‘అందరూ పడుకున్నాక ఇంటి యజమాని నా దగ్గరకు వచ్చేవాడు’: శరణార్థులపై బ్రిటన్‌లో లైంగిక దోపిడీ
- మేఘా మోహన్
- బీబీసీ స్టోరీస్

కొన్ని సందర్భాల్లో లైంగిక దాడుల నుంచి తప్పించుకోవడానికే స్వదేశాల నుంచి పారిపోయి బ్రిటన్‌కు వచ్చారు. కానీ చాలామంది శరణార్థులకు బ్రిటన్‌లో కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. తిరిగి స్వదేశానికి పంపేస్తారనే అనుమానంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు.
37 ఏళ్ల గ్రేస్ జీవితంలో అన్నీ బాధాకరమైన జ్ఞాపకాలే.
పశ్చిమ ఆఫ్రికాలో జన్మించిన గ్రేస్, 1998లో 17 ఏళ్ల వయసులో లండన్‌కు వచ్చారు. తన వల్ల తన బంధువులకు సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో తన దేశం ఏదో చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు.
పేదరికం కారణంగా 15 ఏళ్ల వయసు ఉన్నపుడే గ్రేస్‌ను, 17 ఏళ్ల ఆమె సోదరిని వాళ్ల తండ్రికన్నా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించారు.
గ్రేస్, ఆమె సోదరిని భర్త మానసికంగా, శారీరకంగా హింసించేవాడు.
రెండేళ్ల పాటు అతని హింసను భరించిన గ్రేస్, ఆమె సోదరి తమ బాధలను ఓ బంధువుకు చెప్పుకోవడంతో అతను వాళ్లు దేశం విడిచి పారిపోవడానికి సహకరిస్తానని మాట ఇచ్చాడు.
వాళ్లకు స్వల్పకాలిక వీసాలు ఏర్పాటు చేసి, లండన్‌కు టికెట్లు ఇప్పించాడు. లండన్‌లో తన స్నేహితుడు వచ్చి వాళ్లను పికప్ చేసుకుంటాడని, అతను చాలా మంచివాడని చెప్పాడు.
లండన్‌లో వాళ్లను రిసీవ్ చేసుకున్న వ్యక్తి చాలా వృద్ధుడు. తన ఆర్థిక పరిస్థితేం బాగా లేకున్నా, స్నేహితుని మాట కాదనలేక వాళ్లకు ఆశ్రయం ఇచ్చాడు.
స్థానిక చర్చిలో పశ్చిమ ఆఫ్రికా నుంచి వలస వచ్చిన మిగతావాళ్లకు గ్రేస్, ఆమె సోదరిని అతడు పరిచయం చేశాడు. లండన్‌కు వచ్చిన మూడు వారాల తర్వాత తమకు ఆశ్రయం ఇచ్చిన వృద్ధుడు మరణించడంతో వారిద్దరూ దిక్కులేని వారయ్యారు.
ఆశ్రయం కోసం, ఏదో ఒక పని చేసి బతకడానికి గ్రేస్, ఆమె సోదరి విడిపోవాల్సి వచ్చింది.
గ్రేస్‌కు ఆశ్రయం ఇచ్చిన వారి ఇంటిలో ఆమెకంటూ ప్రత్యేక గది ఉండేది కాదు. ఆమె లివింగ్ రూంలోని సోఫాలోనే పడుకోవాల్సి వచ్చేది. అదెంత ప్రమాదకరమో చాలా త్వరగానే తెలిసి వచ్చింది.
''అందరూ పడుకున్నాక ఆ ఇంటి యజమాని నా వద్దకు వచ్చేవాడు. నేను ఎక్కడికీ పోలేనని అతనికి అర్థమైంది. అందుకే తన లైంగిక అవసరాల కోసం అతను నన్ను ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. నాకు చట్టం గురించి ఏమీ తెలీదు. నన్ను ఈ దేశం నుంచి పంపేస్తారనే భయంతో నేను పోలీసుల వద్దకు వెళ్లలేకపోయాను.'' అని గ్రేస్ తెలిపారు.
మరో చోట గ్రేస్ సోదరి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.
పిల్లలు పెరిగి పెద్ద కావడంతో, గ్రేస్ అవసరం లేదని ఆమెకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబం ఆమెను వెళ్లగొట్టింది. దాంతో ఆమె స్నేహితుల మీద ఆధారపడుతూ, చర్చి వద్ద తనకు ఆశ్రయం ఇచ్చే వాళ్ల కోసం అన్వేషించేవారు. పార్కుల్లోని బెంచీల మీద, నైట్ బస్సుల్లోనూ నిద్రపోయేవారు.
