సిరియా ‘రసాయన దాడి’: సైనిక చర్యకు దిగొద్దంటూ అమెరికాను హెచ్చరించిన రష్యా

  • 11 ఏప్రిల్ 2018
పుతిన్, ట్రంప్ Image copyright Getty Images

సిరియాలో రసాయన దాడి జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో.. వాటికి ప్రతిస్పందనగా సైనిక చర్యలకు దిగొద్దని అమెరికాకు రష్యా విజ్ఞప్తి చేసింది.

గురువారం ఐక్యరాజ్య సమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ.. ‘‘నేను మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నా.. మీరిప్పుడు సిద్ధం చేస్తున్న ప్రణాళికల నుంచి వెనక్కు తగ్గండి’’ అని చెప్పారు.

ఒకవేళ అమెరికా ‘ప్రణాళికల్ని’ అమలు చేస్తే, ‘అక్రమ సైనిక సాహసాలకు’ పాల్పడితే ‘బాధ్యత వహించాల్సి వస్తుంది’ అని ఆయన హెచ్చరించారు.

అయితే, సిరియాలో దాడికి పాల్పడిన బాధ్యులే లక్ష్యంగా.. కలసికట్టుగా పనిచేయాలని తాము నిర్ణయించుకున్నామని పాశ్చాత్య దేశాల నాయకులు చెబుతున్నారు.

ఏ దాడులైనా.. సిరియా ప్రభుత్వ రసాయన వసతులను లక్ష్యంగా చేసుకునే జరుగుతాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ తెలిపారు.

సిరియాలో ‘రసాయన దాడి’పై అంతర్జాతీయ సమాజం తప్పకుండా స్పందించాల్సిందేనంటూ బ్రిటన్ సైతం అమెరికా, ఫ్రాన్స్‌లతో ఏకీభవించింది.

ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌లతో బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మే ఫోన్లో చర్చలు జరిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అనుమానాస్పద రసాయన దాడి జరిగిన డౌమా నగర శివార్లకు చేరుకుంటున్న సిరియా సైనిక దళాలు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘చీలిక’

కాగా, రసాయన దాడిగా ఆరోపణలున్న సిరియా దాడిపై సరికొత్త విచారణ జరపాలన్న అమెరికా ప్రతిపాదనపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చీలిక ఏర్పడింది.

ఈ ప్రతిపాదనపై ఓటింగ్‌కు చైనా దూరంగా ఉంది. రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. దీంతో అమెరికా ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. ఇదే అంశంపై రష్యా ప్రవేశపెట్టిన మరొక ప్రతిపాదనకు కూడా తగినంత మద్దతు లభించలేదు.

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వమే గత శనివారం.. ప్రస్తుతం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఈస్ట్రన్ ఘౌటా ప్రాంతంలోని డౌమా పట్టణంలో అనుమానాస్పద రసాయన దాడికి పాల్పడిందని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అమెరికా ప్రతిపాదించింది.

అయితే, సిరియా మాత్రం రసాయన దాడులను కొట్టిపారేస్తోంది. సిరియాకు సైనిక అవసరాల పరంగా రష్యా మద్దతుగా ఉంది.

ఈ దాడిలో 60 మందికి పైగా ప్రజలు మృతి చెందారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: రసాయన దాడులపై డొనాల్డ్ ట్రంప్ విధానమేంటి?

అమెరికా ఏం చేయొచ్చు?

సిరియాలో రసాయన దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా దూకుడు పెంచింది. ఈ దాడులకు త్వరలో గట్టి జవాబిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.తమకు చాలా మార్గాలున్నాయని ట్రంప్ అంటున్నారు. అయితే.. ఆ మార్గాలేంటి?

రాయబారం

మొదటిది దౌత్యమార్గం అనుకోవచ్చు. కానీ, ఇందులో చాలా సమస్యలున్నాయి.

