పాకిస్తాన్: ఇలాంటి అసిస్టెంట్ కమిషనర్‌ను వాళ్లు తొలిసారి చూశారు!
- షుమైలా జాఫ్రీ
- బీబీసీ ప్రతినిధి

ఎన్నో ఏళ్లుగా హజారా తెగకు చెందిన వేలాది పౌరులు బలూచిస్తాన్‌లో హత్యకు గురవుతున్నారు. అలాంటి తెగ నుంచి వచ్చిన ఓ మహిళ.. పోలీసు ఉన్నతాధికారిగా మారి అందరి చూపూ తన వైపు తిప్పుకున్నారు.
బతూల్ అసదీ.. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు తొలి మహిళా అసిస్టెంట్ కమిషనర్. ఓ పక్క నగర శాంతి భద్రతలను కాపాడుతూనే తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆమెది.
ఆమెను కలవడానికి ఉదయాన్నే నేను బయల్దేరుతున్న సమయానికి క్వెట్టాలోని మా హోటల్ లాబీలో ఉన్న టీవీలో బ్రేకింగ్ న్యూస్ కనిపించింది.
నగరంలోని నలుగురు పోలీసు అధికారులపైన దాడి జరిగినట్లు వార్త వస్తోంది. అక్కడ అలాంటి దాడులు మామూలే. గత పదేళ్ల కాలంలో బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో చాలా హింస చోటు చేసుకుంది. అలాంటి ప్రాంతానికి అసదీ తొలి ఫీల్డ్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఎంపికయ్యారు.
మేం ఆమెను కలిసినప్పుడు ముఖానికి తెల్లటి స్కార్ఫ్ కట్టుకొని ప్రశాంతంగా కనిపించారు. అసదీ క్వెట్టాలోని షియా హజారా తెగకు చెందినవారు. భారత్-పాక్ విభజనకు ముందే ఆమె పూర్వీకులు అఫ్ఘానిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌కు వలస వచ్చారు.
వీడియో: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ నుంచి ఓ మహిళ తొలిసారిగా పోలీసు ఉన్నతాధికారి అయ్యారు
గత పదేళ్లుగా హజారా తెగకు చెందిన వారిపై క్వెట్టాలో దాడులు పెరిగిపోయాయి. వాళ్లను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడుల్లో వేలాదిమంది చనిపోయారు. స్థానిక పౌరులతో పోలిస్తే మధ్య ఆసియాకు చెందిన హజారా వాసుల రూపం భిన్నంగా ఉంటుంది. దాంతో వాళ్లను సులువుగా గుర్తించి దాడులు చేస్తున్నారు.
ఓ పక్క తమ తెగ వాళ్లు దాడులకు గురవుతుంటే, మరోపక్క అదే తెగకు చెందిన అసదీ అసిస్టెంట్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టారు.
‘పాకిస్తాన్‌లో కెరీర్‌లో ఎదగాలనుకునే మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభించడం కాస్త కష్టం. కానీ ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. సివిల్ సర్వీసు పరీక్షలు రాయడానికి ముందు నేను ఓ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేసేదాన్ని.
పెళ్లయ్యాక నా భర్తే సీఎస్‌ఎస్ పరీక్షల గురించి చెప్పి నన్ను రాయమని ప్రోత్సహించారు. ఆయన సూచనలతోనే పరీక్షల్లో అర్హత సాధించి సివిల్ సర్వీసులకు ఎంపికయ్యా.
ఆఫీసులో కూర్చొని పనిచేయడంతో పోలిస్తే ఫీల్డ్ వర్క్ చాలా భిన్నంగా ఉంటుంది. దానికితోడు ఫీల్డులో మగవాళ్ల మాదిరిగా ఆడవాళ్లు పనిచేయలేరనే అపోహ కూడా ఉంది. దాన్ని దూరం చేయాలంటే నేను మరింత కష్టపడాలి' అంటారు అసదీ.