బ్రిటన్‌లో ఉన్న దాదాపు 20 ఏళ్లలో ఆమె సుమారు డజను ఇళ్లు మారారు. దాదాపు అందరూ ఆమెను లైంగిక అవసరాలకు ఉపయోగించుకున్నారు. ఇంటికి వచ్చే బంధువులు కూడా రాత్రిళ్లు వచ్చి ఆమెను తాకేవారు. వాళ్లు తన గదిలోకి రాకుండా ఉండేందుకు ఆమె కనిపించినదానినల్లా తలుపులకు అడ్డంగా పెట్టాల్సి వచ్చేది.
2008లో ఒక విషాద ఘటన జరిగింది. ఓ రోజు గ్రేస్ సోదరి తనకు ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ వ్యక్తిని కలవడానికి వెళుతున్నట్లు చెప్పింది. కానీ అలా వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దాంతో గ్రేస్ పిచ్చిదానిలా మారిపోయారు. పదేళ్ల నుంచి గ్రేస్ సోదరి ఆచూకీ లేదు.
సోదరి మాయమైపోయాక గ్రేస్ అనేక ఇళ్లలో ఆశ్రయం పొందుతూ కాలాన్ని నెట్టుకొచ్చారు. చివరికి ఐదేళ్ల క్రితం ఆమెకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబం ఆమె సేవలు తమకు అసవరం లేదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కడా పని దొరకలేదు.
''కొన్ని వారాల పాటు నేను పార్కుల్లోని బెంచీల మీద పడుకునేదాన్ని. పడుకోవడానికి భయమేస్తే, రాత్రంతా బస్సుల్లో తిరుగుతూ ఉండేదాన్ని. పగటి పూట అడుక్కుంటూ లైబ్రరీలోనో, పార్కుల్లోనో గడిపేదాన్ని'' అని గ్రేస్ తెలిపారు.
చివరికి ఒకరోజు ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది.
''నేను పార్కులో ఉండగా ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు. నేను బ్రిటన్‌కు వచ్చిన కొత్తలో అతణ్ని కలిసాను. నాలాంటి వాళ్లకు సాయం చేసేందుకు కొంతమంది ఉన్నారని అతను చెప్పాడు. 'నేను బానిసను. నాకెవరు సాయం చేస్తారు?' అన్నాను.''
అతను గ్రేస్‌ను సెంట్రల్ లండన్‌లోని ఓ శరణార్థి కేంద్రానికి తీసుకెళ్లాడు. అది బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలనుకుంటున్న మహిళలకు సాయం చేసే 'వుమెన్ ఫర్ రెఫ్యూజీ వుమెన్' అనే సంస్థ. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన సుమారు 35 మంది మహిళలు అక్కడ ఉన్నారు. అక్కడ ఇంగ్లిష్, కళలు, మహిళా సాధికారతపై శిక్షణ ఇస్తారు. మార్చు గిర్మా ఆ సంస్థకు డైరెక్టర్.
11 ఏళ్ల వయసులో ఇథియోపియా నుంచి వచ్చిన గిర్మా బ్రిటన్‌లో శరణార్థిగా ఆశ్రయం పొందడానికి ఎంతో కష్టపడ్డారు.
అక్కడే గిర్మా వారికి హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లైంగిక అకృత్యాల గురించి అనేక మంది నటీమణులు ఈ ప్రపంచానికి వెల్లడి చేయడం గురించి, వారంతా కలిసి #MeToo అన్న హాష్ ట్యాగ్‌ను ఉపయోగించడం గురించి వివరించారు.
దాంతో వారందరికీ లైంగిక వేధింపుల విషయంలో తాము ఒంటరివాళ్లం కాదనే భావన కలిగింది. తమలాంటి అనుభవాలే శ్వేత జాతీయుల, అత్యంత శక్తిమంతమైన, ప్రముఖ మహిళల జీవితాల్లో కూడా ఉన్నాయని వాళ్లు గుర్తించారు. లైంగిక వేధింపులు అనేవి తాము పారిపోయి వచ్చిన దేశాలకే పరిమితం కాదని, అభివృద్ధి చెందాయని భావిస్తున్న సమాజాల్లో కూడా అవి ఉన్నాయని గుర్తించారు.
అక్కడ ఇతరుల అనుభవాలు కూడా గ్రేస్‌కు భిన్నంగా ఏమీ లేవు. వారిలో ఒక మహిళ తాను పని చేసే ఇంటి యజమాని తన అండర్‌వేర్ తొలగించాలని కోరినట్లు తెలిపింది.
