కేంద్రంగా కొనసాగిన చిత్రకళ, మతాలు.. జీసస్ క్రైస్ట్ స్వరూపాన్ని నీలి కళ్లు, పెరిగిన గడ్డం, పొడవాటి లేత గోధుమ వర్ణంలోని జుట్టుతో శ్వేతవర్ణ మేనిఛాయలో ఉన్న వ్యక్తిగా స్థిరపరచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మందికి పైగా గల క్రైస్తవులు ఈ చిత్రాన్నే చూశారు. దీనినే నమ్ముతున్నారు. అయితే వాస్తవానికి ఈ చిత్రించిన స్వరూపానికి ఏమాత్రం సంబంధం లేదు.

నిజానికి చారిత్రక జీసస్.. ఆయన జీవించిన కాలపు యూదుల లాగానే నల్లగా పొట్టిగా ఉండి ఉండొచ్చని.. జుట్టును కూడా కత్తిరించుకుని ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు.

అసలు జీసస్ ఎలా ఉంటాడనేది తెలుసుకోవటంలో ఈ సంక్లిష్టత.. క్రైస్తవమతానికి పునాది అయిన బైబిల్, అందులో జీసస్ జీవితాన్ని, ఆయన సిద్ధాంతం ఆరంభాన్ని వివరించే 'కొత్త నిబంధన' (న్యూ టెస్టమెంట్) నుంచే వస్తోంది. జీసస్ ఎలా ఉంటాడు అనే ప్రస్తావన అందులో లేదు.

''సువార్తల (గాస్పెల్స్)లో ఆయనను భౌతికంగా వర్ణించలేదు. ఆయన పొడవనో పొట్టి అనో లేదు. ఆయన సుకుమారంగా ఉంటారా బలంగా ఉంటారా అనేదీ లేదు. ఆయన వయసు - సుమారు 30 సంవత్సరాలు - మాత్రమే అందులో ఉంటుంది'' అని న్యూజిలాండ్ చరిత్రకారుడు జోన్ ఇ. టేలర్ పేర్కొన్నారు. కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ థియాలజీ అండ్ రెలిజియన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జోన్ రాసిన పుస్తకం 'వాట్ డిడ్ జీసస్ లుక్ లైక్? (జీసస్ ఆకృతి ఎలా ఉండేది?) ఇటీవలే విడుదలయింది.

Image copyright Cícero Moraes/BBC Brasil
చిత్రం శీర్షిక ఫోరెన్సిక్ ఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్ నిపుణుడు సిసిరో మోరేస్ రూపొందించిన జీసస్ చిత్రం.. ఒకటో శతాబ్దంలో మధ్య ప్రాచ్యంలో నివసించిన యూదుల చర్మం, జుట్టు, కళ్లు నల్లగా ఉన్నాయని సిసిరో చెప్తారు

''జీసస్‌ను తొలుత అనుసరించిన వారు ఆయన ఎలా ఉంటారనే విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు కనిపించవు. ఆయన భౌతికస్వరూపం ఎలా ఉందనేదానికన్నా.. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ఆలోచనలు ఏమిటి అనేవి నమోదు చేయటానికే వారు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది'' అని మరో చరిత్రకారుడు ఆంద్రే లియోనార్డో చెవిటారీస్ అంటారు. ఫెడరల్ యూనివర్సటీ ఆఫ్ రియో డి జెనీరియో హిస్టరీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లియోనార్డో 'జీసస్ హిస్టరీ - ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్' అనే పుస్తకం రచించారు.

ఫేసియల్ రీకన్‌స్ట్రక్షన్స్ (ముఖ పునర్నిర్మాణాలు) లో బ్రిటిష్ ఫోరెన్సిక్ నిపుణుడైన రిచర్డ్ నీవ్ 2001లో బీబీసీ రూపొందించిన ఒక డాక్యుమెంటరీ కోసం.. శాస్త్రీయ విజ్ఞాన్ని ఉపయోగించుకుని వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు పరిగణించగల ఒక ఆకృతిని రూపొందించారు. జీసస్ ముఖాకృతి నిజానికి ఎలా ఉండి ఉండొచ్చు అనేది ఆ ఆకృతి రూపకల్పన లక్ష్యం. ఇందుకోసం.. జీసస్ జీవించినట్లు పరిగణించే ప్రాంతం నుంచి, ఆయన జీవించినట్లు భావిస్తున్న మొదటి శతాబ్ద కాలానికి చెందిన మూడు పుర్రెలను సేకరించారు. ఆ పుర్రెల ఆధారంగా ఒక 3డీ మోడలింగ్‌ను రిచర్డ్ బృందం పునర్నిర్మించింది.

