కామన్‌వెల్త్ క్రీడల్లో మరో స్వర్ణం.. పతకాల పట్టికలో మూడో స్థానంలో భారత్

  • 11 ఏప్రిల్ 2018
Image copyright Getty Images

కామన్‌వెల్త్ క్రీడల్లో మహిళల డబుల్ ట్రాప్ విభాగంలో శ్రేయసి సింగ్ స్వర్ణ పతకం సాధించింది.

పోటాపోటీగా జరిగిన ఈ పోటీలో ఆస్ట్రేలియా షూటర్ ఎమ్మా కాక్స్ కూడా ఫైనల్స్‌లో సమాన పాయింట్లు సాధించారు.

నాలుగు రౌండ్ల పోటీల్లో శ్రేయసి సింగ్, ఎమ్మా కాక్స్‌లకు 96 పాయింట్లు చొప్పున రావటంతో.. వారిద్దరికీ మరొక పోటీ నిర్వహించారు. ఇందులో శ్రేయసి సింగ్ విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది.

మొత్తం నాలుగు రౌండ్లలో 24, 25, 22, 25 చొప్పున పాయింట్లు పాధించిన శ్రేయసి సింగ్.. స్వర్ణ పతకాన్ని నిర్ణయించే షూటౌట్ పోటీలో రెండు పాయింట్లు సాధించారు.

ఎమ్మా కాక్స్ వరుసగా 23, 28, 27, 18 పాయింట్లు సాధించి.. షూటౌట్‌లో ఒక పాయింట్ సాధించారు.

తృటిలో చేజారిన కాంస్యం

కాగా, ఇదే పోటీలో మరొక భారత క్రీడాకారిణి వర్ష వర్మన్ కూడా చివరి రౌండ్ వరకూ మెరుగ్గానే రాణించారు. తొలి మూడు రౌండ్లలో ఆమె 21, 25, 21 పాయింట్లు సాధించగా.. నాలుగో రౌండ్‌లో 19 పాయింట్లు పొందారు. మొత్తం 86 పాయింట్లతో ఆమె నాలుగో స్థానంలో నిలిచారు.

స్కాట్లాండ్ షూటర్ లిండా పియర్సన్ 87 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం పొందారు. ఒక్క పాయింట్ తేడాతో భారత్‌కు కాంస్య పతకం దూరమైంది.

మూడో స్థానంలో భారత్

కామన్‌వెల్త్ క్రీడల పతకాల పట్టికలో భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 11 గంటల సమయానికి భారత్ మూడో స్థానంలో ఉంది.

భారతీయ క్రీడాకారులు 12 స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో.. మొత్తం 23 పతకాలు సాధించారు.

ఈ క్రీడలు ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా.. 12 స్వర్ణ, 39 రజత, 42 కాంస్యాలతో మొత్తం 133 పతకాలు సాధించి మొదటి స్థానంలో ఉంది.

ఇంగ్లండ్.. 24 స్వర్ణాలు, 30 రజతాలు, 21 కాంస్యాలతో మొత్తం 75 పతకాలు సాధించి రెండో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెనడా, వేల్స్, స్కాట్లాండ్, నైజీరియా, సైప్రస్‌లు వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.

మొత్తం 71 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకూ 35 దేశాలు పతకాలు సాధించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)