క్వెట్టాలోని ఓ మార్కెట్ ప్రాంతం
అసిస్టెంట్ కమిషనర్‌గా మార్కెట్ ధరలు-కబ్జాల నియంత్రణ, భవన నిర్మాణ అనుమతులు-తనిఖీలతో పాటు నగరంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది.
నేను అసదీతో కలిసి ఆమె కార్యాలయానికి కూడా వెళ్లాను. అక్కడ అప్పటికే ఓ డజనుమంది మగవాళ్లు ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లందరి అర్జీలు పరిశీలించాక మళ్లీ ఆమె నాతో మాట్లాడారు.
‘ఈ ఉద్యోగంలో చాలా సవాళ్లుంటాయి. ప్రతిరోజూ కొత్త బాధ్యతలు మీదపడుతుంటాయి. వాటన్నింటినీ మనం ఎలా ఎదుర్కొంటున్నామన్నది ముఖ్యం.
ఉదాహరణకు చాలామంది మహిళలు రైళ్లలో ప్రత్యేక కంపార్టుమెంట్లు కావాలని కోరుకుంటారు. అందరూ అలానే అనుకుంటే జనరల్ కంపార్ట్‌మెంట్‌లో వాళ్లెప్పటికీ సురక్షితంగా ప్రయాణించే అవకాశం ఉండదు. అందుకే ముందు మహిళల ఆలోచనా విధానం కూడా మారాలి. అప్పుడే ఇతర మహిళల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
ఈ ఉద్యోగంలో భాగంగా చాలామంది మగవాళ్లను కలవాలని నాకు తెలుసు. దానికి సిద్ధపడే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇప్పటివరకూ బాగా ఇబ్బందిపెట్టిన పరిస్థితేదీ నాకు ఎదురుకాలేదు’ అంటూ తన ఉద్యోగపరమైన సవాళ్ల గురించి చెబుతారు అసదీ.
చాలాకాలంగా హజారా వర్గానికి చెందిన వారిపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దానికితోడు అసదీ ఉన్నత స్థానంలో ఉన్నారు. దాంతో ఆమెను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
‘బలూచిస్తాన్‌లో ఉన్న సానుకూల అంశమేంటంటే.. ఇక్కడ మహిళలను చాలా గౌరవిస్తారు. దాంతో మహిళను కావడం ఓ రకంగా నాకు బలంగా మారింది. ఎవరూ నాతో ఎక్కువగా వాదించాలని చూడరు’ అంటారామె.
మేజాన్ చౌక్ మార్కెట్ తనిఖీ కోసం అసదీ వెళ్తుంటే, ఆమెతో పాటు నేను కూడా వెళ్లాను. చుట్టూ పదుల సంఖ్యలో మగవాళ్లు ఉన్నా కూడా ఆమె నేర్పుగా తన పని తాను చేసుకుపోయారు. బలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో ఇలా ఓ మహిళ ముందుకెళ్లడం అక్కడివారికి ఓ కొత్త పరిణామం.
నిజానికి అసదీకి పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో పనిచేసే అవకాశం ఉంది. కానీ తన వాళ్లకు సేవ చేసే ఉద్దేశంతోనే కాస్త ప్రతికూల వాతావరణమున్నా, బలూచిస్తాన్‌ను ఎంపిక చేసుకున్నట్లు ఆమె చెబుతారు.
‘ఈ ఉద్యోగంలోకి రావడానికి వెనక మన ఉద్దేశం ఏంటనే దాని ప్రభావమే మన పనిలో కనిపిస్తుంది. నేనైతే ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడికి వచ్చా. ఆ ప్రభావమే నా పనితీరులోనూ కనిపిస్తుంది’ అంటారు అసదీ.
ఇవి కూడా చదవండి:
- #UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- పశ్చిమ బెంగాల్ మతఘర్షణలకు ఆ పాటలే కారణమా?
- మీ లంచ్‌ని తోటి ఉద్యోగి దొంగిలిస్తే.. అదో వైరల్!
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)