మనం సగం మనుషులమే! మన శరీరంలో సగానికి పైగా సూక్ష్మజీవులే!!

  • 13 ఏప్రిల్ 2018
మానవ శరీరంలో సూక్ష్మజీవుల గురించి రేఖాచిత్రం

మన శరీరంలో సగానికి పైగా మనిషి కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మానవ శరీరంలోని మొత్తం కణాలలో మానవ కణాల సంఖ్య కేవలం 43 శాతం మాత్రమే. మిగతాదంతా మన శరీరాన్ని ఆక్రమించుకుని జీవిస్తున్న సూక్ష్మజీవులే.

మన శరీరాల్లో దాగున్న ఈ మరో సగం గురించి.. శరీరాన్ని ఆవాసంగా చేసుకున్న సూక్ష్మజీవుల గురించి తెలుస్తున్న కొత్త విషయాలు, కోణాలతో.. అలర్జీ నుంచి పార్కిసన్స్ వరకూ అనేక వ్యాధుల గురించిన అవగాహన కూడా వేగంగా మారిపోతోంది.

ఈ రంగంలో అసలు ‘మానవులు’ అంటే అర్థమేమిటి అనే ప్రశ్న కూడా సరికొత్తగా ముందుకొస్తోంది. ఆ పరిశోధనలు వినూత్న పద్ధతుల్లో చికిత్సలకు దారులు తెరుస్తున్నాయి.

‘‘మన శరీరమంటే.. కేవలం మనం మాత్రమే కాదు’’ అంటారు మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌లో మైక్రోబయోమ్ సైన్స్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రూత్ లే.

అవి మన ఆరోగ్యానికి చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు.

మనం ఎంత శుభ్రంగా కడిగినా.. మన శరీరంలోని అన్ని మూలల్లో, పగుళ్లు, చీలికల్లో సూక్ష్మ జీవులు వదలకుండా పరుచుకునే ఉంటాయి.

వీటిలో బాక్టీరియా, వైరస్‌లు, ఫంగై, ఆర్కీ (అంతకుముందు బ్యాక్టీరియా అని వర్గీకరించిన మరో రకం సూక్ష్మజీవులు) ఉంటాయి. ఈ సూక్ష్మజీవంలో అత్యధిక భాగం.. ఆక్సిజన్ అందని, చీకటి నిండిన మన పేగుల్లో పోగుపడి ఉంటాయి.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో ప్రొఫెసర్ రాబ్ నైట్ ‘‘మనం మనుషులకన్నా ఎక్కువగా సూక్ష్మజీవులం’’ అని బీబీసీతో పేర్కొన్నారు.

అసలు వాస్తవంగా.. మానవ కణాలకన్నా సూక్ష్మజీవుల కణాలే 10 రెట్లు అధికంగా ఉన్నాయని భావించారు.

‘‘ఇప్పుడా లెక్కను మానవ కణాల సంఖ్యకు దాదాపు సమానంగా సూక్ష్మజీవులు ఉన్నట్లు సవరించారు. ప్రస్తుత అంచనా ప్రకారం.. శరీరంలోని కణాలన్నిటినీ లెక్కకడితే మనం 43 శాతం మానవులం’’ అని ఆయన వివరించారు.

జన్యుపరంగా చూస్తే.. మనం మన శరీరంలోని సూక్ష్మజీవుల కన్నా అత్యల్పులమే.

మానవ జన్యుపటం (జీనోమ్) - మానవుడి పూర్తిస్థాయి జన్యుక్రమం - 20,000 జన్యువులతో తయారైంది.

కానీ.. మన శరీరంలోని సూక్ష్మజీవాల జన్యువులన్నిటినీ కలిపితే.. 20 లక్షల నుంచి రెండు కోట్ల సూక్ష్మజీవి జన్యువులు లెక్కతేలుతాయి.

‘‘మనకు కేవలం ఒక్క జన్యుపటం మాత్రమే లేదు. మన శరీరంలోని సూక్ష్మజీవాల జన్యుపటం నిజానికి మన శరీరానికి సాయపడే రెండో జన్యుపటం వంటిది’’ అని కాల్‌టెక్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ సర్కిస్ మజ్మానియన్ వాదిస్తారు.

‘‘అసలు మన సొంత డీఎన్‌ఏతో పాటు.. మన పేగుల్లోని సూక్ష్మజీవుల డీఎన్‌ఏ కలిపితేనే మనుషులు మనుషులవుతారు’’ అని ఆయన పేర్కొన్నారు.