చిత్రం శీర్షిక 2001లో బీబీసీ డాక్యుమెంటరీ కోసం బ్రిటిష్ ఫోరెన్సిక్ నిపుణుడు రిచర్డ్ నీవ్ రూపొందించిన చిత్రం

ఆ కాలం నాటి యూదుల అస్తిపంజరాలు.. సగటు పొడవు 1.60 మీటర్లుగా, అత్యధికుల బరువు 50 కిలోలకు కాస్త ఎక్కువగా ఉన్నట్లు చూపుతున్నాయి. ఇక చర్మపు రంగు మీద ఒక అంచనాకు వచ్చారు.

జీసస్ శరీర ఆకృతి మీద టేలర్ కూడా ఇటువంటి నిర్ధారణలకే వచ్చారు. ''ఆ కాలం నాటి యూదులు బయోలాజికల్‌గా ఇప్పటి ఇరాకీ యూదులను పోలి ఉంటారు. కాబట్టి.. ఆయన జుట్టు ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు వరకూ ఉండొచ్చని అనుకుంటున్నా. గోధుమ వర్ణం కళ్లు, గోధుమ వర్ణం చర్మం కలిగిన సగటు మధ్య ఆసియా మానవుడని నేను నమ్ముతున్నా'' అని అంటారాయన.

''ఆ ప్రాంతపు మనుషులను.. ముఖ్యంగా ఆ ఎడారి మనుషుల - తీవ్రమైన సూర్యరశ్మిలో నివసించే జనం - శరీర, ముఖ లక్షణాలను.. విశ్లేషించినపుడు ఆయన ఖచ్చితంగా నల్లగానే ఉండేవారు'' అని బ్రెజిలియన్ గ్రాఫిక్ డిజైనర్ సిసిరో మోరేస్ పేర్కొంటారు. ఫోరెన్సిక్ ఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్ (ఫోరెన్సిక్ ముఖాకృతి పునర్నిర్మాణం)లో నిపుణుడైన ఆయన పలు విదేశీ యూనివర్సిటీల్లో ప్రముఖుడు. సిసిరో ఇప్పటికే 11 మంది క్యాథలిక్ సెయింట్ల ముఖాకృతి పునర్నిర్మాణం చేశారు. జీసస్ క్రైస్ట్ శాస్త్రీయ చిత్రాన్ని కూడా ఆయన రూపొందించారు.

''జీసస్ ముఖాకృతిని ఊహించటానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. ఆ ఎడారి ప్రాంతపు బిడోయిన్‌ను - ఆ ప్రాంతపు సంచార జీవి, ప్రచండ సూర్యుడి ప్రతాపానికి గురైన మనిషిని చూడటం'' అని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ అలగోవాస్ ప్రొఫెసర్, 'ద డావిన్సీ కోడ్ అండ్ ఎర్లీ క్రిస్టియానిటీ' పుస్తక రచయిత పెడ్రో లిమా వాస్కాన్సెలోజ్ చెప్తారు.

జీసస్ జుట్టు విషయం మరో ఆసక్తికరమైన అంశం. ''పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమ''ని 'ఎపిస్టల్ టు ది కొరీంథియన్స్' (కొరింథీయులకు లేఖ)లో పాల్ రాస్తారు. జీసస్‌కి ఇప్పుడు చిత్రీకరిస్తున్నట్లు పొడవాటి జుట్టు ఉండే అవకాశం లేదని ఇది సూచిస్తోంది.

''రోమన్ ప్రపంచంలో ఒక పురుషుడి ఆమోదనీయ ఆకృతి.. పొట్టి జుట్టు, పొట్టి గడ్డం. దీనికి కారణం.. ప్రాచీన తత్వవేత్త ఎవరికో పొట్టి జుట్టు ఉండి ఉండొచ్చు. అతడు తన గడ్డం పూర్తిగా గీసుకుని ఉండకపోవచ్చు'' అని చరిత్రకారుడు జొవాన్ ఇ. టేలర్ వ్యాఖ్యానిస్తారు.

Image copyright Icon Productions/Divulgação
చిత్రం శీర్షిక మెల్‌గిబ్సన్ దర్శకత్వం వహించిన 2004 సినిమా ‘ద పాషన్ ఆఫ్ ద క్రైస్ట్’ సినిమాలో జీసస్ పాత్రను జిమ్ కావీజెల్ పోషించారు

జీసస్‌కు సంబంధించి మూడో శతాబ్దానికి చెందిన మొట్టమొదటి ప్రతిమావర్ణనలు.. ఆయనను గడ్డం లేని, పొట్టి జుట్టుగల యువకుడిగా చూపుతున్నాయని చెవిటారీస్ చెప్తారు. ''అది.. గడ్డం ఉన్న దేవుడి కన్నా కూడా.. ఒక యువ తత్వవేత్త, ఒక ఉపాధ్యాయుడిని ప్రతిబింబిస్తుంది'' అని ఆయన పేర్కొన్నారు.