సిరియాతో పాటు రష్యా, ఇరాన్‌లపై కూడా అమెరికా ఆంక్షలు విధించవచ్చు. అయితే, రష్యా కూడా వెనక్కి తగ్గడం లేదు. సిరియాలో రసాయనిక దాడులపై దర్యాప్తునకు అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని అమెరికా అన్నప్పుడు.. రష్యా దానికి అడ్డుపడింది. సిరియాలోని డౌమలో రసాయనిక దాడులు జరిగినట్లు తమ పరిశోధనలో తేలిందని అమెరికా చెబుతోంటే.. తమ పరిశోధనలో రసాయనిక దాడులు జరగలేదని తేలిందంటూ రష్యా కొట్టిపారేసింది.

ఎటువంటి ఆరోపణలను అంగీకరించేందుకు రష్యా సిద్ధంగా లేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ఆరోపణలు చేసేందుకు వెనుకాడరని అందరికీ తెలుసు!

ట్రంప్ మాటలతో ఒక విషయం స్పష్టమవుతోంది. అదేమిటంటే, దౌత్యంతో పని కాకపోతే అమెరికాకు ఉన్న మరో మార్గం దాడి చేయడం.

Image copyright Getty Images

దాడులు

అవి పరిమిత దాడులు కూడా కావచ్చు. ఎలాగంటే ఏడాది కిందట సిరియాలోని షెరాజ్ ఎయిర్ బేస్‌పై అమెరికా దాడి చేసింది. భారీ దాడులు సైతం చేయగలమన్న సందేశాన్ని ఇవ్వడమే ఆనాటి అమెరికా దాడుల ఉద్దేశం.

కానీ అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

అంటే ఇప్పుడు మరో మార్గం విస్తృత దాడులు చేయటం కావొచ్చు. ఒక వేళ భారీ దాడులు జరిగితే వాటి పరిణామాలేంటి?

నేరుగా చెప్పకపోయినా.. భారీ దాడులు చేస్తామని అర్థం వచ్చేలాగా ట్రంప్ మాట్లాడారు. అయితే.. సిరియా నెపంతో అమెరికా, రష్యాలు తలపడితే.. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు కూడా పాల్గొంటే అప్పుడది ప్రపంచ యుద్ధం లాంటి పెద్ద యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది.

కానీ, ఈ దేశాలు అమెరికాకు ఎంతవరకు మద్దతు ఇస్తాయన్నదే అసలు ప్రశ్న.

ఒకవేళ ఆ దేశాలు మద్దతు ఇవ్వకుంటే.. ట్రంప్ గతంలో చాలాసార్లు అన్నట్లు అమెరికా ఒంటరిగానే పోరాడుతుందా?

అధికారిక పర్యటన రద్దు చేసుకున్న ట్రంప్

కాగా, సిరియా అంశంపై దృష్టి సారించేందుకు, అమెరికా ప్రతిస్పందన వ్యవహారాలను సమీక్షించేందుకు వాషింగ్టన్‌లోనే ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారని వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో లాటిన్ అమెరికాలో జరపాల్సిన ట్రంప్ తొలి అధికారిక పర్యటన రద్దయ్యింది.

Image copyright AFP

సిరియా ‘రసాయన దాడి’పై నిజ నిర్ధరణ

రసాయన దాడి అంటూ అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న డౌమా దాడిపై నిజ నిర్థారణ జరిపేందుకు ఒక బృందాన్ని పంపిస్తున్నట్లు.. రసాయన ఆయుధాల నిషేధం కోసం పనిచేస్తున్న ఓపీసీడబ్ల్యు సంస్థ ప్రకటించింది.

అయితే, సిరియాలోని డౌమా నగరంలో జరిగింది రసాయన దాడేనా? కాదా? అన్న అంశాన్ని మాత్రమే ఈ సంస్థ తేలుస్తుంది. ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది నిర్థారించదు.

మధ్యప్రాచ్యంపై ‘విమాన రాకపోకల’ జాగ్రత్తలు

సిరియా వ్యవహారంపై అగ్ర రాజ్యాల వాడివేడి ప్రకటనల నేపథ్యంలో తూర్పు మధ్యప్రాచ్యం పరిధిలో విమానాల రాకపోకలకు సంబంధించి జాగ్రత్త వహించాలని యురోపియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచించింది.

ఈ ప్రాంతంలో రాబోయే 72 గంటల్లో క్షిపణి దాడులు జరగొచ్చునని యురోపియన్ ఏటీసీ తెలిపింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)