సిరియా రసాయన దాడులపై ‘తీవ్ర’ పరిణామాలు తప్పవు.. 48 గంటల్లో కీలక నిర్ణయాలు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

  • 10 ఏప్రిల్ 2018
డొనాల్డ్ ట్రంప్, సిరియా, రసాయన దాడులు Image copyright Getty Images

పౌరులపై రసాయన ప్రయోగం జరిగిందని భావిస్తున్న సిరియా విషయంలో 'తీవ్రమైన' ప్రతిస్పందన ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

'మిలటరీపరంగా పలు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నామ'ని ట్రంప్ మీడియాకు తెలిపారు.

తమ ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. శనివారం దౌమాలో జరిగిన సంఘటనకు కారణం ఎవరన్న దానిపై క్రమంగా స్పష్టత వస్తోందని ట్రంప్ తెలిపారు.

సోమవారం ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రన్‌తో మాట్లాడారు. ఈ సంభాషణలో ఇరువురు నేతలూ సిరియా ఘటనపై తగిన విధంగా స్పందించాలని నిర్ణయించారు.

బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా సిరియాలో రసాయనిక దాడులను ఖండించారు. దాడులకు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ -అసద్‌ మద్దతుదారులే బాధ్యత వహించాలన్నారు.

సిరియా ఘటనపై ఐరాస భద్రతామండలి సమావేశంలో అమెరికా, రష్యాల మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో పాశ్చాత్య దేశాల నేతల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సిరియా సంఘటనల నేపథ్యంలో ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై పాశ్చాత్య దేశాల నాయకులు ఆలోచిస్తున్నారు.

‘‘ఇలాంటి అకృత్యాలను మేం ఉపేక్షించం. రాబోయే 24 నుంచి 48 గంటల్లో మేం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నాం’’ అని ట్రంప్ ప్రకటించారు.

Image copyright AFP

ఐరాసలో రష్యా ప్రతినిధి వాసిలీ నెబెన్జియా ఈ దాడులను నాటకంగా అభివర్ణించారు. వాటిపై అమెరికా మిలటరీ చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ, సిరియా మిలటరీ చర్యలను సమర్ధిస్తున్న రష్యా చేతులకూ సిరియా పిల్లల రక్తపు మరకలు అంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శనివారం ఏం జరిగింది?

తూర్పు ఘౌటా ప్రాంతంలోని దౌమాలో సుమారు 500 మందిని వైద్య కేంద్రాలకు తీసుకువచ్చారని సిరియా-అమెరికన్ మెడికల్ సొసైటీ చెబుతోంది. వారిపై రసాయన దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసింది.

ఈ దాడిలో 42 నుంచి 60 మందికి పైగా మరణించినట్లు భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.

Image copyright Getty Images

రష్యా సవాలు

ఐరాసలో రష్యా ప్రతినిధి నెబెన్జియా, తమ సొంత ప్రయోజనాల కోసం తిరుగుబాటుదారులే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. ఇవి రష్యా ప్రతిష్టను మసకబర్చడానికి జరుగుతున్న ప్రయత్నాలని అన్నారు.

రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (ఓపీసీడబ్ల్యూ) పరిశోధకులు సిరియాకు వెళ్లి పరిశీలించాలని, అవసరమైతే వారి వెంట తామూ వెళతామని సవాలు విసిరారు.

పౌరులపై క్లోరిన్ కానీ ఎలాంటి రసాయనాలు కానీ వాడినట్లు తమకు ఆనవాళ్లు దొరకలేదని తెలిపారు.

సిరియా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే రష్యా బలగాలను పంపడం జరిగిందని, అయితే అబద్ధపు ప్రచారంతో ఆ దేశంపై మిలటరీ చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఏం జరగొచ్చు?

బ్రిటన్‌లో మాజీ గూఢాచారిపై రష్యా విషప్రయోగం తర్వాత రష్యాకు, పాశ్చాత్య దేశాలకు మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.

తాజాగా సిరియా పరిణామాల నేపథ్యంలో ‘మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా మాట్లాడారు. దీంతో అమెరికా ఏం చేయొచ్చన్నదానిపై చర్చ జరుగుతోంది.

సిరియాతో పాటు దానికి మిత్రదేశాలైన ఇరాన్, రష్యాలపై కూడా అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. రసాయనదాడులపై విచారణ జరపాలని ఐక్యరాజ్య సమితిని కోరవచ్చు.

పరిమితమైన దాడులకు దిగొచ్చు. లేదంటే భారీగా కూడా దాడులు చేయొచ్చు. అయితే, దాడుల విషయంలో అమెరికాకు ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు మద్దతుగా నిలుస్తాయా? అనేది అనుమానమే. అయినప్పటికీ తాము ఒంటరిగానే చర్యలు తీసుకోగలమని ట్రంప్ పదేపదే చెబుతున్నారు.

కానీ, గతంలో సిరియా నుంచి అమెరికా సేనల్ని వెనక్కు రప్పించాలని అభిప్రాయపడిన ట్రంప్ ఇప్పుడు మనసు మార్చుకుంటారా? లేక మరింతగా సిరియాలోకి చొచ్చుకు వెళతారా? అన్నది ప్రశ్నార్థకం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)