#CWG2018 భారత్‌కు రెండో స్వర్ణం తెచ్చి పెట్టిన సంజీతా చాను

ఫొటో సోర్స్, Reuters
ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ సంజీతా చాను బంగారు పతకం గెల్చుకున్నారు. ఇది భారత్‌కు లభించిన రెండో స్వర్ణం కాగా, ఇప్పటి వరకు భారత్‌కు మొత్తం 3 పతకాలు దక్కాయి.
53 కిలోల విభాగంలో సంజీతకు గోల్డ్ మెడల్ దక్కింది. భారత్‌కు ఇప్పటి వరకు లభించిన మూడు పతకాలూ వెయిట్ లిఫ్టింగ్‌లోనే కావడం ఓ విశేషం.
24 ఏళ్ల సంజీతా చాను వరుసగా మూడు ప్రయత్నాల్లో 81, 83, 84 కిలోల బరువునెత్తారు. 'క్లీన్ అండ్ జెర్క్'లో ఆమె 104, 108 కిలోల బరువునెత్తారు. మూడో సారి ఆమె 112 కిలోల బరువునెత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా కూడా ఆమె తన సమీప ప్రత్యర్థిని 10 కిలోల తేడాతో ఓడించి స్వర్ణం గెల్చుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
స్నాచ్ పోటీలో సంజీత తన సమీప ప్రత్యర్థి కన్నా మూడు కిలోలు ఎక్కువ బరువెత్తారు. 'స్నాచ్'లో బరువును భుజాలపై ఆపుకోకుండా నేరుగా పైకెత్తాల్సి ఉంటుంది. 'క్లీన్ అండ్ జెర్క్'లో బరువును తలకన్నా పైకి ఎత్తడానికి ముందు భుజంపైన కాసేపు నిలుపుకుంటారు.

ఫొటో సోర్స్, Reuters
2014 కామన్వెల్త్ క్రీడల్లో సంజీతా 48 కిలోల విభాగంలో గోల్డ్ గెల్చుకున్నారు. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లే.
అయితే, ఇప్పుడు ఆమె 53 కిలోల విభాగంలో పాల్గొన్నారు. గత సంవత్సరం జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఇదే విభాగంలో స్నాచ్, క్లీన్ అండ్ జర్క్‌లలో కలిసి మొత్తం 195 కిలోల (85 + 110 కిలోలు) బరువెత్తి స్వర్ణం సాధించారు.
గురువారం నాడు భారత్‌కు చెందిన మీరాబాయి చాను 48 కిలోల విభాగంలో స్వర్ణం, పి. గురురాజా 56 కిలోల విభాగంలో రజతం గెల్చుకున్న విషయం తెలిసిందే.
మీరాబాయి చాను, సంజీతా చాను ఇద్దరూ క్రీడల పవర్ హౌస్‌గా ఎదుగుతున్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన వారే. వీరిద్దరి మధ్య బాగా పోటీ ఉంటుంది. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో సంజీత స్వర్ణం సాధించగా, మీరాబాయికి రజతం లభించింది.

ఫొటో సోర్స్, PAUL GILHAM/GETTY IMAGES
మీరాబాయి చాను లాగానే సంజీతకు కూడా కుంజారాణి దేవి నుంచే ప్రేరణ పొందారు. వెయిట్ లిఫ్టింగ్‌లో కుంజారాణి బాగా పేరు సంపాదించారన్న విషయం తెలిసిందే.
భారతీయ రైల్వేశాఖలో ఉద్యోగిగా ఉన్న సంజీత స్వభావరీత్యా బిడియస్తురాలు. కానీ మైదానంలో దిగినప్పుడు మాత్రం ఆమె రూపం పూర్తిగా మారిపోతుంది.
మెడల్స్ సాధించే క్రమం ఆమె బాల్యం నుంచే మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
2017లో అర్జున్ అవార్డుల సూచీలో సంజీత పేరు చోటు చేసుకోకపోవడంతో ఆమె వార్తల్లో నిలిచారు.
ఆ తర్వాత ఈ విషయమై ఆమె కోర్టు తలుపు తట్టారు.
సంజీతకు అర్జున్ అవార్డు లభించలేదు కానీ ఆమె నిరుడు కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దానికి దీటైన జవాబిచ్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)