ఇక గ్రేస్ స్నేహితురాలు యానెల్‌ది మరో కథ.
పదేళ్లు గడిచిపోయినా యానెల్‌కు ఇప్పటికీ తన గత అనుభవాలు కలలో వస్తుంటాయి.
యానెల్ పశ్చిమ ఆఫ్రికాలో రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేవారు. దాంతో ఆమెను అరెస్ట్ చేసి, జైలులో వేశారు. అక్కడ కొంత మంది పోలీసు అధికారులు ఆమెను తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె కొందరు స్నేహితుల సాయంతో లండన్‌కు వచ్చారు. ఆమె కూడా గ్రేస్‌లాగే స్నేహితుల సహాయంతో పిల్లల సంరక్షణ, ఇంటిపని చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
గ్రేస్‌తో పాటు 'వుమెన్ ఫర్ రెఫ్యూజీ వుమెన్' నిర్వహించిన సాధికారత సమావేశానికి హాజరైన యానెల్ తనకు జరిగిన అన్యాయాల గురించి బయటకు చెప్పడానికి ధైర్యంగా ముందుకు వచ్చారు. తన అనుమతి లేకుండా తన ఒంటిపై చేయి వేయడాన్ని తేలిగ్గా వదిలిపెట్టకూడదని ఆమె నిర్ణయించుకున్నారు.
''మా దేశపు సంస్కృతి ప్రకారం లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చర్చించకూడదు. కానీ ఎంతో మంది ప్రముఖులు కూడా తమపై జరిగిన వేధింపులను ఈ ప్రపంచానికి వెల్లడిస్తున్నపుడు, అది మా ఆలోచనా తీరును కూడా మార్చేసింది'' అని యానెల్ తెలిపారు.
'వుమెన్ ఫర్ రెఫ్యూజీ వుమన్' డైరెక్టర్ మార్చు గిర్మా
బ్రిటన్ శరణార్థి విధానంపై గిర్మా మాట్లాడుతూ- ''అది చాలా లోపభూయిష్టమైనది. దాని వల్ల మహిళలు అనేక స్థాయుల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారు'' అని తెలిపారు.
దేశంలో ఉండేందుకు చట్టబద్ధత లేకపోతే మనుషుల్లాగానే పరిగణించరని ఆమె అన్నారు.
''ఎవరైనా తమపై జరుగుతున్న లైంగిక వేధింపులను గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే వాళ్లను డిటెన్షన్ సెంటర్లలో నిర్బంధించడమో, తిరిగి వాళ్ల దేశాలకు తిప్పి పంపడమో చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది తమపై జరుగుతున్న దారుణాలను బయటకు చెప్పడానికే భయపడుతున్నారు. వీళ్లపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారికి ఈ విషయం తెలుసు'' అని గిర్మా అన్నారు.
యూకేలో చట్టబద్ధంగా కొనసాగుతున్న శరణార్థులకు కూడా తమ హక్కుల గురించి సరైన అవగాహన లేక పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని ఆమె వెల్లడించారు.
ప్రస్తుతం గ్రేస్ తన చదువును కొనసాగించాలనుకుంటున్నారు. తనలాంటి ఇతరులకు సాయపడాలనుకుంటున్నారు. మిడ్‌వైఫ్ కోర్సును పూర్తి చేయాలనేది ఆమె ఆశయం. ప్రస్తుతం ఆమె 80 ఏళ్లు పైబడిన ఓ వృద్ధ జంట ఇంటిలో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికీ ఆమెకు చట్టబద్ధంగా బ్రిటన్‌లో నివసించడానికి అర్హత లేదు.
అయితే ఎప్పుడో ఒకప్పుడు తన సోదరి కనిపిస్తుందని ఆమె విశ్వాసం. ఇప్పటివరకు ఆమె మూడుసార్లు శరణార్థి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుని విఫలమయ్యారు. ఆమె గత 20 ఏళ్ల నుంచి బ్రిటన్‌లో ఉంటున్నా దానికి సాక్ష్యాలు లేవు. అయితే ఎప్పుడో ఒకప్పుడు తనకు శరణార్థిగా గుర్తింపు లభిస్తుందని ఆమె నమ్మకం.
గ్రేస్‌తోపాటు యానెల్ కూడా శరణార్థి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికీ తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి తనకు కలలు వస్తూనే ఉంటాయని ఆమె తెలిపారు.
(ఈ కథనంలోని వ్యక్తుల పేర్లుమార్చాం.)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)