గాజా-ఇజ్రాయెల్ సరిహద్దులో దాడులు, 16 మంది పాలస్తీనియన్లు మృతి

  • 31 మార్చి 2018
ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న పౌరులు
చిత్రం శీర్షిక ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న పౌరులు

గాజా సరిహద్దులో నిరసనకారులపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 16మంది పౌరులు చనిపోయారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపారు.

'గ్రేట్ మార్చ్ ఆఫ్ రిటర్న్' పేరుతో వేలాదిమంది గాజా-ఇజ్రాయెల్ సరిహద్దుకు చేరుకుని ఆరు వారాలపాటు నిరసన ప్రదర్శన నిర్వహించాలనుకున్నారు. కానీ వారు దాడులకు దిగడంతో తాము కాల్పులు చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

ఈ హింసాత్మక ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కోరింది. మరోవైపు తమ ప్రజలకు రక్షణ కల్పించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ భద్రతామండలిని అభ్యర్థించారు. ఈ దాడులకు ఇజ్రాయెల్ అధికారులదే పూర్తి బాధ్యత అని ఆయన అన్నారు.

శరణార్థులు ఇజ్రాయెల్‌లోని తమ స్వస్థలాలకు చేరుకునేందుకు అనుమతించాలంటూ పాలస్తీనియన్లు ఈ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు.

"గాజా సరిహద్దులోని ఐదు ప్రాంతాలకు దాదాపు 17వేల మంది పాలస్తీనియన్లు చేరుకున్నారు. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని కొందరు వాటిలో ఉండగా, మరికొందరు ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోకి వచ్చారు. తమ నాయకుల మాటలను వీరు ఏమాత్రం పట్టించుకోలేదు" అని ఇజ్రాయెల్ భద్రతా దళం (ఐడీఎఫ్) తెలిపింది.

వారంతా తమపైకి పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేయడంతో తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని ఐడీఎఫ్ తెలిపింది.

'సరిహద్దు వద్దనున్న కంచెను దాటడానికి ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో వీరంతా మరణించారు' అని ఓ అధికార ప్రతినిధి తెలిపినట్లు 'జెరూసలేం పోస్ట్' ప్రకటించింది.

హమాస్ స్థావరాలే తమ లక్ష్యాలని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. దీనికోసం యుద్ధ ట్యాంకులు, సైనికులను మోహరించింది. ఓ ప్రదేశంలో బాష్పవాయువును ప్రయోగించడానికి ఓ డ్రోన్ కూడా ఉపయోగించారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక లాండ్ డే సందర్భంగా వేలాదిమంది పాలస్తీనియన్లు గాజా-ఇజ్రాయెల్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు.

ఈ నిరసన ప్రదర్శన దేనికోసం?

నిరసన ప్రదర్శనలు చేయడానికి ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి పాలస్తీనియన్లు ఐదు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. 1976 మార్చి 30న ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో ఆరుగురు నిరసనకారులు మరణించారు.

దీన్ని 'లాండ్ డే' గా పాలస్తీనా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి గుర్తుగా మార్చి 30 నుంచి ఆరు వారాల పాటు 'గ్రేట్ మార్చ్ ఆఫ్ రిటర్న్' పేరుతో భారీ నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయించారు.

ఈ ప్రదర్శన మే 15న ముగుస్తుంది. ఆ రోజును పాలస్తీనియన్లు 'నక్బా' (మహా విపత్తు)గా వ్యవహరిస్తారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటు సందర్భంగా జరిగిన ఘర్షణల్లో వేలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులు కావడానికి గుర్తుగా ఆ రోజును అలా జరుపుకుంటారు.

నిర్వాసితులైన పాలస్తీనీయులందరూ తిరిగి తమ స్వస్థలానికి రావడం తమ హక్కని పాలస్తీనియన్లు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తుండగా, వారంతా భవిష్యత్తులో ఏర్పడబోయే పాలస్తీనా రాజ్యంలోని గాజా, వెస్ట్ బ్యాంక్‌లకు మాత్రమే పరిమితం కావాలని ఇజ్రాయెల్ అంటోంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక సరిహద్దుల్లో ఇజ్రాయెల్ తమ భద్రతను రెట్టింపు చేసింది.

పౌరులు, పిల్లలపై దాడులు వద్దు: యూఎన్ఓ

మానవ హక్కులకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఇజ్రాయెల్‌పై ఉందని ఐరాస డిప్యూటీ పొలిటికల్ ఎఫైర్స్ చీఫ్ తాయె-బ్రూక్ జెరిహౌన్ పిలుపునిచ్చారు.

గాజా వెంబడి పరిస్థితి రానున్న రోజుల్లో మరింత క్షీణించే ప్రమాదం ఉందని ఆయన భద్రతామండలికి తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఈ హింసలో లక్ష్యంగా మారకూడదని ఆయన వ్యాఖ్యానించినట్లు రాయ్‌టర్స్ వెల్లడించింది.

మారణాయుధాలను ఉపయోగించడం అనేది చివరి అవకాశంగా మాత్రమే ఉండాలని జెరిహౌన్ అభిప్రాయపడ్డారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక నిరసన సందర్భంగా గాయపడి వెనక్కి వస్తున్న ఓ ఆందోళనకారుడు

ఇజ్రాయెల్ ఏమంటోంది?

గాజా సరిహద్దులోని నిషేధిత ప్రాంతం వద్ద జరుగుతున్న ఈ ప్రదర్శన తీవ్రరూపం దాల్చే ప్రమాదముందని ఇజ్రాయెల్ అభిప్రాయపడింది. వీరంతా కలసి ఒక్కసారిగా సరిహద్దును ఛేదించి తమ భూభాగంలో ప్రవేశించగలరని అది అంచనా వేసింది. దీంతో అక్కడ తమ బలగాల సంఖ్యను పెంచింది.

ఈ నిరసనను రెచ్చగొట్టే చర్యగా ఇజ్రాయెల్ పేర్కొంది. దీనివల్ల తలెత్తే ఏ పరిణామాలకైనా హమాస్‌తో పాటు నిరసనల్లో పాల్గొంటున్న పాలస్తీనా సంస్థలదే బాధ్యతని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)