''పురా-క్రైస్తవ ప్రతిమావర్ణనలో.. జీసస్ పలు కోణాల్లో కనిపిస్తాడు. ఒక తత్వవేత్త లేదా బోధకుడుగా చూపే అతడి గడ్డంతో ఉన్న ముఖం, గ్రీకు సూర్యదేవుడు అపోలోను పోలిన గడ్డంలేని ముఖం, మతగురువులను పోలిన దుస్తులు, లేదా అంగవస్త్రంలో అణకువైన గొర్రెలకాపరి.. ఇలా కనిపిస్తాడు'' అని పరిశోధకురాలు విల్మా స్టీగల్ డి టొమాసో వివరిస్తారు. పాంటిఫికల్ క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో లోను, సావో పోలో లోని మ్యూజియం ఆఫ్ సేక్రెడ్ ఆర్ట్ లోను ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ థియాలజీ అండ్ రెలిజియస్ స్టడీస్ సభ్యురాలు కూడా.

చిత్రాలు

శతాబ్దాలుగా జీసస్‌ను ఒక రూపంలో స్థిరపరుస్తూ చిత్రీకరించిన చిత్రాలు.. ఆయనను మానవుడైన జీసస్‌గా కాకుండా దైవాంశమైన, దేవుడి కుమారుడైన జీసస్‌గా చూపటానికే ప్రాధాన్యమిచ్చాయని జొవాన్ విశ్వసిస్తారు. ''అందుకే ఈ అంశం నాకు చాలా ఇష్టమైన అంశం. జీసస్‌ను స్పష్టంగా చూడాలని నేను కాంక్షించాను'' అని ఆయన చెప్తారు.

మధ్య యుగాల్లో బైజాంటిన్ సామ్రాజ్యం ఉన్నత దశలో ఉన్న కాలంలో.. జీసస్‌ను పొడవాటి గట్టం, జుట్టుతో ఉన్నట్లు చూపటం పెరిగింది. ''భౌతికంగా ఆ కాలపు రాజులు, చక్రవర్తులతో పోలిన అజేయుడుగా జీసస్‌ రూపాన్ని చిత్రీకరించటం వారు ప్రారంభించారు'' అని ప్రొఫెసర్ చవిటారీస్ గుర్తుచేస్తున్నారు.

''చరిత్ర అంతటా.. జీసస్‌ను ఆయన ముఖాకృతిని కళాత్మకంగా ప్రతిబింబించటంలో.. క్రీస్తు శకం ఆరంభంలో పాలస్తీనాలో నివశించిన ఆ యథార్థ మానవుడిని వాస్తవికంగా చూపటం గురించి అసలు పట్టించుకోలేదు'' అంటారు పాంటిఫికల్ క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో కోఆర్డినేటర్, సోషియాలజిస్ట్ ఫ్రాన్సిస్కో బోర్బా రిబీరో నెటో.

''తూర్పు క్యాథలిక్ చర్చీలలో (క్యాథలిక్ చర్చెస్ ఆఫ్ ద ఈస్ట్) జీసస్ చిహ్నం కొన్ని నియమాలకు అనుగుణంగా ఉండాలి. జీసస్ వాస్తవితకు సంబంధించి ఈ వేరే దృక్కోణం అందించేలా ఆ చిత్రం ఉంటుంది. ఉదాహరణకు.. భౌతిక ప్రపంచాన్ని దాటి చూడగల జ్ఞానం, సామర్థ్యాన్ని సూచించేలా నుదురు ఎత్తుగా ఉండి, కళ్ల మధ్యలో ముడతలు కలవాలి. పలువురు మనుషుల మధ్య ఉన్న జీసస్‌ను ఎప్పుడూ గొప్పగా ప్రతిబింబించేలా చూపుతారు. అది సాధారణ మానవుడి కన్నా ఆయన అధికుడని సూచిస్తుంది. ఇక శిలువ మీద ఆయనను సజీవంగా, ప్రకాశవంతంగా చూపుతారు.. అది ఆ తర్వాత ఆయన పునరుద్ధానాన్ని సూచిస్తుంది'' అని రిబీరో నెటో వివరిస్తారు.

