ఆన్‌లైన్‌లో మీ వ్యక్తిగత డేటా చోరీ కాకుండా ఉండాలంటే ఈ 5 పనులు చేయండి

స్మార్ట్ ఫోన్, యాప్స్

ఫేస్‌బుక్-కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం వెలుగులోకి వచ్చాక వ్యక్తిగత డేటా భద్రత గురించి సర్వత్రా చర్చ మొదలైంది.

మన వ్యక్తిగత వివరాలను, అంటే డేటాను ఎవరు, ఎలా సేకరిస్తున్నారు? మన ఆమోదం లేకుండానే ఇది ఎలా జరిగిపోతోంది? అనే విషయాలు ఎవరికీ అర్థం కావడం లేదు.

డేటా విశ్లేషణ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా మొత్తం 5 కోట్లకు పైగా ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది.

ఈ సమాచారం ఆధారంగా వారికి నిశ్చితమైన రాజకీయ ప్రకటనలు చేరేలా చేసి అమెరికా ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసిందన్నది దానిపై వచ్చిన ఆరోపణ.

అయితే, ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు మీ వ్యక్తిగత డేటాను నిల్వ చేస్తాయన్న విషయం బహుశా ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే మీకు తెలిసే ఉంటుంది.

అయితే ఇది ఎంత విస్తృత స్థాయిలో జరుగుతుందో బహుశా అందరికీ తెలియకపోవచ్చు.

మన ఆన్‌లైన్ డేటాను మనమే ఎలా రివ్యూ చేసుకోవచ్చు? అవసరం లేని సమాచారాన్నంతా ఎలా వదిలించుకోవచ్చు అనే విషయాల గురించి మేం బెర్లిన్ కేంద్రంగా పని చేసే ‘టాక్టికల్ టెక్’ అనే లాభాపేక్ష లేని సంస్థతో మాట్లాడాం. ఈ సంస్థ ప్రత్యేకించి డిజిటల్ సెక్యూరిటీపైనే పని చేస్తుంది.

1. మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను క్లీన్ చేసుకోండి

ఫేస్‌బుక్ మనకు మన సమాచారాన్నంతా - అంటే మన ఫొటోలు, మనకు చేరిన, మనం పంపించిన సందేశాలన్నింటినీ - డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఇస్తుంది.

ఈ కాపీని పొందాలంటే: ‘జనరల్ అకౌంట్ సెట్టింగ్స్‌’కు వెళ్లి 'డౌన్‌లోడ్ ఎ కాపీ ఆఫ్ యువర్ ఫేస్‌బుక్ డాటా' ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మెయిల్ ద్వారా మీకు ఆ సమాచారం అందుతుంది.

అట్లాగే, 'యాప్స్' లోకి వెళ్లి మన సమాచారాన్ని నిల్వ చేస్తున్న వాటన్నింటినీ తొలగించొచ్చు.

యాప్‌లను తొలగించడానికి ముందు అవి ఇప్పటి వరకు మీ విషయంలో ఏయే సమాచారం సేకరించాయో ఓసారి చూడండి. వాటి దగ్గర ఉన్న సమాచారాన్ని చూసి మీరు షాక్ అవడం ఖాయం.

దీంతో పాటు, మీకు నచ్చని చాలా ఫొటోల్లోంచి మిమ్మల్ని మీరు అన్-ట్యాగ్ చేసుకోవచ్చు.

మీ ప్రొఫైల్ పేజిలో 'వ్యూ యాక్టివిటీ లాగ్'ను క్లిక్ చేయడం ద్వారా మీరు ట్యాగ్ అయి ఉన్న ఫొటోలను, పోస్టుల్ని స్క్రోల్ చేస్తూ వెళ్లొచ్చు. వాటిలోంచి మీరు డిలీట్ చేయాలనుకున్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

2. ఓకే గూగుల్, నా గురించి నీకు ఎంత మేరకు తెలుసు?

ప్రతిరోజూ మీరు కనీసం ఒక్క గూగుల్ ప్రొడక్టునైనా తప్పక ఉపయోగిస్తారు కదూ.

