అవినీతి కేసులో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి 12 ఏళ్లు జైలు శిక్ష

లులా

అవినీతి కేసులో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా 12 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందే అని ఆ దేశ సుప్రీంకోర్టు వెల్లడించింది.

లులా చేసిన అప్పీల్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు తీసుకుని నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారంటూ లులాపై ఆరోపణలు వచ్చాయి.

ఓఎఎస్ అనే సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టి అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి దాదాపు రూ. 7.2 కోట్ల విలువ చేసే అపార్టుమెంటును తీసుకున్నారన్న అభియోగాలు వచ్చాయి.

దాంతో ఆ ఆరోపణలపై 2014లో ప్రాసిక్యూటర్లు విచారణ ప్రారంభించారు.

ఈ కేసులో లూలాకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2017 జూలైలో న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ఆ తీర్పుపై అప్పీల్ చేసుకునే వరకు ఆయన జైలు బయటే ఉండొచ్చని కోర్టు చెప్పింది.

అయితే, 2018 జనవరిలో ఆయన అప్పీల్‌కు వెళ్లగా విచారించిన న్యాయస్థానం శిక్షను 9 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు పెంచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఫొటో క్యాప్షన్,

కోర్టు తీర్పుతో సంబరాలు చేసుకుంటున్న లులా వ్యతిరేకులు

దాంతో తాజాగా లులా మరోసారి అప్పీల్ చేయగా దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

అయితే, తనపై వచ్చిన ఆ అవినీతి ఆరోపణలన్నీ రాజకీయ దురుద్ధేశంతో చేసినవేనని లులా అన్నారు.

తాను మళ్లీ దేశానికి అధ్యక్షుడిని కాకుండా చేయాలన్న కుట్రతో ఇలా ఇరికించారని ఆరోపించారు.

72 ఏళ్ల లులా 2003 నుంచి 2011 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు.

లులాకు వెంటనే జైలు శిక్ష అమలు చేయాలంటూ సావో పాలో నగరంలో 20,000 మంది నిరసన చేపట్టారు. మరోవైపు, లులాకు మద్దతుదారులు కూడా భారీ ర్యాలీ తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)