మేలు చేస్తున్న మంచి సూక్ష్మజీవులు

మన శరీరంలోని సూక్ష్మజీవులు.. మన శరీరంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా, మన శరీరాలపై ఏమాత్రం ప్రభావం చూపకుండానే మనం మోసుకుని తిరుగుతున్నామని అనుకోవటం అవివేకమవుతుంది.

జీర్ణక్రియలో, వ్యాధినిరోధక వ్యవస్థను నియంత్రించటంలో, వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో, కీలకమైన విటమిన్లను తయారు చేయటంలో ఈ సూక్ష్మజీవాల పాత్ర గురించిన రహస్యాలను శాస్త్రవేత్తలు వేగంగా కనుగొంటున్నారు.

‘‘ఇప్పటివరకూ మనం ఎన్నడూ ఊహంచని పద్ధతుల్లో ఈ సూక్ష్మజీవులు మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మార్చివేయగల మార్గాలను మేం కనుగొంటున్నాం’’ అని ప్రొఫెసర్ నైట్ చెప్పారు.

ఇది సూక్ష్మజీవుల ప్రపంచం గురించి వినూత్న ఆలోచనా విధానం. ఇప్పటివరకూ ఈ సూక్ష్మజీవులతో మన సంబంధం ప్రధానంగా వాటితో యుద్ధం చేసేదిగానే ఉంది.

సూక్ష్మజీవ రణరంగం

మశూచి (స్మాల్‌పాక్స్), క్షయ (మైక్రోబ్యాక్టీరియమ్ ట్యూబర్‌క్యులోసిస్) వంటి ప్రాణాంతక సూక్ష్మజీవులపై మనం యాంటీబయోటిక్స్, వ్యాక్సిన్స్‌లను ఆయుధాలుగా ప్రయోగిస్తున్నాం.

అది చాలా ఉపయోగపడింది. పెద్ద సంఖ్యలో ప్రాణాలను కాపాడింది.

కానీ.. చెడు సూక్ష్మజీవులపై మనం చేసిన దాడి.. ‘మంచి బ్యాక్టీరియా’కు చాలా నష్టం చేసిందని కొందరు పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

‘‘అంటువ్యాధులను నిర్మూలించటంలో మనం గత 50 ఏళ్లలో అద్భుతంగా పనిచేశాం. కానీ ఆటోయిమ్యూన్ వ్యాధి, ఎలర్జీలు విపరీతంగా, భయంకరంగా పెరిగాయి’’ అని ప్రొఫెసర్ లే పేర్కొన్నారు.

‘‘రోగకారక సూక్ష్మజీవులపై విజయవంతమైన మన పోరాటం ఫలితంగా.. సూక్ష్మజీవాల్లో జరిగిన మార్పులు ఇప్పుడు సరికొత్త వ్యాధులకు దారితీశాయి’’ అని ఆమె చెప్పారు.

ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు.. చివరికి డిప్రెషన్, ఆటిజం వంటి లోపాలకు, క్యాన్సర్ మందులు పనిచేస్తాయా లేదా అనే దానికీ మన శరీరంలోని సూక్ష్మజీవాలకు సంబంధం ఉందంటున్నారు.

ఊబకాయం మరొక ఉదాహరణ. ఈ విషయంలో వారసత్వ చరిత్ర, జీవన శైలిల పాత్ర చాలా స్పష్టంగానే ఉంటుంది. కానీ మన పేగుల్లోని సూక్ష్మజీవాల పాత్ర ఏమిటి?

ఇక్కడే కొంత గందరగోళానికి అవకాశముంది.

బర్గర్లు, చాక్లెట్లు తినటం.. ఊబకాయాన్ని పెంచటంతో పాటు జీర్ణక్రియ వ్యవస్థలోని పేగుల్లో ఎలాంటి సూక్ష్మజీవులు పెరుగుతాయనే దానిమీద కూడా ప్రభావం చూపవచ్చు.

మరి.. మనం తింటున్న ఆహారాన్ని మనకు ఊబకాయం వచ్చేలా చెడు బ్యాక్టీరియాలు జీర్ణం చేస్తున్నాయా? అనేది తెలుసుకోవటమెలా?

ఇది తెలుసుకోవటం కోసం ప్రొఫెసర్ నైట్.. ఎలుకల మీద ప్రయోగం చేశారు. ఆ ఎలుకలు సాధ్యమైనంతగా పరిశుభ్రమైన ప్రదేశంలో పుట్టాయి.

