'రసాయన దాడి': భారీ మూల్యం చెల్లించక తప్పదని సిరియా, రష్యాలకు ట్రంప్ హెచ్చరిక

డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ట్రంప్

సిరియాలోని డ్యూమా నగరంలో జరిగిన అనుమానిత రసాయన దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడికి 'భారీ మూల్యం' చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ సిరియా అధ్యక్షుడు అల్-అసద్, అసద్ ప్రభుత్వ మద్దతుదేశాలైన రష్యా, ఇరాన్‌లను హెచ్చరించారు.

డ్యూమాలో శనివారం జరిగిన ఈ దాడిలో 70 మంది చనిపోయారని డమాస్కస్ రూరల్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్ధరించినట్లు అమెరికా కేంద్రంగా పనిచేసే 'ద యూనియన్ ఆఫ్ మెడికల్ రిలీఫ్ ఆర్గనైజేషన్స్' బీబీసీకి తెలిపింది. ఈ సంస్థ సిరియాలోని ఆస్పత్రులతో కలిసి పనిచేస్తోంది.

తూర్పూ ఘూటా ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఏకైక కంచుకోట డ్యూమా. ఇది దేశ రాజధాని డమాస్కస్ సమీపంలో ఉంది. డ్యూమాలో రసాయన దాడి జరగలేదని సిరియా, రష్యా చెప్పాయి.

రసాయన దాడి వార్తల నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ- వరుసగా ట్వీట్లు పెట్టారు. సిరియా అధ్యక్షుడు అసద్‌ను జంతువుగా సంభోదించారు. ఓ ట్వీట్‌లో ఆయన్ను 'Animal Assad' అని పేర్కొన్నారు.

తిరుగుబాటుదారుల గ్రూపు 'జైష్ అల్-ఇస్లాం'తో రష్యా గత వారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అసద్ ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.

జైష్ అల్-ఇస్లాం చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెడితే డ్యూమా నుంచి వెళ్లిపోయేందుకు జైష్ అల్-ఇస్లాం సభ్యులకు 48 గంటల గడువు ఇచ్చేలా ఆదివారం ఒక ఒప్పందం కుదిరిందని సిరియా ప్రభుత్వ మీడియా చెప్పింది. ఈ అంశంపై జైష్ అల్-ఇస్లాం నుంచి ఎలాంటి స్పందనా వెలువడలేదు.

డ్యూమా ఘటనకు సంబంధించి స్వచ్ఛంద సంస్థ 'వైట్‌ హెల్మెట్స్' ఒక వీడియో విడుదల చేసింది. ఒక ఇంట్లో చాలా మంది బాలలు, మగవాళ్లు, ఆడవాళ్ల మృతదేహాలు పడి ఉన్నట్లు అందులో ఉంది. వారిలో చాలా మంది నోళ్లలో నురగ కనిపిస్తోంది.

డ్యూమాలో అసలేం ఏం జరిగింది, మృతుల సంఖ్య ఎంత అనే వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

సిరియా, రష్యా అధ్యక్షులు బషర్ అల్-అసద్, వ్లాదిమిర్ పుతిన్

అమెరికా సైనిక చర్యకు దిగుతుందా?

తిరుగుబాటుదారుల అధీనంలోని ఖాన్‌షేఖౌన్ పట్టణంలో అసద్ ప్రభుత్వం రసాయనిక దాడికి పాల్పడిందంటూ, దీనికి ప్రతిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరుడు ఏప్రిల్‌లో ఒక వైమానిక స్థావరంపై క్షిపణి దాడి జరిపించారు.

ఖాన్‌షేఖౌన్ పట్టణంలో సారిన్ వాయువును ప్రయోగించడంతో 80 మందికి పైగా చనిపోయారు. ఈ రసాయనిక దాడికి సిరియా ప్రభుత్వమే కారణమని ఐక్యరాజ్యసమితి, రసాయన ఆయుధాల నిర్మూలన సంస్థ సంయుక్తంగా జరిపిన విచారణలో వెల్లడైంది.

ఇప్పుడు డ్యూమా దాడి నేపథ్యంలో సిరియాలో అమెరికా మళ్లీ దాడి జరిపే ఆస్కారముందా అని వైట్‌హౌస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సలహాదారు టిమ్ బాసర్ట్‌ను ఏబీసీ టీవీ అడగ్గా- ఏ పరిణామాన్నీ తోసిపుచ్చలేమని బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

సిరియాలోని హోమ్స్ నగరంలో చోటుచేసుకొన్న విధ్వంసం (2012 నవంబరు)

విచారణ జరపాలన్న బ్రిటన్

డ్యూమా ఘటనపై పోప్ ఫ్రాన్సిస్ స్పందిస్తూ- రసాయన ఆయుధాల వినియోగం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. డ్యూమా దాడిపై తక్షణం విచారణ జరపాలని బ్రిటన్ డిమాండ్ చేసింది. పౌరులపై రసాయన ఆయుధాలను ప్రయోగిస్తే సిరియాపై దాడి చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ చెప్పారు.

తూర్పు ఘూటాలో అసద్ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులను ఓడిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయని, ప్రభుత్వ బలగాలు ఇక ముందుకు సాగకుండా అడ్డుకొనేందుకే 'రసాయన దాడి' ఆరోపణలను చేస్తున్నారని సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)