దక్షిణాఫ్రికా: వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమకారిణి విన్నీ మండేలా మృతి

ఫొటో సోర్స్, AFP
1996లో ఆమె తన భర్త నెల్సన్ మండేలా నుంచి విడిపోయారు.
దక్షిణాఫ్రికా వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమకారిణి విన్నీ మండేలా (81) మృతి చెందారు. ఆమె వ్యక్తిగత సహాయకుడు ఈ విషయం ధ్రువీకరించారు.
విన్నీ మడికిజెలా మండేలా దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా మాజీ భార్య.
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా 27 ఏళ్ల పాటు జైలు నిర్బంధానికి గురయ్యారు. వారిద్దరి జంట మూడు దశాబ్దాల పాటు ఆ ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది.
ఫొటో సోర్స్, AFP
1990లో నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలైన సందర్భంగా మండేలా దంపతులు
అయితే, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆమె పలు చట్టపరమైన, రాజకీయమైన వివాదాల్లో చిక్కుకున్నారు. నెల్సన్ మండేలా 2013లో మరణించారు.
విన్నీ కుటుంబం ప్రతినిధి విక్టర్ లామినీ ఆమె మృతిపై ఒక ప్రకటన చేశారు. "సుదీర్ఘ అనారోగ్యం తర్వాత విన్నీ మండేలా మృతి చెందారు. గత సంవత్సరం ప్రారంభం నుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆమె తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
విన్నీ మండేలా 1936లో తీర్పు కేప్‌లో జన్మించారు. ఆ రోజుల్లో దాన్ని ట్రాన్స్కీ అని వ్యవహరించేవారు.
1950లలో తొలిసారి తన భవిష్యత్ భర్తను కలిసేటప్పటికి ఆమె సామాజిక కార్యకర్తగా ఉన్నారు. వారి వివాహం 38 ఏళ్ల పాటు కొనసాగింది.
అయితే నెల్సన్ మండేలా జైలు నిర్బంధం కారణంగా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆమె తన భర్తకు దూరంగానే ఉండిపోయారు.
'తిరుగుబాటు ఆమె చిరునామా'
విన్నీ మండేలాను రిటైర్డ్ ఆర్చ్‌బిషబ్, నోబెల్ గ్రహీత డెస్మండ్ టుటూ "వర్ణవివక్ష వ్యతిరేక పోరాటానికి చిరునామా" అని అభివర్ణించారని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.
"ఆమె చూపిన తిరుగుబాటు తత్వం నాకూ, మరెందరో కార్యకర్తలకు ప్రేరణనిచ్చింది," అని ఆయన అన్నారు.
అధ్యక్షుడు సిరిల్ రమఫోసా మరి కొద్ది సేపట్లో విన్నీ నివాసానికి చేరుకుంటారని తెలిసింది. ఈ సంవత్సర ఆరంభంలో విన్నీ ఆయనను ప్రశంసించిన విషయం తెలిసిందే.
ఫొటో సోర్స్, Reuters
నెల్సన్ అడుగుజాడల్లో...
1962లో నెల్సన్ మండేలా జైలుకు వెళ్లిన తర్వాత, ఆయన ప్రారంభించిన వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని విన్నీ మండేలా ముందుండి నడిపించారు.
అలా ఆమె అంతర్జాతీయంగా వర్ణవివక్ష వ్యతిరేక పోరాటకారిణిగా గుర్తింపు పొందారు. స్వేచ్ఛను కాంక్షించే నిరుపేదలకు, నల్లజాతి ప్రజలకు ఆమె కేంద్రబిందువుగా మారారు.
ఐదేళ్ల తర్వాత అల్పసంఖ్యాక శ్వేత ప్రభుత్వం ఆమెను కూడా జైళ్లో పెట్టింది.
పోరాటానికి మారుపేరుగా నిల్చిన విన్నీ కొన్ని వివాదాలు కూడా మూటగట్టుకున్నారు.
అనుమానిత ఇన్‌ఫార్మర్ల మెడలకు కాలే టైర్లు తగిలించి హింసించిన ఘటనలకు ఆమె మద్దతు తెలిపినట్టుగా ఆరోపణలున్నాయి.
ఆమెపై కిడ్నాపింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. 14 ఏళ్ల మిలిటెంట్ హత్యలో భాగమయ్యారన్న కేసులో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.
అయితే ఆమె ఆ ఆరోపణలను చివరిదాకా వ్యతిరేకించారు. ఆ తర్వాత శిక్షను జరిమానాకు తగ్గించారు.
విన్నీపై ఈ ఆరోపణలు వచ్చిన సమయలో నెల్సన్ మండేలా ఆమెకు అండగా నిలిచారు. చివరకు ఆయన 1990 ఫిబ్రవరిలో విడుదలయ్యారు.
అయితే, రెండేళ్ల తర్వాత వారి వివాహబంధం దెబ్బతింది. 1996లో వారు విడాకులు తీసుకున్నారు. అయితే ఆమె తన ఇంటిపేరును అలాగే కొనసాగించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)