మలాలా: తాలిబన్ దాడి తర్వాత తొలిసారి పాకిస్తాన్ ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images
మలాలా
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ తన స్వదేశం పాకిస్తాన్ వెళ్లారు. తాలిబాన్లు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తర్వాత ఆమె పాకిస్తాన్లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
15 యేళ్ల వయసులోనే పాకిస్తాన్లో బాలికల విద్య కోసం పోరాడిన మలాలా మీద 2012లో తాలిబాన్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు.
ఇప్పుడు ఆమె వయసు 20 యేళ్లు.
పాక్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీతో మలాలా సమావేశమయ్యే అవకాశముంది.
అయితే, "భద్రతా కారణాల దృష్ట్యా" మలాలా పర్యటనకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అక్కడి అధికారులు తెలిపారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇస్లామాబాద్‌లోని బెనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో తన తల్లిదండ్రులతో కలిసి దిగినట్టుగా పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
ఈ పర్యటన నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది.
స్వాత్ లోయలో ఉన్న తన స్వస్థలానికి మలాలా వెళ్తారా? లేదా? అన్నది తెలియరాలేదు.
ఫొటో సోర్స్, EPA
భారీ భద్రత నడుమ ఇస్లామాబాద్ విమానాశ్రయంలో మలాలా దిగినట్టు పాకిస్తాన్ టెలివిజన్ తెలిపింది.
ఆమెపై ఎందుకు దాడి చేశారు?
11 యేళ్ల వయసు నుంచే మలాలా ఓ అజ్ఞాత వ్యక్తిగా బీబీసీ ఉర్దూకు డైరీ రాసి పంపేవారు. అందులో తాలిబాన్ పాలనలో తన జీవితం ఎలా ఉందో వివరించేవారు.
మిలిటెంట్ల అణచివేతలో మగ్గిపోతున్న పాకిస్తాన్లో బాలికలు చదువుకోవాల్సిన అవసరం ఉందని స్థానికంగా చెబుతుండేది.
అయితే, 2012లో మలాలా ప్రయాణిస్తున్న స్కూలు బస్సుపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు.
అందులో తీవ్రంగా గాయపడ్డ ఆమెకు పాకిస్తాన్‌లోని మిలిటరీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం బ్రిటన్‌లోని బర్మింగ్‌హాంకు తరలించారు. అక్కడే మలాలా కుటుంబం కూడా అక్కడికే వెళ్లింది.
దాంతో మలాలా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అప్పుడు మలాలా వయసు 15 యేళ్లే.
తమ ప్రాంతంలో "పాశ్చాత్య సంస్కృతిని పెంపొందించే" చర్యలకు పాల్పడుతున్నందునే మలాలాపై కాల్పుల జరిపామని పాకిస్తాన్ తాలిబాన్ పేర్కొంది.
ఫొటో సోర్స్, University Hospitals Birmingham
మిలిటెంట్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలాను మెరుగైన వైద్యం కోసం బ్రిటన్‌కు తరలించారు.
నోబెల్ శాంతి బహుమతి
ఆ దాడి నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్య, హక్కుల గురించి మలాలా మాట్లాడుతూనే ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బాలికలు నిర్భయంగా చదువుకునేలా చేయాలన్న సంకల్పంతో తన తండ్రి జియాఉద్దీన్తో కలిసి మలాలా ఫండ్ అనే సంస్థను కూడా స్థాపించారు.
నోబెల్ శాంతి బహుమతి అందుకున్న అతిపిన్న వయస్కురాలు మలాలా. 2014లో భారత బాలల హక్కుల నేత కైలాశ్ సత్యార్థితో కలిసి మలాలా నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు.
ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా నియమితులయ్యారు. గతేడాది లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆమెకు అడ్మిషన్ ఇచ్చింది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)