అమెరికా - చైనా ట్రేడ్ వార్: అమెరికా కొత్త సుంకాలు చైనాను ఎంతగా దెబ్బ తీస్తాయి?

  • 9 ఏప్రిల్ 2018
డొనాల్డ్ ట్రంప్ Image copyright Getty Images

బేకరీ ఓవెన్లు, హైడెఫినిషన్ కలర్ టీవీలు, జ్యూస్ ప్రెస్లు, రాకెట్ లాంచర్లు, యురేనియంలు.. వీటన్నిటికీ సంబంధించిన సాధారణ విషయం ఏమిటో చెప్పగలరా?

అమెరికా 25 శాతం సుంకాలు విధించాలని యోచిస్తున్న 1,300 చైనా ఉత్పత్తుల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి.

జ్యూస్ ప్రెస్ మీద సుంకం పెంచటం చైనా మీద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

కానీ.. ఈ జాబితాలో ఉన్న చాలా వస్తువులు.. ఏరోస్పేస్, ఇంజనీరింగ్ పరిశ్రమలకు సంబంధించినవి. వచ్చే దశాబ్దంలో ఈ రంగాల్లో చైనా ప్రపంచంలో అగ్రస్థాయిని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించటం చైనాను దెబ్బతీయగలదు.

అమెరికా 2017లో దాదాపు 75 బిలియన్ (7,500 కోట్ల) డాలర్ల విలువైన చైనా యంత్రాలు, కంప్యూటర్లను కొనుగోలు చేసింది.

2018-19 సంవత్సరంలో ఇది 80 బిలియన్ (8,000 కోట్ల) డాలర్లకు చేరుతుందని అంచనా.

చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో ఈ వస్తువులదే సింహ భాగం. ఇవి అమెరికా కొత్త సుంకాల జాబితాలో ఉన్నాయి.

‘‘అమెరికా విధిస్తున్న కొత్త సుంకాలు మరో మెట్టు పెరిగాయి. చైనా ఎగుమతి చేస్తున్న చాలా వస్తువులను ఇది టార్గెట్ చేస్తోంది’’ అని రీసెర్చ్ సంస్థ కంప్లీట్ ఇంటెలిజెన్స్ ప్రతినిధి టోనీ నాష్ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

అమెరికా ఎందుకు భయపడుతోంది?

ఒకసారి చరిత్రలో 1980ల చివరికి వెళదాం. అది జియావోపింగ్ హయాం. చైనా అప్పుడప్పుడే ప్రపంచానికి ద్వారాలు తెరుస్తున్న కాలం.

పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకానమిక్స్ విశ్లేషణ ప్రకారం:

అప్పటి నుంచి అంటే 1980ల చివరి నుంచి చైనా ఏటా సగటున 10 శాతం జీడీపీ వృద్ధితో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది.

80 కోట్ల మంది జనం పేదరికం నుంచి గట్టెక్కారు.

ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల రేటు 2006 - 2015 మధ్య సగానికి తగ్గిపోయింది.

ఈ వృద్ధిలో చాలా భాగం.. 70లు, 80ల్లోని తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందటం వల్ల సాధ్యమైంది.

కానీ.. చైనాలో చౌకగా లభ్యమయ్యే కార్మిక శక్తిని ఉపయోగించుకోవాలనుకున్న అమెరికా సంస్థలు.. తమ దేశ కంపెనీలతో తప్పనిసరిగా కలిసి పనిచేసేలా చైనా బలవంతపు విధానాలు అమలుచేసిందని.. అమెరికా ఐడియాలను వారు కాపీ చేయటానికి, తస్కరించటానికి అది తోడ్పడిందని అమెరికా ఆరోపిస్తోంది.

‘‘చైనా తనకు కావలసింది సాధించుకోవటంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది’’ అంటారు మీడియోరోస్ లా సంస్థ ప్రతినిధి మార్టిన్ మీడియోరోస్.

‘‘1980ల నుంచి చైనా చాలా దూరం ప్రయాణించింది. కానీ మేధో సంపత్తి (ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ) హక్కుల గురించి అమెరికన్లు ఆలోచించిన విధంగా చైనీయులు ఆలోచించరు’’ అని ఆయన పేర్కొన్నారు.

