దక్షిణ పసిఫిక్ మహా సముద్రం మీదుగా దూసుకొచ్చిన అంతరిక్ష కేంద్రం

వీడియో క్యాప్షన్,

వీడియో: రాడార్‌కి చిక్కిన 'టియాంగాంగ్-1' దృశ్యాలు

అంతరిక్షంలో తన పని పూర్తిచేసుకున్న చైనా స్పేస్ ల్యాబ్ 'టియాంగాంగ్-1' భూ వాతావరణంలోకి ప్రవేశించిందని దీన్ని గమనాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.45 గంటలపుడు భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఆ వెంటనే దాదాపు పూర్తిగా కాలిపోయిందని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.

కొన్ని ముక్కలు దక్షిణ పసిఫిక్ మహా సముద్రం వైపు దూసుకొచ్చాయని చైనా అంతరిక్ష సంస్థ వివరించింది. అమెరికా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

అంతకు ముందు ఈ స్పేస్ ల్యాబ్ శకలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో పడే అవకాశముందని చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించింది.

24 గంటల్లో టియాంగాంగ్-1 భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని చైనా అంతరిక్ష సంస్థ ఆదివారం చెప్పింది. ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎస్‌ఏ) అంచనా కూడా ఇదే విధంగా ఉంది.

టియాంగాంగ్-1ను చైనా 2011లో కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ స్పేస్ ల్యాబ్‌కు అప్పగించిన పని 2016 మార్చిలో పూర్తయ్యింది. మిషన్ పూర్తయ్యాక ఇది తిరిగి భూమి మీదకు రావాల్సి వచ్చింది.

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5:55 గంటలకు టియాంగాంగ్-1 భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఈఎస్‌ఏ ఇంతకుముందు అంచనా వేసింది.

టియాంగాంగ్-1 బరువు 8.5 టన్నులు. భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఇది ముక్కలైపోతుంది. అయితే ఇంధన ట్యాంకు, రాకెట్ ఇంజిన్లు లాంటి దళసరి భాగాలు పూర్తిగా కాలిపోకుండా కొంత మేర మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ శకలాలు భూమి ఉపరితలాన్ని తాకే అవకాశముంది.

ఫొటో సోర్స్, CHINA MANNED SPACE AGENCY

ఫొటో క్యాప్షన్,

స్పేస్ ల్యాబ్ ఊహాచిత్రం

'సినిమాల్లో చూపించినట్లు ఉండదు'

టియాంగాంగ్-1 గమనంపై 'చైనా మ్యాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్' సోషల్ మీడియాలో స్పందిస్తూ.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లు ఈ స్పేస్‌ ల్యాబ్ భూమి మీద పడే తీరు భయానకంగా ఉండదని, ఇది ఉల్కాపాతంలా ఉంటుందని చెప్పింది.

టియాంగాంగ్-1తో సంబంధాలు తెగిపోయాయని, దీని గమనాన్ని ఇక నియంత్రించలేమని చైనా 2016లో ప్రకటించింది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారమైతే ఈ అంతరిక్ష కేంద్రం శకలాలు నిర్దిష్టంగా ఎక్కడ పడతాయో చెప్పలేం.

న్యూజిలాండ్ నుంచి మధ్య-పశ్చిమ అమెరికా వరకు ఎక్కడైనా టియాంగాంగ్-1 శకలాలు పడొచ్చు అని ఐరోపా అంతరిక్ష సంస్థ అంచనా వేసింది.

టియాంగాంగ్-1 క్రమంగా భూమికి దగ్గరగా వస్తోంది. భూవాతావరణంలోకి ప్రవేశించాక దీని వేగం అంతకంతకూ పెరిగిపోతుందని 'ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ స్పేస్ ఇంజినీరింగ్ రీసర్చ్' డిప్యూటీ డైరెక్టర్ ఇలియాస్ అబౌటనియోస్ బీబీసీతో చెప్పారు. టియాంగాంగ్-1 గరిష్ఠంగా గంటకు 26 వేల కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని అంచనా.

భూమికి వంద కిలోమీటర్ల చేరువలోకి వచ్చిన తర్వాత టియాంగాంగ్-1 వేడెక్కిపోవడం మొదలవుతుందని, ఫలితంగా అత్యధిక భాగం మండిపోతుందని ఆయన తెలిపారు. ఏ భాగం పూర్తిగా మండిపోకుండా, శకలంగా భూమిని చేరుతుందో చెప్పడం కష్టమని, ఎందుకంటే టియాంగాంగ్-1 తయారీ విధానాన్ని చైనా వెల్లడించలేదని పేర్కొన్నారు.

ఇంధన ట్యాంకు, రాకెట్ ఇంజిన్లు లాంటి భారీ విడిభాగాల్లో 20 నుంచి 40 శాతం వరకు భాగం తిరిగి భూమి మీదకు చేరేందుకు అవకాశం ఉంటుందని ఐరోపా అంతరిక్ష సంస్థలోని అంతరిక్ష శకలాల విభాగ కార్యాలయం అధిపతి హోల్గర్ క్రాగ్ ఇటీవల మీడియాతో చెప్పారు. ఈ శకలాలు తాకి మనుషులు గాయపడే అవకాశాలు అతి తక్కువని తెలిపారు. ఒకే సంవత్సరంలో రెండుసార్లు పిడుగుపాటుకు గురికావడం ఎంత అరుదైనదో ఈ శకలాలు తాకి మనుషులు గాయపడటం అంతే అరుదైనదని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images

శకలాలను ఎక్కడ పడేస్తుంటారు?

అంతరిక్షం నుంచి శకలాలు భూ వాతావరణంలోకి రావడం ఎప్పుడూ జరిగేదేనని, అయితే ఈ శకలాల్లో చాలా వరకు కాలిపోతుంటాయని, లేదా సముద్రంలో పడిపోతుంటాయని 'ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ స్పేస్ ఇంజినీరింగ్ రీసర్చ్' డిప్యూటీ డైరెక్టర్ ఇలియాస్ అబౌటనియోస్ తెలిపారు.

సాధారణంగా అంతరిక్ష సంస్థలకు, అవి ప్రయోగించిన ఉపగ్రహాలు, వ్యోమనౌకలకు మధ్య సంబంధాలు కొనసాగుతుంటాయి. అందువల్ల పని పూర్తయిన తర్వాత వాటి గమనాన్ని నియంత్రిస్తూ, వాటిని అనుకొన్న చోట పడేలా చేయొచ్చు.

ఇలాంటి శకలాలు, వ్యర్థాలను శాస్త్రవేత్తలు భూభాగానికి అత్యంత దూరంగా, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికా ప్రాంతాల మధ్యలో ఉండే జలాల్లో పడేలా చేస్తుంటారు. సుమారు 1,500 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటివరకు దాదాపు 260 వ్యోమనౌకలు, ఉపగ్రహాల శకలాలు పడ్డాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)