కామన్వెల్త్ డైరీ: మాటలాపి ఆటపై దృష్టి పెట్టండని అంపైర్ ఎందుకన్నాడు?

  • 10 ఏప్రిల్ 2018
అశ్విని పొన్నప్ప, సాత్విక్ Image copyright WILLIAM WEST/AFP/Getty Images
చిత్రం శీర్షిక అశ్విని పొన్నప్ప- సాత్విక్ రంకిరెడ్డి

గోల్డ్‌కోస్ట్‌లో ఇది అత్యంత అరుదైన సన్నివేశం.

కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ మ్యాచ్ జరుగుతోంది.

భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్ మలేషియాకు చెందిన ప్రత్యర్థి సోనియా చెయాతో తలపడుతోంది.

తోటి క్రీడాకారులందరూ సైనాను ఉత్సాహపరుస్తున్నారు.

"గెలుపు నీదే.. విజయం భారత్‌దే" అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ప్రత్యర్థి సోనియాను మట్టికరిపించిన మరుక్షణం భారత క్రీడాకారులందరూ సైనాను అభినందనలతో ముంచెత్తారు.

జాతీయజెండా పట్టుకుని బ్యాడ్మింటన్ కోర్టులోనే డాన్సులు చేశారు.

Image copyright WILLIAM WEST/AFP/Getty Images

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్ బలహీనంగా ఉంది. భారత్ తరఫున సాత్విక్ రంకిరెడ్డి-అశ్విని పొన్నప్పలు బరిలోకి దిగారు.

మలేషియాకు చెందిన పెంగ్ సూన్- గో లి యింగ్ జోడితో వారు తలపడ్డారు.

సాత్విక్ నేరుగా మలేషియా ఆటగాడిపైనే గురిపెట్టాడు. షటిల్ కాక్‌ ఒకసారి గో లీ యింగ్ ముఖానికి తాకింది. అప్పుడు సాత్విక్‌కి పాయింట్ వచ్చింది.

పాయింట్ వస్తే ఎవరైనా సంతోషపడతారు. కానీ సాత్విక్‌ బాధపడ్డాడు. కాక్‌ గో లీ యింగ్ ముఖానికి తగిలినందుకు అతనికి సాత్విక్ క్షమాపణ చెప్పాడు.

ఆడుతున్నంత సేపు అశ్విని పొన్నప్ప సాత్విక్‌కి సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంది.

వారు మాట్లాడుకునేది ప్రత్యర్థులకు అర్థంకాకుండా ఉండేందుకు అశ్విని తన నోటికి చేయి అడ్డుపెట్టుకుంది.

నిజానికి ఆమె తన చేయి అడ్డుపెట్టుకోకున్నా.. వారేం మాట్లాడుకుంటున్నారో మలేషియా క్రీడాకారులకు తెలిసే అవకాశమే లేదు.

వాళ్లిద్దరూ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండటంతో అంఫైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మాటలు ఆపి ఆట మీద దృష్టి పెట్టాలని అంఫైర్ వారికి సూచించారు.

సాత్విక్‌-అశ్విని జోడీ 21-14, 15-21, 21-15తో పెంగ్‌ సూన్‌- లి యింగ్‌ గో ద్వయంపై గెలిచింది.

Image copyright Dean Mouhtaropoulos/Getty Images
చిత్రం శీర్షిక కిదాంబి శ్రీకాంత్

దుమ్మురేపిన కిదాంబి శ్రీకాంత్

కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్ తొలిసారి బంగారు పతకం సాధించింది.

ఫైనల్లో భారత్‌ 3-1తో మూడుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మలేషియాపై గెలుపొందింది.

కిదాంబి శ్రీకాంత్‌ తన ఆటతో ఆకట్టుకున్నాడు. అతడు 21-17, 21-14తో ఒకప్పటి వరల్డ్ నెంబర్ వన్, ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న లీ చాంగ్‌ వీని ఓడించాడు.

"ఈ మ్యాచ్ అంత సులువైందేమీ కాదు. లీపై నెగ్గేందుకు నేను శాయశక్తులా ప్రయత్నించాను" అని మ్యాచ్ అయిపోయిన తర్వాత శ్రీకాంత్ నాతో చెప్పాడు.

Image copyright Getty Images

సైనా ఫోర్త్ మ్యాచ్‌లో వచ్చింది. ఫస్ట్‌ సెట్‌ 11-11తో డ్రాగా ముగిసింది. అయితే, వరుసగా 10పాయింట్లు సాధించి ఫస్ట్ మ్యాచ్ గెలిచింది.

రెండో మ్యాచ్‌లో మలేషియా క్రీడాకారిణి సోనియా చేయి వేలికి గాయమైంది. ఇది సైనా ఏకాగ్రతను దెబ్బతీసింది.

