ప్రపంచ ఆరోగ్య దినం: మీరు 1990 తర్వాత పుట్టారా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఏర్పాటై నేటికి సరిగ్గా 70 ఏళ్లు. దీన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు.
అయితే ఈ ఆరోగ్య దినోత్సవానికి ఏటా ఒక ‘థీమ్’ ఉంటుంది.
ఈ ఏడాది యూనివర్సల్ హెల్త్ కవరేజ్.. అనే థీమ్‌తో ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన 9 ఆసక్తికర విషయాలు..
ఫొటో సోర్స్, Getty Images
1. మీరు 1990 తర్వాత పుట్టారా..
అయితే మీకు అంతకు ముందు పుట్టిన వారికన్నా సగటున ఆరేళ్ల ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది.
ఇక 2012లో పుట్టిన చిన్నారైతే సగటున 70 ఏళ్ల వరకు బతుకుతారు.
అధికాదాయం ఉన్న దేశాల్లో అయితే వీరి ఆయు:ప్రమాణం 79 ఏళ్లు.
ఫొటో సోర్స్, Andrew Burton
2. తల్లిపాలు.. సాధారణ టీకాతో ఏటా 66 లక్షల చిన్నారులకు జీవితం
ఏటా ప్రపంచ వ్యాప్తంగా 66 లక్షల మంది చిన్నారులు అయిదేళ్లలోపు చనిపోతున్నారు.
సకాలంలో తల్లిపాలు.. తక్కువ ధరకు లభించే టీకాలు ఇస్తే వీరందరినీ కాపాడవచ్చు.
శుభ్రమైన తాగు నీరు, పరిశుభ్ర వాతావరణ లేమి కూడా పిల్లల చావుకొస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
3. ప్రతి పది మందిలో ఒకరు నెల తక్కువ బిడ్డే
ఏటా 1.5 కోట్ల మంది చిన్నారులు నెలలు నిండకుండానే జన్మిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే ప్రతి పది జననాల్లో ఒకటి నెలలు నిండక ముందే జరుగుతోంది.
దీని వల్ల ఏటా 10 లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారు.
తగిన రక్షణ వైద్య సదుపాయం ఉంటే 7.5 లక్షల మందికిపైగా చిన్నారులను కాపాడొచ్చు.
(37 వారాలకన్నా ముందే పుడితే వారిని నెలలు నిండకుండా పుట్టిన శిశువుగా పరిగణిస్తారు.)
ఫొటో సోర్స్, Who
4. చావుకు కారణం హృద్రోగాలే
ప్రతి పది మరణాల్లో 3 హృద్రోగాల వల్లే జరుగుతున్నాయి.
గుండె పోటు, స్ర్టోక్ వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు.
పొగ మానేయడం, తగిన ఆరోగ్యకర ఆహారం, శారీరక శ్రమ ఉంటే 80 శాతం ముందస్తు మరణాలను ఆపవచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
5. హెచ్ఐవీ మరణాలు ఆఫ్రికాలోనే..
2012లో 70 శాతం మేర హెచ్ఐవీ మరణాలు ఆఫ్రికాలోనే నమోదయ్యాయి.
అంతకు ముందు ఏడేళ్లతో పోల్చితే ఈ బాధితుల సంఖ్య బాగా తగ్గింది. 2005లో ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ వల్ల 23 లక్షల మంది చనిపోతే.. 2012లో ఇది 16 లక్షలకు తగ్గింది.
ఇప్పటికీ తక్కువాదాయం ఉన్న దేశాల్లో చాలా మందికి తమకు హెచ్ఐవీ ఉన్నట్లు తెలియదు.
ఫొటో సోర్స్, Who
6. రోజూ 800 మంది తల్లుల మృతి
కాన్పుకు ముందు.. తర్వాత తగిన సంరక్షణ, వైద్య సదుపాయాలు లేక ప్రపంచంలో రోజుకు 800 మంది మహిళలు చనిపోతున్నారు.
ఈ రేటు పేద దేశాల్లో మరింత అధికంగా ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
7. రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 3500 మంది మృతి
ప్రపంచంలో ఎక్కువ మంది మరణానికి రోడ్డు ప్రమాదాలు కూడా కారణమవుతున్నాయి.
రోజుకు 3500 మంది చనిపోతుండగా మరికొన్ని వేల మంది గాయపడుతున్నారు.
వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ఈ ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
8. పొగాకుకు 60 లక్షల మంది బలి
ప్రపంచంలో నేరుగా పొగాకును నమలడం, పొగ తాగడం వల్ల 50 లక్షల మంది రోగాల బారినపడి చనిపోతున్నారు.
పరోక్ష ధూమపానం కారణంగా మరెంతో మంది రోగాలపాలవుతున్నారు.
ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోకుంటే 2030కి ఏటా పొగాకు వల్ల చనిపోయేవారి సంఖ్య 30 లక్షలకు చేరుతుంది.
ఫొటో సోర్స్, Who
9. ప్రతి పది మందిలో ఒకరికి మధుమేహం
ప్రపంచంలో పది శాతం మంది మధుమేహం బాధితులున్నారు. మధుమేహం వల్ల హృద్రోగాలు, స్ట్రోక్ వచ్చి చనిపోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2012లో మధుమేహం వల్ల 15 లక్షల మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)