అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం: 257 మంది మృతి

  • 12 ఏప్రిల్ 2018
విమాన ప్రమాదం Image copyright Reuters

అల్జీరియాలో ఓ సైనిక విమానం కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 257 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

మృతుల్లో 26 మంది పోలిసారియో ఫ్రంట్‌కు చెందిన వారు. అల్జీరియా మద్దతు గల ఈ సంస్థ మొరాకో నుంచి విడిపోయి స్వతంత్ర పశ్చిమ సహారా ఏర్పాటు కోసం పోరాడుతోంది.

అల్జీరియా రాజధాని అల్జీర్స్ సమీపంలో ఉన్న బౌఫారిక్ సైనిక విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ విమానం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టం కాలేదు.

అల్జీరియా ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

జులై 2014లో జరిగిన మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్17 విమాన ప్రమాదం తర్వాత ప్రపంచంలో ఇదే అతి పెద్ద విమాన ప్రమాదం. తూర్పు ఉక్రెయిన్‌లో ఆ విమానాన్ని సాయుధులు కూల్చివేశారు. ఆ విమానంలో ఉన్న మొత్తం 298 మంది ప్రయాణికుల్లో ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు.

మృతుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధికారులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు.

ప్రమాద స్థలానికి 14 అంబులెన్సులు చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ఈ విమాన ప్రమాదంపై ఆర్మీ చీఫ్ విచారణకు ఆదేశించారు. ఆయన ప్రమాద స్థలానికి బయల్దేరారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇల్యూషిన్ Il-76 రకానికి చెందిన ఈ విమానం దేశంలోని నైరుతి ప్రాంతంలో ఉన్న బెచార్‌కు బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది.

అల్జీరియాలో నాలుగేళ్ల క్రితం కూడా ఓ విమాన ప్రమాదం జరిగింది.

సైనిక సిబ్బందినీ, వారి కుటుంబ సభ్యులను తీసుకెళ్తున్న విమానం కూలిపోగా 77 మంది మృతి చెందారు.

గత 15ఏళ్లలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదాలు

17 జులై 2014: మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 17 విమానం తూర్పు ఉక్రెయిన్‌లో కూలిన ప్రమాదంలో విమానంలో ఉన్న 298మంది చనిపోయారు. వాళ్లలో 193మంది డచ్ ప్రయాణీకులే ఉన్నారు. రష్యా అనుకూల తిరుగుబాటుదారులే ఈ విమానాన్ని కూల్చేసారన్న ఆరోపణలున్నా, వాళ్లు మాత్రం వాటిని ఖండిస్తున్నారు.

19 ఫిబ్రవరి 2003: ఇరాన్‌కు చెందిన మిలటరీ విమానం కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 276మందీ చనిపోయారు.

1 జూన్ 2009: ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 330, రియో డీ జనీరో నుంచి పారిస్ వెళ్తుండగా అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 228మంది ప్రయాణిస్తున్నారు. సహాయకులు 50 మృత దేహాలను మాత్రమే కనుగొనగలిగారు.

31 అక్టోబర్ 2015:రష్యాలోని కోగలిమావియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిన ఘటనలో లోపలున్న 224మందీ చనిపోయారు. సిరియా వ్యవహారాల్లో రష్యా జోక్యం చేసుకుంటున్న కారణంగానే ఆ విమానాన్ని కూల్చేసినట్లు ఐఎస్‌ స్థానిక అనుబంధ సంస్థ ఒకటి పేర్కొంది.

7 జులై 2007:టీఏఎమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానాశ్రయంలో దిగే సమయంలో కూలిపోయింది. బ్రెజిల్ చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదమిది. ఈ ఘటనలో మొత్తం 199మంది చనిపోయారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు