వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?

  • 16 ఏప్రిల్ 2018
వ్యాయామం చేస్తోన్న మహిళ Image copyright iStock

దాదాపు 150 మంది డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, ఫిజికల్ ట్రెయినర్లు సరైన సమాధానం చెప్పలేని ప్రశ్నకు మీరైనా సమాధానం చెప్పగలరా?

ప్రశ్న చాలా చిన్నదే! అదేంటంటే..

మీరు బాగా వ్యాయామం చేసి ఒంట్లోని కొవ్వునంతా కరిగించుకున్నారు. బరువు కూడా తగ్గారు. అయితే.. ఆ కరిగిన కొవ్వు ఎటుపోయిందో చెప్పగలరా?

మీ ఆప్షన్లు ఇవీ..

a) కరిగిన కొవ్వు శక్తిగా మారింది.

b) కండరాలు పెరగడానికి తోడ్పడింది.

c) కార్బన్ డయాక్సైడ్, నీరుగా రూపాంతరం చెందింది.

సరైన సమాధానం 'ఎ' లేదా 'బి' అనుకుంటున్నారా..?

కాదు..!

సరైన సమాధానం 'సి'.

మరేం.. ఫర్లేదు నిరుత్సాహపడకండి. ఇలానే పప్పులో కాలేసిన 147 మంది నిపుణుల్లాగే మీరు కూడా ఊహించారంతే!

ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన శాస్త్రవేత్త రూబెన్ మీర్మన్ ఈ అంశంపై ఓ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయనంలో.. కరిగిన కొవ్వు 'శక్తిగా మారుతుంది' అని చాలా మంది సమాధానం చెప్పారు. కానీ.. ద్రవ్య-శక్తి నిత్యత్వ నియమం (లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మేటర్)కు ఇది విరుద్ధం.

ఇక రెండో సమాధానం విషయానికి వస్తే.. కొవ్వు అనే పదార్థం కండరాలుగా మారడం అసాధ్యమని మీర్మన్ తేల్చి చెప్పారు.

కరిగిన కొవ్వు కార్బన్‌ డయాక్సైడ్, నీరుగా రూపాంతరం చెందుతుంది. 2014లో రూబెన్ చేసిన ఓ అధ్యయనం వివరాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. అందులో.. కొవ్వును విసర్జించడంలో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయని రూబెన్ పేర్కొన్నారు.

మానవ శరీరంలోని కొవ్వు.. మూత్రం, చమట, ఊపిరి ఇతరత్రా రూపాల్లో బయటకు వెళుతుందన్నారు.

''మీరు 10 కిలోల బరువు తగ్గారనుకోండి.. అందులో 8.4 కిలోలు ఊపిరితిత్తుల ద్వారా, తక్కిన 1.6 కిలోలు ద్రవ రూపంలో బయటకు వెళుతుంది. ఇంకోలా చెప్పాలంటే.. మనం కరిగించే కొవ్వును ఊపిరి ద్వారానే బయటకు పంపుతున్నాం!'' అని 'ది కన్వర్జేషన్ వెబ్‌సైట్'లో రూబెన్ పేర్కొన్నారు.

Image copyright iStock

మరి.. డాక్టర్లు ఎలా పొరబడ్డారు?

ఆస్ట్రేలియాలోని 150 మంది నిపుణులపై అధ్యయనం చేశారు. అందులో ముగ్గురు మాత్రమే సరైన సమాధానం చెప్పారు. అయితే.. అమెరికా, ఇంగ్లండ్, ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా చాలా మంది ఇలాంటి అపోహనే కలిగి ఉన్నారని 'బీబీసీ వరల్డ్'తో రూబెన్ చెప్పారు.

నిశ్వాసలో కొవ్వును విసర్జించడం

మనం తీసుకునే ఆహారంతోపాటుగా, మనం పీల్చే ఆక్సిజన్ స్థాయిలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రూబెన్ అధ్యయనం చెబుతోంది.

''ఉదాహరణకు మీరు తీసుకునే ఆహారం, నీటి పరిమాణం 3.5 కిలోలు, 500 గ్రాముల ఆక్సిజన్ తీసుకుంటే.. మీ శరీరంలోకి వెళ్లిన ఆ 4 కిలోల మొత్తం ఎట్టి పరిస్థితుల్లో బయటకి వెళ్లాల్సిందే. లేకపోతే మీరు లావయిపోతారు'' అని రూబెన్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

కార్బన్‌‌ డయాక్సైడ్ పేరుకుపోయిన కొవ్వు కణజాలాలు తెరుచుకోవడమనేది.. సన్నబడటంలో ప్రధాన ప్రక్రియ.

శ్వాస ప్రక్రియలో భాగంగా మనం ఎక్కువ కార్బన్‌ను ఉత్పత్తి చేస్తాం. అలా ఎక్కువగా ఊపిరి పీలిస్తే.. కార్బన్‌ రూపంలోని కొవ్వును ఎక్కువగా కోల్పోతామా?

‘కాదు’ అని రూబెన్ సమాధానం ఇస్తున్నారు.

''అవసరానికి మించి ఊపిరి పీలిస్తే సన్నబడరు. కళ్లు తిరుగుతాయి, మూర్ఛపోతారు. కండరాల కదలికల ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ను ఖర్చుచేయడమొక్కటే సన్నబడటానికి మార్గం.''

వ్యాయామంతోపాటుగా కార్బన్‌‌డయాక్సైడ్‌ను ఖర్చు చేయగలిగిన మరో మార్గాన్ని కూడా రూబెన్ సూచిస్తున్నారు.

''ఉదాహరణకు 75 కిలోలున్న ఓ వ్యక్తి.. తన విరామ సమయంలో 590 గ్రాముల కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాడు. ఈ విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్ శాతాన్ని ఏ మందులూ పెంచలేవు'' అని రూబెన్ చెబుతున్నారు.

నిద్రపోయినపుడు ఓ వ్యక్తి 200 గ్రాముల కార్బన్‌ డయాక్సైడ్‌ను శ్వాస ప్రక్రియ ద్వారా విడుదల చేస్తారు. అదే వ్యక్తి వాకింగ్‌కు వెళ్లినపుడు, వంట చేస్తున్నపుడు, ఇంటిపని చేస్తున్నపుడు నిద్రలోకంటే మూడు రెట్లు కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతుంది.

రూబెన్ ప్రకారం సన్నబడాలంటే..

''తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి, శారీరక శ్రమ ఎక్కువగా ఉండాలి. ఖర్చు చేస్తున్న శక్తి కంటే తక్కువ శక్తిని అందించే ఏ ఆహారమైనా లాభదాయకమే!'' అంటూ రూబెన్ ముగించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు