జర్మనీ: పాదచారుల మీదుగా వ్యాన్‌ను నడిపించిన ఘటనలో ముగ్గురు మృతి

జర్మనీ

ఫొటో సోర్స్, PAUL FEGMANN

పశ్చిమ జర్మనీలోని మ్యూన్‌స్టర్ నగరంలో ఓ వ్యక్తి పాదచారుల మీదుగా వ్యాన్‌ను నడిపించగా ముగ్గురు మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు.

ఈ ఘటన తర్వాత వ్యాను డ్రైవర్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

పాత పట్టణంలోని కీపెన్‌కెర్ల్ విగ్రహం వద్ద ఈ ఘటన జరిగింది.

కీపెన్‌కెర్ల్ విగ్రహం సమీపంలోనే ఓ రెస్టారెంటు ఉంది.

"దుండగుడు వ్యానుతో పలు కేఫ్‌లను, రెస్టారెంట్లను ఢీకొట్టాడు" అని వార్తాసంస్థ ఏఎఫ్‌పీ న్యూస్‌కి పోలీసు శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, DANIEL KOLLENBERG

ఆ వ్యానులో అనుమానాస్పద వస్తువును గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఆ వస్తువు ఏమిటన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఎప్పుడూ పాదచారులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పలు రెస్టారెంట్లు ఉన్నాయి.

వ్యాను వేగంగా రెస్టారెంటు ముందు కుర్చీల్లో కూర్చున్న వారి మీదికి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీకి చెప్పారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పై ఫొటో చూస్తే ఆ రెస్టారెంట్‌ ఎదుట కుర్చీలు, టేబుళ్లు చెల్లాచెదురుగా పడిపోయినట్టు కనిపిస్తోంది.

2016 డిసెంబర్‌లోనూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.

రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్‌లోని జనాలపైకి లారీని నడిపించడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)