#CWG2018: భారత్-పాక్ హాకీ మ్యాచ్ హౌస్‌ఫుల్!

  • రెహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి, గోల్డ్‌కోస్ట్ నుంచి
భారత్-పాక్ హాకీ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

హాకీలో ఒకప్పటిలా భారత్-పాకిస్తాన్‌లు స్టార్‌లు కావు. కానీ ఆ రెండు దేశాల మధ్య పోటీకి ఉండే క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది.

గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత్-పాక్ హాకీ జట్లు ఏప్రిల్ 7న తలపడనున్నాయి. క్రీడాభిమానులు ఆ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

నిజానికి కామన్వెల్త్ గేమ్స్‌లో మిగతా ఈవెంట్ల టికెట్లు పూర్తిగా అమ్ముడవలేదు. కానీ భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం ఇప్పటికే మొత్తం అమ్ముడైపోయాయి.

ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయుల్లో ఎక్కువమంది పంజాబీలే ఉన్నారు. వాళ్లంతా హాకీని బాగా ఇష్టపడతారు. దాంతో వాళ్లలో చాలామంది ఆ మ్యాచ్‌కు టికెట్లు దొరక్క నిరుత్సాహపడ్డారు.

భారత్-పాక్ మ్యాచ్ గురించి భారత హాకీ జట్టు కోచ్ మరైన్ మాట్లాడుతూ, ‘నేను జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో పాక్‌తో పోటీని అన్ని మ్యాచ్‌లలా చూడాలనే ఆటగాళ్లని అడిగా. వాళ్లు కూడా సరేనన్నారు. కానీ మ్యాచ్ రోజున వాళ్లవన్నీ మరచిపోయి నేను చెప్పినట్టు కాకుండా చాలా భిన్నమైన ఆట ఆడారు’ అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గోల్డ్‌కోస్ట్‌లో 20శాతం హోటళ్లు ఇంకా బుక్ అవ్వలేదు

ఒకప్పటి భారత హాకీ జట్టు కోచ్, ప్రస్తుత పాకిస్తాన్ జట్టు కోచ్ అయిన రోలంట్ ఆల్ట్‌మ్యాన్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘రెండు జట్లు తలపడినప్పుడు టెక్నిక్ కంటే ఫలితంపైనే ఎక్కువ దృష్టిపెడతాయి’ అన్నారు.

ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 6వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 13వ స్థానంలో ఉంది.

టూర్ ఆపరేటర్లు డీలా

ఈస్టర్ సీజన్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్ కూడా ఉండటంతో పర్యటకుల తాకిడి ఎక్కువుంటుందనీ, తమకు లాభాల పంట పండుతుందనీ గోల్డ్ కోస్ట్ టూర్ ఆపరేటర్లు భావించారు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.

అక్కడ దాదాపు 20 శాతం హోటళ్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. గోల్డ్ కోస్ట్‌కు వచ్చే ఫ్లైట్లలో కూడా పెద్దగా జనాలు ఉండట్లేదు. చాలామంది గోల్డ్ కోస్ట్‌తో పోలిస్తే ధరలు తక్కువగా ఉండటంతో బ్రిస్బేన్‌లో హోటళ్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఈస్టర్ రోజుల్లో రెస్టారెంట్లు కిటకిటలాడేవనీ, కానీ ఈసారి అలాంటి సందడేమీ లేదని వాటి యజమానులు అంటున్నారు. గోల్డ్ కోస్ట్‌కు పర్యాటకులు సేదతీరడానికి వస్తారని, కానీ కామన్‌వెల్త్ గేమ్స్ కారణంగా ఉండే రద్దీకి భయపడి వాళ్లు రావట్లేదని స్థానికులు తెలిపారు.

స్థానిక ప్రజలు కూడా ఈ క్రీడల వల్ల అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.

మరోపక్క కామన్వెల్త్ గేమ్స్‌కు మొత్తమ్మీద ఇప్పటిదాకా 20వేల టికెట్లు కూడా బుక్ కాలేదు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తే.. ‘ఇక్కడన్ని పనులూ చివరి నిమిషంలోనే చేస్తారు’ అని ఓ స్థానికుడు సరదాగా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)