కాబట్టి, మీ గురించి మరెవ్వరికన్నా ఎక్కువగా ఈ కంపెనీకే తెలుసన్న మాట.

మీ అకౌంట్‌లోకి సైన్ ఇన్ అవ్వండి. మీ లోగోపై క్లిక్ చేసి ‘ప్రైవసీ చెకప్ పేజ్’ లోకి వెళ్లడం ద్వారా మీరు మీ డేటాను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.

మీరు 'పర్సనలైజ్ యువర్ గూగుల్ ఎక్స్‌పీరియన్స్'కు వెళ్లినప్పుడే మీ డేటాపై కంట్రోల్ మీ చేతుల్లోకి వస్తుంది. ఇక్కడ మీరు టాగుల్స్‌ను ఎడమ వైపు జరపడం ద్వారా భవిష్యత్తులో మీ సమాచారాన్ని ఉపయోగించకుండా పరిమితిని విధించవచ్చు.

మీరు యాప్స్‌కు ఇచ్చే యాక్సెస్‌ను కూడా నియంత్రించే వీలుంది.

గూగుల్ నిల్వ చేసిన మీ మొత్తం సమాచారాన్ని చూడాలనుకుంటే, ఈ లింక్ క్లిక్ చేయండి: google.com/takeout

3. లొకేషన్ డేటా గురించి మాట్లాడుకుందామా?

మీకు స్మార్ట్‌ఫోన్‌ ఉందా? అయితే మీరెవరు, ఎక్కడ నివసిస్తారు, ఎక్కడెక్కడికి వెళ్తుంటారు వంటి ముఖ్యమైన వివరాలన్నీ మీ అంతట మీరే థర్డ్-పార్టీ యాప్స్‌కు అందజేస్తున్నట్టు లెక్క.

మీ లొకేషన్ హిస్టరీని చూడాలనుకుంటే ఇలా చేయండి:

 • ఆండ్రాయిడ్: గూగుల్ మ్యాప్స్ > మెనూ > యువర్ టైమ్‌లైన్ పై క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఒక్కో ఐటెమ్‌ను సెలక్ట్ చేయండి.
 • ఐఫోన్: సెట్టింగ్స్ > ప్రైవసీ > లొకేషన్ సర్వీసెస్ లోకి వెళ్లి స్క్రోల్ డౌన్ చేయండి. సిస్టమ్ సర్వీసెస్ > స్క్రోల్ డౌన్ ను సెలక్ట్ చేసుకొని ఫ్రీక్వెంట్ /సిగ్నిఫికెంట్ లొకేషన్స్ సెలక్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఒక్కో ఐటెమ్‌ను సెలక్ట్ చేయండి.

మీ మొబైల్‌/డెస్క్‌టాప్ బ్రౌజర్‌ ద్వారా ఈ పేజీకి వెళ్లండి: https://www.google.com/maps/timeline?pb

ఈ యాప్‌లు, ఇతర థర్డ్-పార్టీ యాప్‌లు మిమ్మల్ని ట్రాక్ చేయకుండా అడ్డుకట్ట వేయాలంటే:

 • ఆండ్రాయిడ్: సెట్టింగ్స్ > యాప్స్ > యాప్ > పర్మిషన్స్ > లొకేషన్.
 • ఐఫోన్: సెట్టింగ్స్ > ప్రైవసీ > లొకేషన్ సర్వీసెస్ > ఒక్కో యాప్ ప్రాతిపదికన లొకేషన్ యాక్సెస్‌ను మేనేజ్ చేయండి.

4. ప్రైవేట్ బ్రౌజర్ ట్రై చేసి చూడండి

మీరు ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో బ్రౌజింగ్ చేశాక, మీరు విజిట్ చేసే ప్రతి పేజీలోనూ అవే ఐటెమ్స్ కనిపిస్తున్నాయా?

ఇవి ఈ ట్రాకర్లు. థర్డ్ పార్టీ కంపెనీలకు చెందినవి.

