క్షిపణులు దూసుకొస్తాయి.. సిద్ధంగా ఉండండి - ట్రంప్ హెచ్చరిక

అమెరికా యుద్ధ విమానాలు

సిరియాలోని డ్యూమా పట్టణంలో అనుమానాస్పద 'రసాయన దాడి' ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు.

"రష్యా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే క్షిపణులు దూసుకొస్తాయి. అవి కొత్తవి. మరింత స్మార్ట్ కూడా" అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

'రసాయన దాడి' సాకుగా చూపి సిరియాలో అమెరికా 'అక్రమ సైనిక సాహసాలకు' పాల్పడితే 'బాధ్యత వహించాల్సి వస్తుంది' అని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఇలా స్పందించారు.

తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఈస్ట్రన్ ఘూటా ప్రాంతంలోని డ్యూమా పట్టణంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వమే అనుమానాస్పద 'రసాయన దాడి'కి పాల్పడిందని అమెరికా ఆరోపిస్తోంది.

అయితే, ఈ ఆరోపణలను అసద్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

గురువారం సిరియా అధ్యక్షుడిని 'గ్యాస్ కిల్లింగ్ యానిమల్' అని ట్రంప్‌ అభివర్ణించారు.

అమెరికా-రష్యా సంబంధాలపై ఒక నల్లని చిత్రం గీసి మరో ట్వీట్ చేశారు. ఈ రెండు దేశాల సంబంధాలు ఇలా ఉండకూడదు అంటూ ఆకాంక్షించారు.

అనుమానాస్పద 'రసాయన దాడి'కి ప్రతిఫలంగా సిరియాపై వారంలోగా సైనిక చర్య తీసుకోవాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇందుకోసం కలిసి పనిచేయాలని ఈ దేశాలు నిర్ణయించాయి.

ఫొటో క్యాప్షన్,

అనుమానాస్పద రసాయన దాడి జరిగిన డ్యూమా నగర శివార్లకు చేరుకుంటున్న సిరియా సైనిక దళాలు

తర్వాత ఏం జరుగుతుంది?

లాటిన్ అమెరికాలో జరపాల్సిన ట్రంప్ తొలి అధికారిక పర్యటన రద్దయ్యింది.

సిరియా సంక్షోభంపై దృష్టిసారించాలనే ఉద్దేశంతోనే లాటిన్ అమెరికా పర్యటనను ట్రంప్ వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.

ఇదంతా చూస్తుంటే "సిరియాపై అమెరికా భారీ స్థాయిలో సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని" బీబీసీ వాషింగ్టన్ ప్రతినిధి బార్బరా ప్లెట్ అభిప్రాయపడ్డారు.

'రసాయన దాడి' ఘటనను అంచనా వేస్తున్నామని అమెరికా రక్షణమంత్రి జేమ్స్ మాట్టిస్‌ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ సైనిక చర్య అవసరం అనుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

అయితే, సిరియా విషయంలో ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైట్‌హౌజ్‌ అధికార ప్రతినిధి సారా శాండర్స్‌ చెప్పారు. పరిశీలనలో 'అన్నిరకాల మార్గాలు' ఉన్నాయని వివరించారు.

సిరియా 'రసాయన క్షేత్రాలు' లక్ష్యంగా దాడులు ఉండొచ్చని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ చెప్పారు.

సిరియాపై సైనిక చర్యకు అమెరికా, ఫ్రాన్స్‌తో కలిసి నడిచేందుకు బ్రిటన్ ప్రధానమంత్రి థేరిస్సా మే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముందుగా పార్లమెంట్‌ అనుమతి తీసుకోకుండానే ముందుకు వెళ్లాలని థెరిస్సా మే భావిస్తున్నట్లు బీబీసీకి తెలిసింది.

అమెరికా క్షిపణి విధ్వంసక నౌక యూఎస్‌ఎస్ డొనాల్డ్ కుక్ మధ్యధరా సముద్రంలో ఉంది.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రష్యా యుద్ధ నౌకలు కూడా సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సిరియా టార్టస్ నౌకాశ్రయంలో ఉన్న రష్యా యుద్ధ నౌకలు ఇప్పుడు సముద్రంలో మోహరించినట్లు తెలుస్తోంది.

డ్యూమా పట్టణంలో అసలేం జరిగింది?

ప్రభుత్వ విమానాలు రసాయనాలు నింపిన బాంబులను డ్యూమా పట్టణంపై వేశాయని ప్రతిపక్ష కార్యకర్తలు, సహాయ సిబ్బంది చెబుతున్నారు.

రాజధాని డమాస్కస్‌కు సమీపంలో ఉన్న డ్యూమాలో తిరుగుబాటుదారులకు గట్టి పట్టుంది.

అనుమానాస్పద రసాయనదాడిలో 500మంది చికిత్స పొందుతున్నారని తిరుగుబాటుదారుల ప్రాంతాల్లో సహాయం అందిస్తున్న సిరియన్-అమెరికన్ మెడికల్ సొసైటీ-సామ్స్‌, స్థానిక సహాయ సిబ్బంది చెప్పారు.

ఈ నివేదికలను పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన భాగస్వాములను కోరింది. ఇందులో సామ్స్ సంస్థ కూడా ఉంది.

రసాయన దాడిగా చెబుతున్న దాడిలో 70 మంది చనిపోయారు. వీరిలో 43 మంది రసాయన దాడి ప్రభావానికి గురైనట్లు చెబుతున్నారు.

అది రసాయన దాడా.. కాదా అన్న విషయం తేల్చేందుకు ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్- ఓపీసీడబ్ల్యూ బృందం త్వరలోనే సిరియాలో పర్యటించనుంది.

డ్యూమాలో గత వారం రోజుల నుంచి తిరుగుబాటుదారులపై సిరియా-రష్యా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి.

దాంతో తిరుగుబాటుదారులు రష్యా సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుని డ్యూమా నగరం వదిలి వెళ్తున్నారు.

రష్యా ఏమంటోంది?

రసాయన దాడిని ఒక సాకుగా చూపుతూ తమ భాగస్వామి సిరియాపై దాడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా ఆరోపిస్తోంది.

ఘటన స్థలం నుంచి గురువారం సేకరించిన శాంపుల్స్‌లో ఎలాంటి రసాయన దాడి ఆనవాళ్లు కనిపించలేదని రష్యా చెబుతోంది.

సిరియాపై అమెరికా సైనిక చర్యకు దిగితే రష్యా తప్పకుండా స్పందిస్తుందని రష్యా సీనియర్ అధికారులు అన్నారు.

అయితే, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కోలో జరిగిన రాయబారుల సదస్సులో అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.