లాస్ట్‌ డేట్ ఏప్రిల్ 27: సూర్యుడిపైకి మీ పేరు.. ఇలా పంపించొచ్చు

  • 10 ఏప్రిల్ 2018
సూర్యుడిపై అంతరిక్ష నౌక, టికెట్ ఊహాచిత్రం Image copyright NASA

సూర్యుడిపైకి మీ పేరును పంపించాలనుకుంటున్నారా? అమెరికాకు చెందిన నాసా ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తోంది.

దీనికి చేయాల్సిందల్లా.. నాసా వెబ్‌సైట్‌కు వెళ్లి, అక్కడ కింద ఫొటోలో కనిపిస్తున్న ఫామ్‌ ఎంచుకుని, దాన్ని నింపాల్సి ఉంటుంది.

ఈ ఫామ్ నింపాలంటే మీకు తప్పనిసరిగా ఈమెయిల్ ఉండాల్సిందే. ఒకవేళ మీకు ఈమెయిల్ లేకపోతే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా తమ పేర్లను సూర్యుడిపైకి పంపించవచ్చునని నాసా తెలిపింది. ఇలా పేర్లు పంపించేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 27.

అయితే, ఈ పేర్లన్నీ నిజంగా సూర్యుడిపైకి వెళతాయా? వెళితే ఎలా వెళతాయి? అసలు ఎందుకు వెళతాయి?

Image copyright NASA

సూర్యుడిని ‘తాకేందుకు’

సూర్యుడిపై పరిశోధనలు చేయాలని నాసా నిర్ణయించుకుంది. ఇందుకోసం ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ అనే మిషన్ చేపట్టింది. సూర్యుడిపై అతి దగ్గరి నుంచి అధ్యయనం చేయనున్న తొలి మిషన్ ఇదే.

ఒక కారు పరిమాణంలో ఉండే పార్కర్ సోలార్ అంతరిక్ష నౌక.. సూర్యుడి వాతావరణంలోకి వెళ్లనున్న మొట్టమొదటి నౌక. దీన్ని తయారు చేసేందుకు, ప్రయోగించేందుకు నాసా ఏకంగా 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 9,735 కోట్లు) ఖర్చు చేస్తోంది.

ఈ ఏడాది జూలై 31వ తేదీన దీన్ని ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది.

నాసా చెబుతున్నట్లు ఇదేమీ సూర్యుడిని నిజంగానే తాకదు కానీ.. సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: 'పార్కర్ సోలార్ ప్రోబ్' మిషన్ గురించి వివరిస్తున్న నాసా శాస్త్రవేత్త డాక్టర్ నికీ ఫాక్స్

ఏం చేస్తుంది?

సూర్యుడు అంటేనే భగభగ మండే, మహా శక్తివంతమైన, ప్రమాదకరమైన అగ్ని జ్వాలల్ని వెదజల్లే నక్షత్రం. అసలు సూర్యుడిపై అంత శక్తి, వేడి ఎలా పుట్టాయి? ఈ జ్వాలల్ని ప్రేరేపించేది ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని గత 60 ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఈ పరిశోధనల్లో మరింత పురోగతి సాధించేందుకే తాజాగా పార్కర్ పోలార్‌ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తున్నారు.

భూమికి, సూర్యుడికి మధ్య దూరం 9.30 కోట్ల మైళ్లు కాగా, పార్కర్ సోలార్ అంతరిక్ష నౌక.. శుక్ర గ్రహాన్ని కూడా దాటుకుని.. బుధ గ్రహ కక్ష్యలో సూర్యుడికి దాదాపు 38 లక్షల మైళ్ల దగ్గరగా వెళుతుంది. గతంలో ఏ అంతరిక్ష నౌక వెళ్లనంత దగ్గరగా.. ‘‘క్రోనా’’ అని పిలిచే సూర్యుడి బహిర్గత వాతావరణంలోకి వెళుతుందని నాసా తెలిపింది. నాసా ప్రణాళిక ప్రకారం 2024 డిసెంబర్ కల్లా సూర్యుడి వాతావరణంలోకి పార్కర్ పోలార్ వెళుతుంది.

ఈ నౌక 24 సార్లు సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.

Image copyright NASA

అంత వేడిని ఈ నౌక తట్టుకుంటుందా?

సూర్యుడిపైన ఉండే వేడి 5,600 సెల్సియస్ అయితే.. క్రోనా వాతావరణంలో ఉండే వేడి 1,377 సెల్సియస్. అంత వేడిని తట్టుకుని ఈ అంతరిక్ష నౌక తన పని చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించుకుని 11.43 సెంటీమీటర్ల మందం ఉన్న కార్బన్ సమ్మిళిత కవచాలతో అంతరిక్ష నౌకను తయారు చేశారు.

గతంలో సూర్యుడికి దగ్గరగా వెళ్లిన రికార్డు ఎవరిదంటే...

సూర్యుడిపై పరిశోధనలు గత 60 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం బుధుడు. బుధ గ్రహానికి, సూర్యుడికి మధ్య దూరం 4.2 కోట్ల మైళ్లు.

1976లో హీలియస్ 2 అంతరిక్ష నౌక సూర్యుడికి అత్యంత దగ్గరగా.. అంటే.. 2.7 కోట్ల మైళ్ల దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టించింది.

అంతా సవ్యంగా జరిగితే.. హీలియస్ 2 అంతరిక్ష నౌక కంటే ఏడు రెట్లు, బుధుడి కంటే పది రెట్లు సూర్యుడికి దగ్గరగా వెళ్లనుంది ‘పార్కర్ సోలార్’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)