అంతరిక్షంలో వ్యర్థాలను ఎలా తొలగించొచ్చు?

  • జోనాథన్ ఆమోస్
  • బీబీసీ సైన్స్ ప్రతినిధి
అంతరిక్ష చెత్త, రిమూవ్‌డెబ్రిస్

చైనా స్పేస్ ల్యాబ్ 'టియాంగాంగ్-1' దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయిన నేపథ్యంలో, అసలు అంతరిక్ష వ్యర్థాలను ఎలా తొలగిస్తారనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.

సరిగ్గా ఇదే సమస్యపై.. బ్రిటన్ నేతృత్వంలోని బృందం ప్రయోగాలు చేపట్టనుంది.

ఈ ప్రయోగాలను నిర్వహించే 100 కేజీల డిమాన్‌స్ట్రేటర్‌ను అమెరికాలోని కేప్ కెనెవరాల్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు.

దీనిని 'రిమూవ్‌‌డెబ్రిస్' ప్రాజెక్టుగా పిలుస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

ప్రస్తుతం సుమారు 7,500 టన్నులకు పైగా ఉపగ్రహ వ్యర్థాలు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాయని అంచనా.

ఈ వ్యర్థాలలో పాత రాకెట్ విడి భాగాలు, స్క్రూలు, పెయింట్ పూతలు మొదలైనవి ఉన్నాయి. అంతరిక్షంలో ప్రయోగాలు నిర్వహించే సమయంలో ఇవి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. గతంలో అలాంటి సంఘటనలు జరిగాయి కూడా.

ఈ 'రిమూవ్‌‌డెబ్రిస్' బృందం అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌(ఐఎస్‌ఎస్)కు వెళ్లి, మే నెలలో ప్రయోగాలు ప్రారంభిస్తుంది.

ఈ డిమాన్‌స్ట్రేటర్‌ కొన్ని వారాల పాటు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. మే నెలలో ఐఎస్‌ఎస్ రొబోటిక్ హస్తం దీనిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన అనంతరం ప్రయోగాలు ప్రారంభిస్తారు.

అంతరిక్షంలోని వ్యర్థాలను గుర్తించడానికి 'రిమూవ్‌ డెబ్రిస్' బృందం లేజర్ రేంజింగ్, కెమెరా టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

ఆ తర్వాత ఒక వలలాంటి పరికరంతో వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే చేపలను పట్టే కొక్కెంలాంటి పరికరాన్ని కూడా ప్రయోగించి చూస్తారు.

ఫొటో సోర్స్, AFP

అయితే కొన్నికొన్ని సందర్భాలలో రొబోటిక్ ఆర్మ్‌తో పోలిస్తే ఇలాంటి పరికరాల వల్లే రిస్క్ ఎక్కువ అని పరిశోధనలో భాగస్వామి అయిన ప్రొఫెసర్ గుగ్లియెల్మో అగ్లియెట్టి బీబీసీకి తెలిపారు.

యూనివర్సిటీ ఆఫ్ సర్రీ స్పేస్ సెంటర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ 'రిమూవ్‌డెబ్రిస్' ప్రాజెక్టులో యూరప్‌లోని వివిధ దేశాలకు చెందిన నిపుణులు పని చేస్తున్నారు.

ఈ 'రిమూవ్‌డెబ్రిస్' ప్రాజెక్టు ఖర్చు మొత్తం సుమారు రూ.118 కోట్లు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)