Image copyright Getty Images

అమెరికా.. తనకు అన్యాయం జరిగిందని, తన సాంకేతికత ద్వారానే చైనాకు ప్రపంచ ఇన్నొవేషన్ పోటీలో మెరుగైన అవకాశాలు లభించాయని భావించటం.. ఈ యుద్ధానికి కేంద్ర బిందువు.

కానీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే.. చైనా ముందుకు దూసుకుపోతోంది. అందుకు ఆ దేశానికి అమెరికా అనుమతి అవసరం లేదు.

చైనా 2016లో ప్రచురించిన తన 13వ పంచవర్ష ప్రణాళికలో 2020 నాటికి ‘‘ఇన్నొవేషన్ నేషన్‌‌‌‌’’గాను, 2030 నాటికి ‘‘అంతర్జాతీయ ఇన్నొవేషన్ లీడర్‌‌’’గాను, 2050 నాటికి ‘‘సైంటిఫిక్, టెక్నలాజికల్ ఇన్నొవేషన్‌లో ప్రపంచ శక్తి’’గాను అవతరించాలన్న తన ఆకాంక్షను ప్రకటించింది.

పరిశోధన, అభివృద్ధి రంగాల్లో చైనా మరింత ఎక్కువ నిధులు వెచ్చిస్తోంది. వేలాది పేటెంట్లను నమోదు చేస్తోంది. ఇన్నొవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చైనా కంపెనీలు ప్రపంచంలో ముందు వరుసలో ఉన్నాయి. అవి అత్యాధునిక పరిశోధనల్లో తలమునకలయ్యాయి.

ఈ రంగాల్లో అమెరికా ప్రాబల్యాన్ని చైనా కంపెనీలు హస్తగతం చేసుకుంటాయన్నది అమెరికా ఆందోళన.

Image copyright Getty Images

మరైతే చైనా ఆందోళన చెందాల్సిన అవసరముందా?

సుంకాల విషయంలో అమెరికా ఏం చేస్తుందనే విషయాన్ని చైనా పట్టించుకోవాల్సిన అవసరముందని ఏసియన్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధి దెబోరా ఎల్మ్స్ అభిప్రాయపడుతున్నారు.

‘‘ఇవి అక్కడి జనంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. 25 శాతం సుంకాలను వాస్తవంగా వర్తింప చేస్తే.. వానికి ప్రతిచర్యలు అమలు చేస్తే కొన్ని కంపెనీలు దివాలా తీసే అవకాశముంది’’ అని ఆమె పేర్కొన్నారు.

చైనాలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి సాయం అందించేందుకు సామాజిక భద్రత వ్యవస్థ లేదు.

ప్రజల బాగోగులను ప్రభుత్వమే చూసుకుంటుందని భావించే రాజకీయ వ్యవస్థ ఉన్న ఇటువంటి దేశంలో.. ఉద్యోగాలు కోల్పోవటం కమ్యూనిస్టు పార్టీకి మంచిది కాదు.

Image copyright LUC OLINGA/AFP/Getty Images

అమెరికా సుంకాలతో చైనా మారుతుందా?

తక్షణమైతే అలాంటిది జరగదని మీడియోరోస్ అంటారు.

‘‘ఈ సుంకాలు.. చైనాకు మార్కెట్ అందుబాటులో లేని పరిస్థితులను సృష్టించి కొంత నష్టం కలిగిస్థాయి. కానీ ఇన్నేళ్లలో గణనీయంగా పెరిగిన చైనా మేధో సంపత్తి హక్కులను మార్చటానికి ఇవి దోహదపడవు‘‘ అని ఆయన వ్యాఖ్యానించారు.

కానీ దీర్ఘ కాలికంగా చూసినపుడు.. చైనా కొంత పట్టు సడలించేలా ఈ సుంకాలు ప్రభావం చూపవచ్చునని.. విదేశీ సంస్థలు చైనాలో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయటం, సాంకేతిక పరిజ్ఞాన్ని బదిలీ చేయటం వంటి నిబంధనలను సరళం చేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే.. ప్రస్తుత పరిస్థితులు సంక్లిష్టమవుతున్నాయి. ఇరుపక్షాలూ దెబ్బకు దెబ్బ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇది కేవలం వాణిజ్య పోరు‌ మాత్రమే కాదు. ప్రపంచంలో ఆధిపత్యం కోసం రెండు సూపర్‌పవర్ల మధ్య జరుగుతున్న పోరు. రెండిటలో ఏ దేశమూ వెనక్కు తగ్గాలని భావించటం లేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు