వీర్యకణాలు ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలో...!

  • ఫిలిప్పా రాక్స్‌బీ
  • హెల్త్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
వీర్య కణాలు

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్,

కొన్ని కోట్ల వీర్య కణాలు ప్రయాణం ప్రారంభిస్తాయి, కానీ అతి కొద్ది కణాలు మాత్రమే విజయవంతం అవుతాయి.

గర్భం దాల్చే ప్రక్రియలో (ఫలదీకరణ కోసం) వీర్యకణాలు స్త్రీ అండాన్ని చేరుకునే ప్రయాణం ఎలా సాగుతుంది? మధ్యలో ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయి? ఈ విషయంలో పరిశోధకులు కొన్ని కొత్త విషయాలను కనుగొన్నారు.

అయస్కాంతం చుట్టూ ఏర్పడే క్షేత్రం మాదిరిగానే వీర్యకణాల తల, తోకల కదలికలు ఉంటాయని బ్రిటన్, జపాన్ పరిశోధకులు వెల్లడించారు.

ఆ కదలికలు వీర్యకణాలు ఫలదీకరణ కోసం స్త్రీ ఫాలోపియన్ నాళం దిశగా వెళ్లేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.

సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషుడి నుంచి విడుదలయ్యే వీర్యంలో 5 కోట్ల నుంచి 15 కోట్ల వీర్యకణాలు ఉంటాయి.

అవన్నీ స్త్రీ ఫాలోపియన్ నాళం వైపు ప్రయాణం ప్రారంభిస్తాయి. కానీ, అందులో కేవలం ఓ పది కణాలు చివరి దాకా వెళ్లగలుగుతాయి.

ఆఖరికి అండంతో ఫలదీకరణ చెందేది మాత్రం ఒక్క కణమే.

ఫొటో సోర్స్, KENTA ISHIMOTO, KYOTO UNIVERSITY

ఫొటో క్యాప్షన్,

తల, తోకను కదిలిస్తూ వీర్య కణాలు ముందుకు కదులుతాయి.

దారిలో ఎన్ని అడ్డంకులో..

అయితే ఈ ప్రయాణంలో అనేక అవాంతరాలు ఎదురవుతాయి. చాలా కణాలు యోనిలోని పరిస్థితులను తట్టుకోలేక చనిపోతాయి.

ఆ తర్వాత మధ్యలో దాడిచేసి చంపేందుకు తెల్లరక్త కణాలు కాచుకుని ఉంటాయి. వాటి నుంచి కూడా తప్పించుకోవాలి.

ఇన్ని అడ్డంకులను దాటుకుని ఫాలోపియన్ నాళాలను చేరుకోవాలి.

అప్పుడు ఫలదీకరణం జరుగుతుంది. అది కూడా ఆ సమయానికి స్త్రీ అండం విడుదలై సిద్ధంగా ఉంటేనే!

లేదంటే ఆ వీర్యకణం నిష్ఫలం అవుతుంది.

ఫొటో సోర్స్, Science Photo Library

ఇతర కణాలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయో తెలుసుకుంటే పురుషుల్లో సంతాన లోపాలకు చికిత్స అందించే వీలుంటుందని పరిశోధనా రచయిత డాక్టర్. హెర్మెస్ గడెల్హ తెలిపారు.

వీర్యకణాల తోకల కదలికలపై ఆయన బృందం పరిశోధనలు చేసింది. ఆ వివరాలను ‘ఫిజికల్ రివ్యూ లెటర్స్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.

"వీర్యకణాల గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. తాజా పరిశోధనలో గుర్తించిన విషయాలు సంతాన సమస్యల పరిష్కారానికి కొద్ది మేర సాయపడతాయి. ఇంకా వీర్యకణాల సంఖ్య, ఆ కణాల తలలో ఉండే డీఎన్‌ఏ వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది" అని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌కి చెందిన వీర్యకణాల నిపుణులు ప్రొఫెసర్. అలాన్ పాసే అన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)