మూడో గేమ్‌లో ఒకదశలో 7-5తో సోనియా ఆధిక్యంలో ఉంది. అప్పుడు సైనా దూకుడు పెంచింది. 21-9తో మూడో గేమ్‌ గెలిచింది.

సర్వీసులతో సైనాను ఇబ్బంది పెట్టేందుకు సోనియా ప్రయత్నించింది. కానీ చివరికి సైనా వ్యూహం ఫలించింది.

కారార స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. దీన్ని చూసేందుకు భారతీయులు చాలా మంది వచ్చారు. వారి హంగామా చూస్తే ఈ మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగుతోందా అన్న ఫీలింగ్ కలిగింది.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పాయింట్ వచ్చిన ప్రతీసారి ప్రతీ భారతీయ క్రీడాకారుడు కోచ్ గోపిచంద్ వైపు చూసేవారు.

ఈ షాట్ ఎలా ఉంది అని కళ్లతోనే మాట్లాడుకునే వారు. అలాగే, పాయింట్ కోల్పోయిన ప్రతీసారి కూడా కోచ్ గోపిచంద్‌కి కళ్లతోనే తమ బాధను వ్యక్తం చేసేవారు.

Image copyright PATRICK HAMILTON/AFP/Getty Images
చిత్రం శీర్షిక మెహులి ఘోష్

తొందరపాటులో చేజారిన పసిడి

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో భారత్‌కు చెందిన మెహులి ఘోష్-సింగపూర్‌కు చెందిన మార్టినా వెలోసో మధ్య హోరాహోరీ జరిగింది.

23వ షాట్‌ వరకు మెహులి..మార్టినా కంటే కాస్త వెనకబడే ఉంది.

చివరి షాట్‌లో మెహులి 10.9 పాయింట్లు సాధించింది.

దాంతో తానే గెలిచినట్లు భావించి చేతికున్న గ్లౌజులు మెహులి తీసేసింది. పసిడి పతకం సాధించినట్లు సంబరపడింది.

కానీ ఇద్దరి పాయింట్లు సమానంగా ఉన్నాయని తర్వాత తెలిసింది. దాంతో ఇద్దరికి షూటాఫ్‌ తప్పలేదు. కానీ మెహులి ఘోష్‌ ఏకాగ్రత దెబ్బతింది. షూటాఫ్‌లో ప్రతిభ కనబర్చలేకపోయింది.

చివరికి వెలోసోదే పైచేయి అయింది. షూటాఫ్‌లో ఆమె 10.3 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెల్చుకుంది.

మెహులి ఘోష్‌ 9.9 పాయింట్లతో రెండో స్థానంతో సంతృప్తి చెందింది. తాను అలా చేసి ఉండకూడదు అని ఆ తర్వాత మొహులి బాధపడింది.

అయితే, 17 ఏళ్ల మెహులికి కీలకమైన సమయాల్లో మరింత ఏకాగ్రతగా ఉండటం అనుభవంతో పాటే వస్తుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జీతూ రాయ్

పసిడి కొల్లగొట్టిన జీతూ రాయ్

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్‌ జీతూ రాయ్ గోల్డ్ మెడల్ సాధించాడు.

నిజానికి క్వాలిఫైయింగ్ రౌండ్‌లో జీతూరాయ్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరో భారతీయ షూటర్ ఓంప్రకాశ్ మిత్రావల్ మొదటి స్థానంలో ఉన్నాడు.

చెమట, సరైన సమయంలో ట్రిగర్ నొక్కకపోవడం వల్లే తాను మొదట సరిగా ప్రతిభ చూపలేకపోయానని జీతూ రాయ్ చెప్పాడు.

ఆ తర్వాత కోచ్‌ని కలిసి కొన్ని సలహాలు, సూచనలు తీసుకున్నాడు. అవి జీతూకు బాగా పనికొచ్చాయి.

జీతూ గెలిచిన వెంటనే గ్యాలరీలో కూర్చున్న జస్పాల్ రాణా వచ్చి అతన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు.

జీతూ నేపాల్‌లో జన్మించాడు. ప్రస్తుతం గోర్ఖా రైఫిల్స్‌లో నాయబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు.

అయితే, క్వాలిఫైయింగ్ రౌండ్‌లో మొదటిస్థానంలో ఉన్న ఓంప్రకాశ్ మిత్రావల్ తన ఫామ్‌ కొనసాగించలేకపోయాడు.

కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను బ్రేక్ చేసినా.. గోల్డ్ సాధించడంలో మాత్రం విఫలమయ్యాడు. అతను కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)