కామన్వెల్త్ గేమ్స్: ‘ఆ సిరెంజ్‌లతో భారత టీమ్‌కు సంబంధం లేదు’

  • రెహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
కామన్వెల్త్ గేమ్స్, మస్కాట్

ఫొటో సోర్స్, SAEED KHAN

నేను ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల భారత టీమ్ 'షెఫ్ డె మిషన్' విక్రమ్ సిసోడియాను కలిసి వస్తుండగా, క్రీడా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు భారతీయ టీమ్ ఉన్న ఫ్లాట్ వెలుపల కొన్ని సిరెంజ్‌లు దొరికాయన్న వార్త తెలిసింది.

ఈ సమాచారం తెలీగానే కామన్వెల్త్ ఫెడరేషన్ చీఫ్ డేవిడ్ గ్రేవెమ్‌బెర్గ్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. నేను తిరిగి శనివారం రాత్రి విక్రమ్ సిసోడియాను కలవడానికి ప్రయత్నించాను కానీ, అది కుదరలేదు.

అయితే మరో భారత ప్రతినిధి అజయ్ నారంగ్ ఈ సంఘటనను ఖండిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. ఈ విషయం మొదట తన దృష్టికే రాగా, ఆ సిరెంజ్‌లను కామన్వెల్త్ అధికారులకు అందజేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వాటితో భారత టీమ్‌కు ఎలాంటి సంబంధమూ లేదన్నారు.

డ్రగ్స్ విషయంలో క్రీడా గ్రామంలో చాలా కఠినమైన నిబంధనలు అనుసరిస్తారు. కేవలం డయాబెటిస్ లాంటి వ్యాధులు కలిగిన ఆటగాళ్లు, అధికారులు మాత్రమే, అదీ అధికారుల అనుమతితో వాటిని క్రీడా గ్రామంలోకి తీసుకెళ్లవచ్చు.

సిరంజ్‌ల ఎపిసోడ్‌లో అవి మొదట తమ కంటపడ్డాయని పారిశుద్ధ్య సిబ్బంది చెబుతుండగా, నారంగ్ మాత్రం వాటిని తామే మొదట చూశామని చెబుతున్నారు. విచారణ తర్వాత మాత్రమే వాస్తవం బయటకు వస్తుంది. అయితే ఈ సంఘటనతో భారత శిబిరంలో కొంత ఆందోళన నెలకొంది.

ఫొటో క్యాప్షన్,

భారత టీమ్ 'షెఫ్ డె మిషన్' విక్రమ్ సిసోడియా

బ్రిస్బేన్‌లో తొమ్మిది మంది భారత జర్నలిస్టుల నిర్బంధం

క్రీడలు ప్రారంభం కావడానికి ముందే భారతదేశానికి ఇబ్బంది కలిగించే మరో విషయం కూడా జరిగింది. నకిలీ పత్రాలతో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో శనివారం తొమ్మిది మంది భారతీయ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు.

కేవలం రాకేశ్ కుమార్ శర్మ అనే జర్నలిస్టు వద్ద మాత్రమే చెల్లుబాటయ్యే పరిచయ పత్రం ఉండగా, దాని ఆధారంగా మిగతా ఎనిమిది మంది బ్రిస్బేన్‌కు వచ్చారు.

పోలీసులు శర్మను ప్రశ్నించగా, ఆయన తనకు ఇంగ్లీష్ రాదన్నారు. దీంతో పోలీసులు ఒక అనువాదకుని ద్వారా ఆయన నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు.

శర్మ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 6న విచారణ జరగనుంది. నకిలీ పేపర్లతో ఆస్ట్రేలియాలో ప్రవేశించడానికి ప్రయత్నించిన నేరారోపణ రుజువైతే ఆయనకు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, YE AUNG THU

వరుణగండం

ఏప్రిల్ 4న జరిగే ప్రారంభోత్సవానికి వర్షం కారణంగా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని తేలడంతో ప్రేక్షకుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బుధవారం ఐరిస్ తుపాను కారణంగా 10 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

కామన్వెల్త్ గేమ్స్ స్టేడియంలలో ఒక విచిత్రమైన నిబంధన ఉంది. మీరు స్టేడియంలోకి గొడుగులను తీసుకెళ్లవచ్చు కానీ వాటిని తెరవడానికి మాత్రం వీల్లేదు.

ఒకవేళ వర్షం కురిస్తే మాత్రం గోల్డ్ కోస్ట్ అక్వాటిక్ సెంటర్, కరారా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు వర్షం తగ్గేవరకు తడుస్తూ కూర్చోవాల్సిందే.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భార్యాపిల్లలతో కలిసి సిడ్నీకి తిరిగి వచ్చిన డేవిడ్ వార్నర్

స్టీవ్ స్మిత్, వార్నర్‌ల మధ్య కోల్డ్ వార్?

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాదిపాటు క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. సాధారణంగా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే ఆటగాళ్లు ఒకే విమానంలో వస్తారు. కానీ స్టీవ్ స్మిత్ సింగపూర్‌లో దిగి, అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వస్తే, వార్నర్ దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చారు.

డేవిడ్ వార్నర్‌కు వైస్ క్యాప్టెన్ పదవి ఇవ్వకుంటే టీమ్‌లో చిచ్చు పెడతాడనే అతనికి ఆ పదవిని కట్టబెట్టినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)