Image copyright Divulgação
చిత్రం శీర్షిక 2018 సినిమా ‘మేరీ మగ్దలీన్’ సినిమాలో జీసస్ పాత్రను జాక్విన్ ఫీనిక్స్ పోషించారు

పశ్చిమ చర్చి (వెస్ట్రన్ చర్చ్) ఇటువంటి నిబంధనలు పెట్టకపోవటంతో ఇన్ని శతాబ్దాలలో జీసస్ చిత్రాన్ని రూపొందించిన చిత్రకారులు తమ తమ సొంత పద్ధతుల్లో వాటిని సృష్టించారు. ''అది చాలా బరోక్ చిత్రాల్లో కనిపించే ఒక మధురమైన లేదా ఆకర్షణీయమైన రూపం కావచ్చు. లేదంటే కారావాగియో, గోయా చిత్రకళల్లో లాగా చిత్రహింసలు అనుభవించి అమరత్వం పొందిన రూపం కావచ్చు'' అని రిబీరో నెటో పేర్కొంటారు.

''ఈ చారిత్రక వ్యక్తిని వాస్తవికంగా చూపటమనే సమస్య మన కాలపు ప్రశ్న. విమర్శనాత్మక విశ్లేషణలో.. కళాత్మక ప్రాతినిధ్యాలు సంబంధిత సాంస్కృతిక ఆధిపత్యపు రూపాలను చూపినపుడు ఈ సమస్య తలెత్తింది. ఈ అర్థంలో చూస్తే.. నీలి కళ్ల, లేత గోధుమ రంగు జుట్టున్న జీసస్ వద్దనుకున్నారు. అచ్చమైన నలుపు లేదా నల్లజాతి - శ్వేతజాతి మిశ్రమ (ములాటో) వర్ణంతో, రాగి రంగు (కాబోక్లో) లక్షణాలతో జీసస్‌ను ఊహించారు. దైవత్వమనేది యూరోపియన్ ప్రజలు సామాజిక నిచ్చెనలో 'పైస్థాయి'లోని వారికి ప్రాతినిధ్యం వహిస్తారనే భావన వల్ల దైవత్వం ఆ యూరోపియన్ లక్షణాలను ప్రతిఫలిస్తుంది'' అని రిబీరో విశ్లేషిస్తారు.

అయితే.. ఈ 'యూరోపియన్' జీసస్‌కి, సుదూర దేశాల విశ్వాసులకు మధ్య దూరం.. మరింత వాస్తవిక ప్రతిబింబం కోసం - 'ఎత్నిక్ జీసస్' కోసం - అన్వేషణతో తగ్గిందని చరిత్రకారుడు చెవిటారీస్ అంటారు. ''ఒకప్పుడు పోర్చుగీసు వలస పాలనలో ఉన్న మకావూలో జీసస్‌ చిత్రపటాలు.. ఆయనను వాలు కళ్లతో, చైనా సంప్రదాయ దుస్తుల్లో చూపుతాయి. ఇథియోపియాలో నల్లజాతి లక్షణాలతో కూడిన జీసస్ రికార్డులు ఉన్నాయి'' అని ఆయన తెలిపారు.

బ్రెజిల్‌లో 'యూరోపియన్' జీసస్.. క్లాడియో పాస్ట్రో (1948 - 2016) చిత్రాల్లో చూపినట్లు వాస్తవానికి దగ్గరగా ఉంటాడు. అలీజాడిన్హో తర్వాత అత్యంత ముఖ్యమైన, పవిత్ర చిత్రకారుడిగా క్లాడియో పాస్ట్రోను పరిగణిస్తారు. నేషనల్ ష్రైన్ ఆఫ్ అపారిసిడాలోని ప్యానళ్లు, స్టెయిన్డ్ గ్లాసులు, పెయింటింగ్‌ల రూపశిల్పి అయిన పాస్ట్రో.. జీసస్‌ను బ్రెజిల్ జానపద ముఖాలతో చిత్రించారు.

అయితే.. జీసస్ సందేశాలను విశ్వసించే వారికి ఆయన వాస్తవ రూపం, లక్షణాలతో నిమిత్తం లేదు. ''జీసస్ భౌతిక రూపం, లక్షణాల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నిజానికి.. దేవుడి దయను ప్రసరించిన జీసస్ చూపు, ఆయన కదలికలతో మారిన గాలి కన్నా.. ఆయన భౌతిక ఆకృతి, లక్షణాలు ముఖ్యం కాదు. ఆయనలో సంపూర్ణంగా నివసించిన పరమాత్మ మానవ రూపమే.. దానిని విశ్వసించే వారికి సుపరిచితమైన భౌతిక లక్షణం'' అని కాటెచిసమ్ అండ్ కాటెచిసిస్ రచయిత ఫ్రాన్సిస్కో కటావో అంటారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు