World Television Day: అలనాటి బీబీసీ టీవీ స్టూడియోలు ఎలా ఉండేవో తెలుసా...

World Television Day: అలనాటి బీబీసీ టీవీ స్టూడియోలు ఎలా ఉండేవో తెలుసా...

టెలివిజన్ టెక్నాలజీ గత కొన్ని దశాబ్దాలలో అనూహ్యంగా మారిపోయింది. ఆ సరికొత్త మార్పులకు అనుగుణంగానే బీబీసీ టెలివిజన్ స్టూడియోలు కూడా మారిపోయాయి. ఇప్పుడున్న బీబీసీ స్టూడియోలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందాయి. ఈ హైటెక్ స్టూడియోలను దూరం నుంచి కూడా ఆపరేట్ చేయవచ్చు. పరిమాణంలో కూడా ఇవి మరీ పెద్దవేమీ కావు. కానీ, నలభయ్యేళ్ళ కిందట బీబీసీ స్టూడియోలు చాలా పెద్దగా ఉండేవి. వాటిలో ఎప్పుడూ చాలా మంది పని చేస్తూ ఉండేవారు . 1968లో బీబీసీ స్టూడియోలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఈనాటి బీబీసీ ఆర్కైవ్స్‌లో.

ఇప్పుడు మనం బీబీసీ టీవీ కేంద్రంలోని అతి పెద్ద స్టూడియోలో ఉన్నాం. ఇది స్టూడియో-వన్. చాలా పెద్దది.

అక్కడ యాంకర్‌ ఒక్కరే కాదు. ఇంకా దాదాపు యాభై మంది ఉంటారు. కెమేరామెన్, డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఇలా చాలా మంది కలిసి పని చేస్తే కానీ ఒక కార్యక్రమం సజావుగా ప్రసారమయ్యేది కాదు.

ఈ స్టూడియో పరిమాణం చూస్తే.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడం ఖాయమనిపిస్తుంది.

ఈ స్టూడియో ఫ్లోర్ విస్తీర్ణం ఎంతో తెలుసా? అక్షరాలా పది వేల ఎనిమిది వందల చదరపు అడుగులు. ఇందులోని రెండు గోడల వెడల్పు 108 అడుగులు. మిగతా రెండు గోడలు కూడా వంద అడగులకు తక్కువేమీ లేవు.

దీని ద్వారాలు కూడా చాలా పెద్దవి. వాటి ఎత్తు పద్దెనిమిది అడుగులు, వెడల్పుపు పధ్నాలుగు అడుగులు. నాటకాలను రికార్డు చేయడానికి చక్కని చిత్రాలతో కూడిన అత్యంత భారీ సెటింగులను నేరుగా ఈ తలుపుల్లోంచి తీసుకుపోవచ్చు. ఒకసారి ఇందులోకి మూడు డబుల్ డెక్కర్ బస్సులను తీసుకువచ్చారు.

పైకప్పు నుంచి 168 ప్రకృతి దృశ్యాల చిత్రాలు వేలాడుతున్నాయి. వాటిని వైర్లతో వేలాడదీసి ఎలక్ట్రిక్ మోటార్లకు అనుసంధానించారు. వాటిలో ఏది కావాలంటే దాన్ని వెంటనే ఫ్రేమ్ లోకి తీసుకోవచ్చు.

కప్పు నిండా అమర్చిన లైట్ల సంఖ్య ఎంతో తెలుసా.. అయిదు వందలు.

ఇందులో మొత్తం ఆరు కెమెరాలున్నాయి. వాటిలో కొన్ని పెడెస్టల్ మీద ఎటు కావాలంటే అటు జరపవచ్చు. కొన్నింటిని క్రేన్ మీద ఫిట్ చేశారు.

ఇది అదిపెద్ద బీబీసీ కేమెరాలలో ఒకటి. దీన్ని దీన్ని ట్రాన్స్ అట్లాంటిక్ క్రేన్ అంటారు. ఇది ఇరవై అడుగుల ఎత్తు వరకు పైకి లేస్తుంది.దీని వెనుక క్రేన్ మీద ఇద్దరు కూర్చుని ఆపరేట్ చేస్తారు. ఇది చాలా ఎత్తుకు వెళ్తుంది కాబట్టి కేమెరామెన్‌లు సేఫ్టీ బెల్టులు, క్రాష్ టోపీలు ధరించేవారు.

ఇక్కడున్న మైక్రో ఫోన్ బూమ్స్ ప్రెజెంటర్ మాటలను, స్టూడియోలోని అతిథుల మాటలను గ్రహిస్తాయి.

ఈ మైక్రో ఫోన్ బూమ్స్ ప్రెజెంటర్ తలకు కొద్దిగా పైన ఉంటాయి. ప్రేక్షకులకు అవి కనిపించవచు. ప్రెజెంటర్స్ మాత్రం తమ స్వరం పెంచి.. మైక్రోఫోన్ అందుకునే విధంగా మాట్లాడాలి.

స్టూడియోలో ఉండే మేనేజర్ ఇచ్చే సిగ్నల్స్ ద్వారా ప్రెజెంటర్ ఎప్పుడు మాట్లాడటం మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపేయాలో అర్ధం చేసుకుంటారు.

ఈ బీబీసీ స్టూడియో-వన్ యాత్ర మీకు ఆనందాన్ని పంచిందని ఆశిస్తున్నాం. గుడ్ బై.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)