ఇవి స్క్రీన్ వెనకాల ఉండి - మీరు ఏమేం శోధించారు, ఏయే వెబ్‌సైట్లు విజిట్ చేశారు, మీ ఐపీ అడ్రస్ ఏమిటి అన్న విస్తృతమైన డేటాను సేకరిస్తాయి.

దురదృష్టవశాత్తూ, ఏ బ్రౌజర్ సెట్టింగ్స్ కూడా డిఫాల్ట్‌గా ప్రైవేట్ కాదు. అందువల్ల చాలా బ్రౌజర్లు కుకీలను, మీ బ్రౌజింగ్ హిస్టరీని, ఇతర సమాచారాన్ని స్టోర్ చేసుకుంటాయి. ఈ సమాచారమంతా షేర్ అవుతుంది.

కానీ గూగుల్, ఫైర్‌ఫాక్స్, సఫారి అన్నీ కూడా ప్రైవేట్ లేదా 'ఇన్‌కాగ్నిటో' బ్రౌజింగ్ మోడ్‌ను అందిస్తున్నాయి. దీని ద్వారా బ్రౌజింగ్ చేస్తే మీ బ్రౌజింగ్ హిస్టరీ, కుకీలు, టెంపరరీ ఫైల్స్ అన్నీ కూడా మీరు బ్రౌజర్‌ను క్లోజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి.

ఈ క్రింది వాటిని చేసి చూడడానికి ప్రయత్నించండి:

 • బ్రౌజర్‌ను ఓపెన్ చేసి (ఫైర్‌ఫాక్స్, క్రోమ్, క్రోమియమ్ లేదా సఫారి) మెనూ > న్యూ ప్రైవేట్/ఇన్‌కాగ్నిటో విండోను సెలెక్ట్ చేసుకోండి (బ్రౌజర్‌ను బట్టి)

ఫైర్‌ఫాక్స్ లేదా సఫారిలో శాశ్వతంగా ప్రైవేట్ బ్రౌజింగ్‌ను సెట్ చేయడానికి:

 • ఫైర్‌ఫాక్స్‌ను ఓపెన్ చేసి మెనూ> ప్రిఫరెన్సెస్> ప్రైవసీ> హిస్టరీ: ఫైర్‌ఫాక్స్ విల్: యూజ్ కస్టమ్ సెట్టింగ్స్ ఫర్ హిస్టరీ > 'చెక్ ఆల్వేస్ యూజ్ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్'ను సెలెక్ట్ చేసుకోండి.
 • సఫారి: టాప్ బార్‌లో ప్రిఫరెన్సెస్ > జనరల్ > సఫారీ ఓపెన్స్ విత్ : 'ఎ న్యూ ప్రైవేట్ విండో'ను సెలెక్ట్ చేసుకోండి.

5. అసలు అన్ని యాప్స్ మీకు అవసరమా?

మీ ఫోన్‌లో ఎన్ని యాప్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఒక సంఖ్యను ఊహించుకుని, మీ ఫోన్ తీసుకుని, దానిలోని యాప్స్ సంఖ్యను లెక్కించండి.

మీరు అనుకున్నదానికన్నా ఎక్కువగా ఉన్నాయా? వేటిని తొలగించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవడం కష్టమే అయినా, మిమ్మల్ని మీరు ఈ క్రింది ప్రశ్నలు వేసుకోవడం బాగుంటుంది:

 • మీకు నిజంగా ఆ యాప్ అవసరమా?
 • మీరు చివరిసారిగా ఆ యాప్‌ను ఎప్పుడు ఉపయోగించారు?
 • అది ఎలాంటి డేటాను సేకరిస్తుంది?
 • ఆ యాప్ వెనుక ఎవరున్నారు?
 • మీరు వారిని విశ్వసిస్తారా?
 • వారి ప్రైవసీ పాలసీ ఏమిటో మీకు తెలుసా?
 • ఆ డేటా సేకరణకు ప్రతిఫలంగా మీకు కలిగే లాభమేంటి?

ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటే వేటిని తొలగించాలన్న దానిపై ఒక నిర్ణయానికి రావచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)