గ్రేస్ ముగాబే పొలంలో బంగారం తవ్వేస్తున్నారు!

గ్రేస్ ముగాబే

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

గ్రేస్ ముగాబే

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే భార్య గ్రేస్ ముగాబే పొలాల్లో అక్రమంగా కొందరు కూలీలు చొరబడ్డారు.

నిమ్మ చెట్లను వేళ్లతో సహా పెకళించేస్తున్నారు. పొలంలో ఎక్కడ పడితే అక్కడ భారీ గుంతలు తవ్వుతున్నారు.

ఇవీ స్థానిక మీడియాలో వచ్చిన కథనాలు. మరి వారు ఎందుకలా చేస్తున్నారంటే..

ఆ పొలంలో బంగారం ఉందట. అవునండీ.. బంగారమే. ఈ పొలంలో బంగారు ముడి ఖనిజం ఉందని ఈ కూలీలు అక్రమంగా తవ్వేస్తున్నారట.

తవ్విన ఖనిజాన్ని లారీల్లో తరలిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, AFP

వారిని అడ్డుకోలేక.. గ్రేస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపాయి.

భర్త అధికారంలో ఉన్నపుడు అంటే 2015లో గ్రేస్.. మజోవె లోని ఈ పొలం వద్ద ఉన్న గ్రామీణులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.

గ్రేస్ తాజాగా పొలం వద్దకు రాగా.. అక్కడ 400 మంది బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారు.

ఆమె వారిని అడ్డుకొనే ప్రయత్నం చేసినా.. అది సఫలం కాలేదు.

‘‘మీకు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించడానికి అధికారం లేదు. అందువల్ల ఇక్కడ మాకు నచ్చిన పని మేం చేస్తాం..’’ అని కార్మికులు గ్రేస్ పై తిరగబడ్డారు.

ఫొటో సోర్స్, AFP

గ్రేస్‌కు సంబంధించిన కొన్ని వివరాలు

  • గ్రేస్‌కు 41 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకు, ముగాబేకు మధ్య సంబంధం ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయంలో ఆమె టైపిస్ట్‌గా పని చేసేవారు.
  • అప్పటికే ముగాబేకు వివాహమైంది. ఆయన భార్య సాలీ తీవ్రమైన అనారోగ్యంతో ఉండేవారు. ఆమె 1992లో చనిపోయారు.
  • గ్రేస్ 1996లో ముగాబేను వివాహం చేసుకున్నారు. ఆమెకూ అప్పటికే పెళ్లైంది.
  • ముగాబే, గ్రేస్ దంపతులకు బోనా, రాబర్ట్, చతుంగ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు.
  • గ్రేస్ సేవా కార్యక్రమాలను, ఆమె ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేయడాన్ని మద్దతుదారులు ప్రశంసిస్తుంటారు.
  • జింబాబ్వే రాజధాని హరారే శివార్లలో చైనా నిధులతో ఈ అనాథాశ్రమం ఏర్పాటు చేశారు.
  • గ్రేస్ ప్రత్యర్థులు ఆమె భారీగా ఖర్చు పెట్టే పద్ధతిని, వ్యవహారశైలిని విమర్శిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)