2జీ.. 3జీ.. 4జీ.. మరి 5జీ ఎప్పుడు?

5జీ

ఫొటో సోర్స్, Getty Images

2జీ.. 3జీ.. 4జీ.. త్వరలో 5జీ నెట్‌వర్క్ రాబోతోంది అంటూ వార్తలు చాలానే వచ్చాయి. కానీ, అది 2020లోగా పూర్తిస్థాయిలో సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే, బ్రిటన్‌ టెలికం నియంత్రణ సంస్థ ఆఫ్‌కాం వెల్లడించిన వివరాల ప్రకారం 2020లోగా పలుచోట్ల 5జీ (ఐదవ తరం) నెట్‌వర్క్ కోసం పరీక్షలు జరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

తాజాగా బ్రిటన్‌లో 5జీ నెట్‌వర్క్‌ కోసం బ్యాండ్‌విడ్త్ వేలం జరిగింది. దాదాపు రూ. 12,440 కోట్లకు(1.36 బిలియన్ బ్రిటిష్ పౌండ్లు) టెలికాం సంస్థలు వొడాఫోన్, ఈఈ, ఓ2, థ్రీ సంస్థలు ఈ బ్యాండ్‌విడ్త్‌ను కొనుగోలు చేశాయి.

మెరుగుపడనున్న వేగం

ప్రస్తుతం ఉన్న 4జీతో పోల్చితే 5జీతో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చే వీలుంటుందని ఆఫ్‌కాం వెల్లడించింది.

దాంతో అత్యంత వేగంగా అధిక మొత్తంలో డేటాను బదిలీ చేసే అవకాశం ఉంటుంది.

ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే.. డ్రైవర్ రహిత కార్లు, ఇతర వస్తువులకు అది బాగా ఉపయోగపడే వీలుంటుంది.

భారత్‌లో ఎప్పుడంటే..

5వ తరం నెట్‌వర్క్‌ను 2020 నాటికి భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు తగిన వ్యూహాన్ని రూపొందించడానికి 2017 సెప్టెంబర్‌లో కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) ఒక అత్యున్నత స్థాయి బృందాన్ని నియమించింది. ఈ ఏడాది జూన్ నాటికి 5జీ నెట్‌వర్క్‌ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతుందని గత నెలలో సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ చెప్పారని ఎకనామిక్‌టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)