అసలు ఎలాంటి సూక్ష్మజీవుల మనుగడలేని వాతావరణంలో ఆ ఎలుకలను పెంచారు.

‘‘సన్నాగా ఉన్న మనుషులు, ఊబకాయమున్న మనుషుల నుంచి వేర్వేరుగా బ్యాక్టీరియాను సేకరించి.. ఆ బ్యాక్టిరియాను ఎలుకల్లో ప్రవేశపెట్టినపుడు ఎవరి నుంచి సేకరించిన బ్యాక్టీరియా ఆ ఎలుకల్లో ఉందనే దానిని బట్టి అవి సన్నగా లేదా లావుగా అవుతాయని మేం చూపగలిగాం’’ అని ఆయన తెలిపారు.

ఊబకాయం ఉన్న ఎలుకల్లో సన్నటి శరీరమున్న వారి బ్యాక్టీరియాను ప్రవేశపెట్టినపుడు.. ఆ ఎలుకలు బరువు తగ్గాయి కూడా.

‘‘ఇది చాలా అద్భుతంగా ఉంది కదా... కానీ మనుషుల్లో కూడా ఇలాగే జరుగుతుందా అన్నది ఇప్పుడు ప్రశ్న’’ అంటారాయన.

ఈ రంగం అందిస్తున్న కొత్త ఆవకాశమిది. సూక్ష్మజీవులు కొత్త రకం ఔషధాలుగా ఉపయోగపడే అవకాశం. దీనిని ‘‘బగ్స్ యాజ్ డ్రగ్స్’’ (ఔషధాలుగా క్రిముల వినియోగం) అని వ్యవహరిస్తున్నారు.

సమాచార గని

వెల్‌కమ్ ట్రస్ట్ సాంగర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు డాక్టర్ ట్రెవర్ లాలీని నేను కలిశాను. ఆరోగ్యంగా ఉన్న వారి, అనారోగ్యంగా ఉన్న వారి సూక్ష్మజీవులను పరీక్షించే పనిలో ఉన్నారాయన.

‘‘ఉదాహరణకు.. అనారోగ్య స్థితిలో ఉన్న ఒక వ్యక్తిలో కొన్ని రకాల సూక్ష్మజీవులు లేకపోవచ్చు. వారిలో ఆ లేని సూక్ష్మజీవులను ప్రవేశపెట్టటం ఈ పరిశోధన ఉద్దేశం’’ అని ఆయన వివరించారు.

ఒక వ్యక్తిలోని సూక్ష్మజీవాలను మరమ్మతు చేయటం.. అల్సరేటివ్ కోలిటిస్ వంటి వ్యాధులు తగ్గిపోవటానికి దోహదపడవచ్చనేందుకు ఆధారాలు అధికంగా లభిస్తున్నాయని డాక్టర్ లాలీ చెప్తున్నారు.

‘‘మేం అధ్యయనం చేస్తున్న చాలా రకాల వ్యాధులకు.. పలు రకాల క్రిములను కలిపి ఇవ్వటం.. అంటే 10 లేదా 15 రకాల సూక్ష్మజీవులను రోగిలో ప్రవేశపెట్టటం ద్వారా చికిత్స చేయవచ్చునని నేననుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

ఈ సూక్ష్మజీవాల ఔషధం ఇంకా తొలి దశల్లోనే ఉంది. అయితే.. మన శరీరంలోని సూక్ష్మజీవాల వివరాలు మన ఆరోగ్యానికి సంబంధించిన సమాచార గని అని.. ఒక వ్యక్తి సూక్ష్మజీవాల స్థితిగతులను పరిశీలించటం రోజు వారీ కార్యక్రమంగా మారే రోజు త్వరలోనే వస్తుందని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు.

‘‘ఒక స్పూను పరిమాణమున్న మానవ మలంలోని సూక్ష్మజీవుల డీఎన్‌ఏలో.. ఒక టన్ను డీవీడీల్లో నిక్షిప్తం చేయగల సమాచారం కన్నా ఎక్కువ సమాచారం ఉంటుంది’’ అని ప్రొఫెసర్ నైట్ చెప్పారు.

‘‘ప్రస్తుతం మనం మలవిసర్జన చేసిన ప్రతిసారీ ఆ సమాచారాన్నంతా విసర్జించి కడిగేస్తున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘అలా విసర్జించిన సమాచారాన్ని తక్షణమే అధ్యయనం చేసి.. మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయగల రోజు ఎంతో దూరంలో లేదు’’ అని ప్రొఫెసర్ నైట్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)