కామన్వెల్త్ గేమ్స్ చరిత్రేమిటి? ఎప్పుడు మొదలయ్యాయి?

  • 7 ఏప్రిల్ 2018
2010లో దిల్లీలో కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం Image copyright Graham Crouch/Getty Images
చిత్రం శీర్షిక భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2010 లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించారు

నాలుగేళ్లకోసారి కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి. ఈసారి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇవి జరుగుతున్నాయి.

ఏప్రిల్ 4వ తేదీన మొదలైన కామన్వెల్త్ గేమ్స్ 15వ తేదీన ముగుస్తాయి.

మొట్టమొదట ఈ క్రీడలను 1930లో కెనడాలోని హ్యామిల్టన్‌లో నిర్వహించారు. అప్పుడు మొత్తం 11 దేశాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

నాలుగేళ్ల కిందట 2014లో స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించారు. అప్పుడు 71 దేశాల నుంచి 4,500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా.. 17 రకాల ఆటల పోటీలు నిర్వహించారు.

భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2010 లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఆ క్రీడల్లో 71 దేశాల నుంచి 6,081 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

88 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న క్రీడల్లో 71 కామన్వెల్త్ దేశాల నుంచి 6,600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.

Image copyright Alan Webb/Fox Photos/Hulton Archive/Getty Images
చిత్రం శీర్షిక 1938లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు.. 1930 నుంచి 1950 వరకూ బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా వ్యవహరించే క్రీడల పేరును 1978 నుంచి కామన్వెల్త్ క్రీడలుగా మార్చారు

అసలు ఈ కామన్వెల్త్ క్రీడలు ఏమిటి?

నిజానికి ఈ క్రీడా పోటీలను మొదటి నుంచీ కామన్వెల్త్ గేమ్స్ అనేవారు కాదు.

  • 1930 - 1950: బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్
  • 1954 - 1966: బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్
  • 1970 - 1974: బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్
  • 1978 నుంచి: కామన్వెల్త్ గేమ్స్
Image copyright PA
చిత్రం శీర్షిక కామన్వెల్త్ దేశాల క్రీడాకారులు శాంతియుత, స్నేహపూర్వక క్రీడా పోటీల్లో పాల్గొనాలంటూ బ్రిటన్ రాణి సందేశంతో బ్యాటన్ కామన్వెల్త్ దేశాలన్నిటికీ ప్రయాణిస్తుంది

కామన్వెల్త్ అంటే ఏమిటి?

ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్‌కు వలసలుగా ఉన్న దేశాల సముదాయమే కామన్వెల్త్‌. అయితే.. పోర్చుగీసు వలస దేశంగా ఉండిన మొజాంబిక్ మాత్రం బ్రిటిష్ ఎంపైర్‌తో కానీ బ్రిటన్‌తో కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా 1995లో కామన్వెల్త్‌లో చేరింది.

ప్రపంచ ప్రజల్లో దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు కామన్వెల్త్ నివాసి. అన్ని మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాల వారూ ఇందులో భాగంగా ఉన్నారు.

ప్రపంచంలోని చాలా దేశాలు ఒకప్పుడు బ్రిటన్ పాలనలో వలస దేశాలుగా ఉండేవి. వాటన్నిటినీ కలిపి బ్రిటిష్ ఎంపైర్‌గా వ్యవహరించేవారు. కాలక్రమంలో ఆయా దేశాలన్నీ స్వతంత్ర దేశాలుగా మారటంతో ఆనాటి బ్రిటిష్ ఎంపైర్ అంతరించిపోయింది. ఆ దేశాలే ఇప్పుడు కామన్వెల్త్‌గా మారాయి.

కామన్వెల్త్‌లో సభ్యులుగా ఉన్న 53 దేశాలు.. ప్రజాస్వామ్యం, లింగ సమానత్వం, అంతర్జాతీయ శాంతిభద్రతలు వంటి కొన్ని విలువలను పాటిస్తామని ప్రమాణం చేశాయి.

Image copyright WPAPool/Getty Images

ఈ క్రీడల్లో బ్రిటన్ రాణి సందేశం ఏమిటి?

ఈ కామన్వెల్త్‌కు బ్రిటన్ రాణి అధినేత. అందుకే కామన్వెల్త్ క్రీడలను ఆమె అధికారికంగా ప్రారంభిస్తారు.

కామన్వెల్త్ స్పోర్ట్స్ మొదలైనప్పటి నుంచీ.. 1942, 1946 ల్లో మినహా ప్రతి నాలుగేళ్లకోసారీ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆ రెండు సార్లు క్రీడలను నిర్వహించలేదు.

ఈ క్రీడల ప్రారంభానికి ముందు.. క్వీన్స్ బ్యాటన్ (జ్యోతి) రిలే మొదలవుతుంది. కామన్వెల్త్ దేశాల క్రీడాకారులు శాంతియుత, స్నేహపూర్వక క్రీడా పోటీల్లో పాల్గొనాలంటూ బ్రిటన్ రాణి సందేశంతో ఆ బ్యాటన్ కామన్వెల్త్ దేశాలన్నిటికీ ప్రయాణిస్తుంది. ఆరంభ కార్యక్రమంలో బ్రిటన్ రాణి లేదా, ఆమె ప్రతినిధి ఆ సందేశాన్ని చదవటంతో క్రీడలు ప్రారంభమవుతాయి.

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల జ్యోతి 2017 మార్చి 13న లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలస్‌ నుంచి ప్రయాణం ప్రారంభించింది. మొత్తం 388 రోజులు ప్రయాణించి 2018 ఏప్రిల్ 4వ తేదీన ఆస్ట్రేలియాలో క్రీడల ప్రారంభ కార్యక్రమానికి చేరుకుంది. బ్రిటన్ రాణి ప్రతినిధిగా హాజరైన ప్రిన్స్ చార్లెస్.. జ్యోతితో పాటు ఉన్న సందేశాన్ని వినిపించి క్రీడలను ప్రారంభించారు.

కామన్వెల్త్ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన దేశం ఆస్ట్రేలియా. ఆ దేశం 2014 వరకూ మొత్తం 852 బంగారు పతకాలు గెలుచుకుంది. 155 బంగారు పతకాలతో భారతదేశం నాలుగో స్థానంలో నిలిచింది.

2018 కామన్వెల్త్ క్రీడల కోసం 15,000 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది వీక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి బదిలీ

వాతావరణ మార్పు: రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు గత దశాబ్దంలోనే..

సానియా మీర్జా: క్రీడల్లో సత్తా చాటిన మరో అమ్మ

పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే

వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు

కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?

చైనా కొత్త వైరస్: 'ఇప్పటికే వందలాది మందికి సోకింది... ఇతర దేశాలకు విస్తరిస్తోంది'